ETV Bharat / bharat

కశ్మీరీ సుజానీ టోపీకి పెరుగుతున్న ఖ్యాతి- దేశవిదేశాల్లోనూ డిమాండ్

కశ్మీర్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సుజానీ టోపీకి పెరుగుతున్న ఆదరణ- యువతతో పాటు వృద్ధులు కూడా ఆసక్తిగా ధరిస్తున్న సంప్రదాయ టోపీ

Kashmiri Suzani Topi Demand
Kashmiri Suzani Topi Demand (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 3:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kashmiri Suzani Topi Demand : కశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సుజానీ టోపీ ఇప్పుడు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి గుర్తింపు పొందుతోంది. గౌరవానికి చిహ్నంగా భావించే ఆ టోపీని కశ్మీరీలు ఎంతో ప్రేమతో ధరిస్తారు. సంప్రదాయ హస్తకళలతో, సున్నితమైన సూదిపని (సుజానీ ఎంబ్రాయిడరీ)తో తయారయ్యే ఆ టోపీ ప్రస్తుతం యువత నుంచి వృద్ధుల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కశ్మీరీ గుర్తింపును ప్రతిబింబిస్తూ!
శ్రీనగర్ ఓల్డ్ సిటీలోని నోవ్‌హట్టా ప్రాంతంలో ఉన్న కొన్ని సంప్రదాయ దుకాణాలు ఆ సుజానీ టోపీలకు కేంద్రాలుగా మారాయి. తరతరాలుగా టోపీ తయారీ వృత్తిలో ఉన్న కళాకారులు ఇక్కడ ప్రత్యేకమైన డిజైన్లతో సుజానీ టోపీలను తయారు చేస్తున్నారు. సాధారణ టోపీలతో పోలిస్తే ఇవి మరింత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, కశ్మీరీ గుర్తింపును ప్రతిబింబిస్తాయి.

Kashmiri Suzani Topi
కశ్మీరీ సుజానీ టోపీల దుకాణం (ETV Bharat)

ఎంతో మృదువుగా!
సుజానీ టోపీ ప్రత్యేకత దాని తయారీ విధానంలోనే ఉంది. ఆ టోపీలపై చేసే ఎంబ్రాయిడరీ మొత్తం చేతిపనితో జరుగుతుంది. వివిధ ఆకృతులు, పూల డిజైన్లు, సంప్రదాయ మోటిఫ్‌లతో సుజానీ సూదిపని చేయడం వల్ల ప్రతి టోపీ ఒక ప్రత్యేక కళాఖండంలా కనిపిస్తుంది. పాష్మినా వంటి విలువైన వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేయడం వల్ల టోపీ మరింత మృదువుగా మారుతుంది.

Kashmiri Suzani Topi
కశ్మీరీ సుజానీ టోపీలు (ETV Bharat)

ప్రస్తుతం విపరీతమైన ఆదరణ
అనుభవజ్ఞులైన టోపీ తయారీదారులు ఫయ్యాజ్ అహ్మద్, రియాజ్ అహ్మద్ షా మాట్లాడుతూ, "సుజానీ టోపీలను మేం కొన్ని సంవత్సరాల క్రితమే ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. సాధారణంగా సుజానీ ఎంబ్రాయిడరీతో షాల్స్ తయారు చేస్తారు. అదే విధానాన్ని పాష్మినాపై టోపీలకు అన్వయించాం. మొదట కొన్ని మాత్రమే తయారు చేశాం. అవి చేతి చేతికి మారుతూ అమ్ముడుపోయాయి. అలా వాటికి విపరీతమైన ఆదరణ లభించింది" అని తెలిపారు.

ఒకప్పుడు యాత్రలకు మాత్రమే, కానీ ఇప్పుడు!
ఇప్పుడు స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని వారు చెప్పారు. వృద్ధుల అభిరుచికి తగ్గట్టుగా సంప్రదాయ రంగులు, డిజైన్లు యువతను ఆకట్టుకునేలా ఆధునిక శైలిలో డిజైన్లు రూపొందిస్తున్నామని వివరించారు. గతంలో హజ్, ఉమ్రా వంటి యాత్రలకు వెళ్లేవారు ఎక్కువగా ఈ టోపీలను కొనుగోలు చేసేవారని, ఇప్పుడు మాత్రం సాధారణ రోజుల్లోనూ ప్రజలు వీటిని ధరిస్తున్నారని తెలిపారు.

"ఇతరులు ధరించడాన్ని చూసి నేనూ ఆసక్తి చూపించాను. ఎన్నో రకాల టోపీలు వాడాను కానీ, సుజానీ టోపీ దాని డిజైన్, నాణ్యతలో ప్రత్యేకంగా అనిపించింది"
- సయీద్ అలీ, కొనుగోలుదారు

నాణ్యం విషయంలో రాజీ పడం!
టోపీ వ్యాపారంలో ఉన్న అద్నాన్, సుబాన్ ఫయ్యాజ్ షా మాట్లాడుతూ, "మేం నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడం. అందుకే ఒకసారి మా దగ్గర కొనుగోలు చేసినవారు మళ్లీ తమ స్నేహితులు, బంధువులను కూడా తీసుకొస్తారు. కొత్త తరం యువత సుజానీ టోపీలను ఎంతో ఇష్టపడుతోంది. చిన్న పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయమని చాలామంది కోరుతున్నారు" అని అద్నాన్, సుబాన్​ తెలిపారు.

Kashmiri Suzani Topi
కశ్మీరీ సుజానీ టోపీలు (ETV Bharat)

రూ.1500- రూ.20 వేల మధ్య ధరతో!
సాధారణ టోపీలతో పోలిస్తే సుజానీ టోపీ తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. క్లిష్టమైన డిజైన్ ఉన్న టోపీ పూర్తవ్వడానికి నెలల సమయం కూడా పట్టొచ్చు. అందుకే వీటి ధరలు రూ.1500 నుంచి రూ.20 వేల వరకు ఉంటాయి. అయినప్పటికీ కళ, సంప్రదాయం, నాణ్యతకు ఇచ్చే విలువ కారణంగా సుజానీ టోపీకి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలా కశ్మీర్ సంప్రదాయ హస్తకళకు మరో గుర్తింపుగా నిలుస్తున్న సుజానీ టోపీ స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతోందని చెప్పాలి.

Kashmiri Suzani Topi
కశ్మీరీ సుజానీ టోపీలు (ETV Bharat)

హెల్త్​ అవేర్​నెస్​పై సైకిల్ యాత్ర- 22 రోజుల్లోనే కశ్మీర్ టు కన్యాకుమారి- 3,650 కి.మీ రైడింగ్

పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్- టూరిస్టులు లేక కశ్మీర్ వెలవెల- రోడ్డున పడ్డ ఫ్లోటింగ్ హౌస్ బోట్ల యజమానులు!