అయోధ్య గుడిలో నమాజ్ చేసేందుకు విఫలయత్నం- అరెస్ట్ చేసిన పోలీసులు- భద్రత పెంచిన అధికారులు
D1 ద్వారా రామమందిర ప్రాంగణంలోకి ప్రవేశం- సీతా రసోయి వద్ద కూర్చొని నమాజ్ చేసేందుకు సిద్ధమవుతుండగా భక్తుల నిరసన- వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది- ఘటన తర్వాత కట్టుదిట్టమైన భద్రత

Published : January 11, 2026 at 7:05 AM IST
Man Namaz In Ayodhya Temple : అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర ప్రాంగణంలో భద్రతకు సంబంధించిన సున్నిత ఘటన చోటుచేసుకుంది. మందిరంలోకి ప్రవేశించిన ఓ కశ్మీర్ నివాసి నమాజ్ చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అయోధ్యలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
భక్తుడిగా నటించి లోపలికి ప్రవేశం
ఎస్‌పీ (సెక్యూరిటీ) బలరామాచారి దూబే తెలిపిన వివరాల ప్రకారం, కశ్మీర్‌లోని షోపియన్ జిల్లా వాసి అబూ అహ్మద్ షేక్ (55) రామమందిర ప్రాంగణంలోకి గేట్ D1 ద్వారా భక్తుడిగా నటిస్తూ ప్రవేశించాడు. దర్శన మార్గంలో లోపలికి వెళ్లిన అనంతరం సీతా రసోయి సమీపంలో కూర్చొని నమాజ్ చేయడం ప్రారంభించాడు. ఈ దృశ్యాన్ని గమనించిన భక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా సంస్థల విచారణ
ఘటన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అబూ అహ్మద్ షేక్‌ను భద్రతా ఏజెన్సీలు విచారిస్తున్నాయి. అయోధ్యకు ఎందుకు వచ్చాడు? రామమందిర ప్రాంగణంలోకి ప్రవేశించిన ఉద్దేశం ఏమిటి? దీని వెనుక ఏమైనా ముందస్తు ప్రణాళిక ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అతని ప్రయాణ వివరాలు, ఎవరైనా ఇతరులు ఇందులో భాగస్వాములా అనే అంశాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.

అంతా 'శ్రీరామ'మయం- ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 'అయోధ్య నగరి' నిర్మాణం
కుటుంబ సభ్యుల వాదన
ఇదిలా ఉండగా, అబూ అహ్మద్ షేక్ కుటుంబ సభ్యులు ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చెబుతున్నారు. శ్రీనగర్ మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగానికి చెందిన వైద్య రికార్డులను ఆధారంగా చూపించినట్లు పోలీసులు తెలిపారు. "మాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. ఆయన పూర్తిగా మానసికంగా అస్థిరంగా ఉన్నారు" అని అతని కుమారుడు ఇమ్రాన్ మీడియాతో మాట్లాడాడు. ఈ వాదనలను కూడా అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు.
నినాదాలు చేసినట్టు సమాచారం
సంఘటన సమయంలో అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో షేక్ కొన్ని నినాదాలు చేసినట్టు వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రాథమిక తనిఖీల్లో అతని వద్ద జీడిపప్పు, కిస్‌మిస్ వంటి వస్తువులు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో అతడు తాను అజ్మీర్‌కు ప్రయాణిస్తున్నానని చెప్పినట్టు సమాచారం.
రామమందిర ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత
ఈ ఘటన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి మందిర ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద అప్రమత్తత పెంచారు. వచ్చే, వెళ్లే భక్తుల తనిఖీలను మరింత కఠినతరం చేశారు. "ప్రవేశ ద్వారాల వద్ద అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు విషయం వెల్లడవుతుంది" అని ఎస్‌పీ బలరామాచారి దూబే తెలిపారు.
అధికారిక స్పందన లేదు
ఈ ఘటనపై జిల్లా పరిపాలన, రామమందిర ట్రస్ట్ ఇప్పటివరకు అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. దర్యాప్తు పూర్తైన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన రామమందిర ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భద్రతా సంస్థలు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేపట్టడంతో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శతాబ్దాల నాటి గాయాలు ఇవాళ నయం అవుతున్నాయ్ - అయోధ్యలో ప్రధాని మోదీ
వేల ఏళ్లు నిలిచేలా అయోధ్య రామాలయ నిర్మాణం- కట్టడమంతా రాతి దిమ్మెలతోనే- ధ్వజారోహణకు అంతా సిద్ధం!
అయోధ్యలో అతి ప్రాచీన హనుమాన్ ఆలయం- మిస్ అయితే యాత్ర అసంపూర్ణమే!

