ETV Bharat / bharat

కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా- అదే అవినీతి ఆరోపణలపై రెండోసారి

డీకే శివకుమార్ మంత్రివర్గం నుంచి వైదొలగిన కాంగ్రెస్ నేత నాగేంద్ర- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 25 రోజులకే- రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ నిధుల అక్రమాల ఆరోపణలే నేపథ్యంలోనే

Karnataka Minister Nagendra Resigns
కర్ణాటక ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బీ నాగేంద్ర (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 6:59 PM IST

|

Updated : August 28, 2026 at 7:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Karnataka Minister Nagendra Resigns : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి మంత్రి పదవి రాజీనామా వ్యవహారం కలకలం రేపింది. డీకే శివకుమార్ మంత్రివర్గం నుంచి కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే బీ నాగేంద్ర వైదొలిగారు. వాల్మీకి కుంభకోణ ఆరోపణలతో రెండేళ్ల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన, ఇటీవలే మళ్లీ కేబినెట్‌లో చేరారు. ఇప్పుడు అదే వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో పదవి నుంచి తప్పుకున్నారు.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​లో సుమారు రూ.89 కోట్ల నిధుల ఆక్రమ బదిలీ జరిగిందన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపాయి. 2024 మేలో కార్పొరేషన్ అకౌంట్స్​ అధికారి పీ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన రాసినట్లు పేర్కొన్న లేఖలో అనుమతి లేకుండా నిధులను ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం జరిగిన దర్యాప్తులో కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాల నుంచి భారీ మొత్తాలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్రపై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.

రెండేళ్లలో రెండోసారి రాజీనామా
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నాగేంద్ర ఉన్నారు. ఈ వివాదం నేపథ్యంలో 2024 జూన్​లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్​లోకి నాగేంద్రను ఆగస్టు 3న తిరిగి తీసుకున్నారు. ఈసారి ఆయనకు ప్రణాళిక, గణాంకాల శాఖను కేటాయించారు. అయితే తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పాత వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. వర్షాకాల సమావేశాల సమయంలోనూ శాసనసభ లోపల, బయటా ఇదే అంశంపై బీజేపీ, జేడీఎస్‌ నిరసనలు తెలిపాయి. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో శుక్రవారం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసిన అనంతరం నాగేంద్ర తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

దళితుడినే కారణంగానే
రాజీనామా ప్రకటిస్తున్న సమావేశంలో నాగేంద్ర తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందని, అసెంబ్లీలో తనపై వచ్చిన ఆరోపణల గురించి చర్చిద్దామని ఎన్నిసార్లు పిలిచినా బీజేపీ నేతలు ముందుకు రాలేదని విమర్శించారు. బీజేపీకి గిరిజన వ్యతిరేక ఆలోచనా విధానం ఉందని, వారు మనుస్మృతిని రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను దళితుడిని అయినందుకే తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించిందా అన్న ప్రశ్నకు నాగేంద్ర స్పందిస్తూ, తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బీజేపీ పాదయాత్రకు ముందే కీలక నిర్ణయం
కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కర్ణాటక బీజేపీ సెప్టెంబర్‌ 1 నుంచి 10 వరకు రాయచూరు నుంచి బళ్లారి వరకు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్చ్‌లో నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ప్రధాన అంశంగా ప్రస్తావించాలని బీజేపీ భావించింది. రైతుల సమస్యలు, నిరుద్యోగం, నియామకాల్లో అవినీతి ఆరోపణలు తదితర అంశాలను కూడా పాదయాత్రలో లేవనెత్తనుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగేంద్ర రాజీనామా చేశారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌ వరకు
నాగేంద్ర రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరమే. 2008లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 2013లో స్వతంత్ర అభ్యర్థిగా కుడ్లిగి నుంచి గెలిచారు. అనంతరం 2018లో కాంగ్రెస్‌లో చేరారు. బళ్లారి ఎస్​టీ రిజర్వ్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఎస్​టీ నేతగా గుర్తింపు పొందిన నాగేంద్ర, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

Last Updated : August 28, 2026 at 7:51 PM IST