ETV Bharat / bharat

సీఎం కుర్చీ కోసం కుమ్ములాట లేదు- అదంతా మీ సృష్టే : సిద్ధరామయ్య

కాంగ్రెస్‌లో సీఎం సీటు వార్ అంటూ బీజేపీ ప్రచారం- సంక్రాంతి తర్వాత అసలు సినిమా ఉందన్న కమలనాథులు- ఇదంతా ఉత్తుత్తిదేనని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం

Siddaramaiah on CM Seat Issue
Siddaramaiah on CM Seat Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 3:52 PM IST

|

Updated : January 11, 2026 at 4:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Siddaramaiah on CM Seat Issue : కర్ణాటక కాంగ్రెస్​లో ముఖ్యమంత్రి పీఠం కోసం మళ్లీ వివాదం ప్రారంభం కానుందన్న వార్తలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. "రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం ఎలాంటి గొడవ లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. అనవసరమైన ప్రశ్నలతో గందరగోళం సృష్టించకండని మీడియాపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో అసలు సిసలైన కుర్చీ పోరు మొదలవుతుందని బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన ప్రభుత్వానికి, పదవికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లు తామే సుస్థిర పాలన అందిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

అసలు గొడవ ఎందుకు వచ్చింది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తైన క్రమంలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. గత నవంబర్ 20తో ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో రెండున్నరేళ్లు దాటింది. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. దీని ప్రకారం, సగం కాలం సిద్ధూ, మిగతా సగం డీకే సీఎంగా ఉంటారని టాక్. ఇప్పుడు ఆ సమయం దాటడంతో బీజేపీ దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. "సంక్రాంతి తర్వాత చూడండి, కాంగ్రెస్ కుర్చీలాట మొదలవుతుంది" అని బీజేపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయి. దీనిపైనే సిద్ధరామయ్య సీరియస్‌గా స్పందించారు. "అసలు గొడవ ఎక్కడుంది? మీరే (మీడియా) సృష్టిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్వేష ప్రసంగాల బిల్లుపై రచ్చ
ఈ సందర్భంగా గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న 'ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లు' గురించి కూడా సీఎం మాట్లాడారు. ఈ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ థావర్‌చంద్ గహ్లాత్​ను కోరింది బీజేపీ. దీనిపై సీఎం స్పందిస్తూ, "ఈ బిల్లును చట్టసభలు ఆమోదించాయి. గవర్నర్ దీన్ని తిరస్కరించలేదు, వెనక్కి పంపలేదు, అలాగని ఆమోదమూ తెలపలేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజ్ భవన్‌కు వెళ్తాను. బిల్లు ఆవశ్యకత గురించి గవర్నర్‌కు స్వయంగా వివరిస్తాను" అని చెప్పారు. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలకు పాల్పడితే రూ.50 వేల జరిమానాతో పాటు ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో కఠిన నిబంధనలు ఉన్నాయి.

బళ్లారి పాదయాత్ర, బీజేపీ డ్రామా?
బళ్లారిలో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో బీజేపీ 'బళ్లారి టు బెంగళూరు' పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై స్పందించిన సీఎం, "వాళ్లను యాత్ర చేసుకోనివ్వండి. వద్దని ఎవరు చెప్పారు?" అంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. "గతంలో మేం (కాంగ్రెస్) పాదయాత్ర చేసింది ఒక నిర్దిష్ట కారణం కోసం. అప్పట్లో బళ్లారిని గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అక్రమ మైనింగ్‌తో రిపబ్లిక్ ఆఫ్ బళ్లారిగా మార్చేశారని లోకాయుక్త నివేదిక ఇచ్చింది. అసెంబ్లీలో నేను మాట్లాడితే అప్పటి సీఎం యడియూరప్ప, రెడ్డి సోదరులు అడ్డుకున్నారు. అందుకే నేను పాదయాత్ర చేసి వారి అక్రమాలను బయటపెట్టాను. అది 2013లో మా గెలుపునకు పునాది వేసింది. కానీ ఇప్పుడు బీజేపీ చేస్తోంది కేవలం రాజకీయ లబ్ధి కోసమే" అని విమర్శించారు.

అసలు బళ్లారిలో ఏం జరిగింది?
జనవరి 1న బళ్లారిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన బ్యానర్ కట్టారు. దీన్ని బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వర్గీయులు తొలగించడంతో గొడవ మొదలైంది. ఇది రాళ్ల దాడికి, కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. "వాల్మీకి విగ్రహం బ్యానర్ తీసేయాల్సిన అవసరం ఏముంది? అదే రెచ్చగొట్టే చర్య. బళ్లారిలో పట్టు కోల్పోయామని జనార్దన్ రెడ్డి, శ్రీరాములు అసూయతో రగిలిపోతున్నారు. అందుకే ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారు" అని సిద్ధరామయ్య ఆరోపించారు.

కేంద్రం వార్నింగ్‌తో దిగొచ్చిన మస్క్- తప్పు ఒప్పుకున్న 'ఎక్స్'- 600 ఖాతాలు తొలగింపు

'గాలి నాణ్యత'ను కేంద్రం గాలికొదిలేసింది- దేశవ్యాప్త సమస్యపై సరైన స్పందన లేదు: కాంగ్రెస్

Last Updated : January 11, 2026 at 4:10 PM IST