గురువారం సిద్ధరామయ్య రాజీనామా!- మే30న కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం?
గురువారం గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సిద్ధరామయ్య- రాజీనామా చేసేందుకేనా?

Published : May 27, 2026 at 3:05 PM IST
Siddaramaiah To Resign : కర్ణాటకలో నాయకత్వ మార్పు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళవారం దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశమైన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం సిద్దరామయ్య గురువారం రాజీనామా చేస్తారని విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య గురువారం గవర్నర్‌ను సమయం కోరడం, నాయకత్వ మార్పుపై అప్పుడే మాట్లాడతానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా మే 30న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
శివకుమార్‌తో ఆల్పాహార సమావేశం
మంగళవారం దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టంగా చెప్పినప్పటికీ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్య తన రాజీనామాను గవర్నర్ గెహ్లోత్‌కు సమర్పించే అవకాశం ఉంది. సిద్ధరామయ్య తన అధికారిక నివాసం 'కావేరి'లో గురువారం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రివర్గ సహచరులతో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బెంగళూరులోని విధాన సౌధలో ఆయనకు సీఎం నివాళులు అర్పించారు. తర్వాత సీఎం మార్పునకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై గురువారమే మాట్లాడతానని సిద్దరామయ్యచెప్పారు.
విడివిడిగా కలిసిన నేతలు
దిల్లీలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, శివకుమార్‌లతో విడివిడిగా సమావేశయ్యారు. వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పదవి నుంచి తప్పుకోవాలని సిద్దరామయ్యను అధిష్టానం కోరినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానం, కేంద్ర స్థాయిలో కీలక పాత్ర ఇవ్వజూపినట్లు వచ్చాయి. అయితే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసనమండలి ఎన్నికల గురించే చర్చించినట్లు సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. నాయకత్వ మార్పు గురించి కాదని చెప్పారు.
చెరోసగం రోజులు పాలిద్దాం!
గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నప్పటి నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత 18 నెలలుగా డీకే శివకుమార్ అనుచరులు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఇదేసమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నేత జి. పరమేశ్వరకు సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సూర్జేవాలా బెంగళూరులో కాంగ్రెస్ నాయకులతో సమావేశమై నాయకత్వ మార్పుపై స్పష్టత ఇచ్చే అవకాశముందని సమాచారం.
కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
మూడేళ్లుగా కర్ణాటకలో ప్రభుత్వం సుపరిపాలన అందించడంలో విఫలమైనట్లు అర్థం చేసుకుని సీఎం సిద్దరామయ్యను మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని బీజేపీ విమర్శించింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని, దీన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర జోస్యం చెప్పారు. శివమొగ్గలో విలేకరుల మాట్లాడిన విజయేంద్ర అసలు సమస్య సీఎం ఎవరు అవుతారనేది కాదని రాష్ట్ర పరిపాలన గురించి అని అన్నారు. రాష్ట్రంలో అంతర్గత కలహాల కారణంగా పరిపాలన పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. సిద్ధరామయ్య హయాంలో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ముడా సైట్ కేటాయింపుల వంటి కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే, సిద్ధరామయ్య రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు.
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు- కేంద్రంపై సీపీఎం బేబీ ఫైర్

