ETV Bharat / bharat

విద్యార్థులకు గుడ్​న్యూస్- వాళ్లందరికీ రూ.10 లక్షలు- తొలి కేబినెట్​లో సీఎం సంచలన నిర్ణయాలు!

డీకే శివకుమార్ నాయకత్వంలో తొలి మంత్రివర్గ సమావేశం- కీలక ప్రకటనలు చేసిన కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్!

CM SHIVAKUMAR
CM SHIVAKUMAR (Source : PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 10:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

DK Shivakumar First Cabinet Meeting : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకున్న వెంటనే డీకే శివకుమార్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. డీకే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆయన శుభవార్త చెప్పారు. విద్యార్థులందరికీ ఫ్రీ బస్‌పాస్‌లు ఇస్తామని ప్రకటించారు. ఈ పాస్​లతో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చని తెలిపారు. అలాగే రాష్ట్రంలో రైతుల వలసలు అరికట్టేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. వీటితోపాటు డీకే తొలి కేబినెట్ మీటింగ్​లో ఇతర సంక్షేమ కార్యక్రమాలపైనా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలను ముఖ్యమంత్రి శివకుమార్ వెల్లడించారు. మరి అవేంటంటే?

ఉచిత బస్​పాస్​లు, జాబ్ క్యాలెండర్!
ప్రస్తుతం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలకు, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. అయితే ఉచిత ప్రయాణం కోసం యువత నుంచి డిమాండ్ వస్తుందని అందుకే రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాల కోసం, త్వరలోనే క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇందులో ఎన్‌రోల్‌ చేసుకునేందుకు ప్రైవేట్‌ ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

దీనికి సంబంధించిన విధివిధానాలను నెల రోజుల్లోగా ఖరారు చేసి, ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇప్పటికే 56వేల ఉద్యోగాలను ప్రకటించిందని సీఎం అన్నారు. తదుపరి కేబినెట్ సమావేశం నాటికి, అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని నోటిఫికేషన్‌లు ఎప్పుడు జారీ చేస్తారు? నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే వివరాలతో ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పన కోసమే కేబినెట్​లో గంటకుపైగా చర్చించామని డీకే అన్నారు.

10వేల భారత్ జోడో యువ సంఘాల ఏర్పాటు!
యవతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 10వేల భారత్ జోడో యువ సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక్కో యువ సంఘానికి రూ.10 లక్షలు అందజేస్తామని అన్నారు. ఒక్కో యువజన సంఘంలో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ వార్డుల్లో 150 నుంచి 200 మంది సభ్యులు ఉంటారని సీఎం తెలిపారు. ఆ సంఘాల కార్యకలాపాలు క్రీడలు, సంస్కృతి, విద్య, నాయకత్వ అభివృద్ధిపై కేంద్రీకృతమ్యేలా ఉంటాయని అన్నారు.

బెంగళూరుకు రూ.2వేల కోట్లు!
ఇక అనధికార భవనాల యజమాన్యాలకు కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందని శివకుమార్ చెప్పారు. అందులో భాగంగానే బెంగళూరులో ప్రస్తుతం 1200 చదరపు అడుగుల స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. అందులోంచి వీటికి మినహాయింపు ఉంది. ఇకపై దీనిని 2500 చదరపు అడుగుల నిర్మాణాలకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక గ్రేటర్ బెంగళూరు అథారిటీ, బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాంతాలతో సహా, బెంగళూరులో రహదారి మౌలిక సదుపాయాల పనుల కోసం రూ. 2,000 కోట్ల నిధుల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది.

చివరగా, ప్రజాస్వామ్య నాలుగు స్తంభాలు సమన్వయంతో పనిచేయాలని నొక్కి చెప్పారు. తాను ప్రభుత్వ విమర్శలకు వ్యతిరేకం కాదని, అయితే మీడియా 'కల్పిత కథనాలు' ప్రసారం చేయకూడని అన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని శివకుమార్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం- కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం