ETV Bharat / bharat

తమిళనాట గవర్నర్ తీరుపై విపక్షాల అసహనం- విజయ్‌కు సపోర్ట్​గా వ్యాఖ్యలు

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌ను మరోసారి కలిసిన విజయ్- ఎమ్మెల్యేల మద్దతు చూపించాలని గవర్నర్ సూచించినట్లు ప్రచారం- విజయ్‌కు మద్దతుగా వీసీకే, సీపీఐ, కమల్ హాసన్

Tamilnadu Politics
Vijay (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2026 at 1:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tamilnadu Politics : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. కానీ గవర్నర్ వెంటనే అంగీకారం తెలపలేదని తెలుస్తోంది. ముందుగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించాలని విజయ్‌కు సూచించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాజ్ భవన్ నుంచి గానీ, టీవీకే నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌కు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు గళమెత్తుతున్నారు.

వీసీకే చీఫ్ తొల్ తిరుమావళవన్ గురువారం గవర్నర్‌ను కలిసి, అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకుని గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. "టీవీకేకు ప్రజలు అతిపెద్ద పార్టీగా తీర్పు ఇచ్చారు. అందువల్ల విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. మెజార్టీ ఉందా లేదా అన్నది అసెంబ్లీలో తేలాలి. గవర్నర్ ముందుగానే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపాలని అడగడం సరైంది కాదు" అని తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. విజయ్ మద్దతు కోరుతూ తమ పార్టీకి లేఖ రాశారని, దీనిపై నిర్ణయం త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్
సీపీఐ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కోరింది. "అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ముందుగా అవకాశం ఇవ్వాలి. ప్రమాణ స్వీకారం కంటే ముందే మెజార్టీ నిరూపించాలని అడగడం తగదు" అని సీపీఐ పేర్కొంది. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పును కూడా సీపీఐ ప్రస్తావించింది. మెజార్టీ నిరూపణ రాజ్ భవన్‌లో కాకుండా అసెంబ్లీలో జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. అందువల్ల గవర్నర్ వెంటనే టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది.

సీపీఎం కూడా ఈ అంశంపై స్పందించింది. టీవీకే అధినేత విజయ్ తమ పార్టీకి మద్దతు కోరుతూ లేఖ పంపినట్లు సీపీఎం నేత పి. షణ్ముగం తెలిపారు. శుక్రవారం జరగనున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళనాడు ప్రజలు ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని, కానీ టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు.

రూల్‌బుక్ ప్రకారమే నిర్ణయం
మరోవైపు తమిళనాడు బీజేపీ మాత్రం గవర్నర్ రాజ్యాంగ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ, "గవర్నర్‌కు ఎలాంటి గందరగోళం లేదు. ఆయన రాజ్యాంగం, రూల్‌బుక్ ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు" అని అన్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇతర పార్టీలు విజయ్‌కు మద్దతు ఇస్తే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీకి కావాల్సిన సంఖ్య మాత్రం దక్కలేదు. విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయనున్నందున అసెంబ్లీలో టీవీకే బలం 107కు తగ్గనుంది. కాంగ్రెస్ మద్దతుతో కలిపి ఈ కూటమి బలం 112కు చేరుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి- మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్‌ వెంబు

మరోసారి గవర్నర్​ను కలిసిన విజయ్​- ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్!