ETV Bharat / bharat

'అది ఐపీఎల్ మ్యాచ్ కాదు- జల్లికట్టు- ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్­' : మద్రాస్ హైకోర్టు

ప్రభుత్వమే దగ్గరుండి నిర్వహించాలి- అవనియాపురం పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు - ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన అనుమతి ఇది - వ్యక్తుల చేతుల్లో పెడితే సమస్యలేనని స్పష్టీకరణ

MADRAS HIGH COURT JALLIKATTU
Madras High Court On Jallikattu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 9:07 PM IST

|

Updated : January 8, 2026 at 9:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Madras High Court On Jallikattu : "జల్లికట్టు అంటే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కాదు, ఎవరంటే వారు, ప్రైవేట్ వ్యక్తులు దీనిని నిర్వహించడానికి కుదరదు" అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తేల్చిచెప్పింది. తమిళనాడు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ సంప్రదాయ క్రీడను నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంఘాల ఆధ్వర్యంలో జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. మధురై జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత అవనియాపురం, పాలమేడు, అలంగనల్లూర్ జల్లికట్టు వేడుకలను ప్రభుత్వమే దగ్గరుండి జరపాలని ఆదేశించింది.

ఐపీఎల్‌తో పోలిక ఎందుకు?
కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, జల్లికట్టును ఐపీఎల్‌తో పోల్చారు. "ఐపీఎల్ అంటే అది వేరు. జల్లికట్టు అనేది మన సంప్రదాయం. దీనికి అనుమతి అంత సులభంగా రాలేదు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు, యువత చేసిన భారీ పోరాటాలు, నిరసనల తర్వాతే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతటి సున్నితమైన అంశాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టలేం. గతంలో వ్యక్తులు నిర్వహించడం వల్లే అనేక సమస్యలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడమే శ్రేయస్కరం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అసలేం జరిగింది?
జల్లికట్టు నిర్వహణపై మధురై జిల్లా అవనియాపురానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. "మా ఊరిలో జనవరి 15న (తమిళ 'థాయ్' మాసం మొదటి రోజు) జల్లికట్టు జరగనుంది. ఇది వందేళ్లుగా వస్తున్న ఆచారం. ఈ వేడుకను గ్రామస్థులమే సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈసారి కూడా జల్లికట్టు నిర్వహణ బాధ్యతను మా గ్రామ కమిటీకే అప్పగించాలి. అన్ని వర్గాల ప్రతినిధులతో కూడిన కమిటీకి అనుమతి ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరాం. కానీ వారు స్పందించడం లేదు. అధికారులే ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి" అని పిటిషన్‌లో కోరారు.

గతంలో గొడవలు
పిటిషనర్ వాదనను పరిశీలించిన కోర్టు, గత చరిత్రను గుర్తుచేసింది. 2017లో సుప్రీంకోర్టు జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అవనియాపురంలో నిర్వహణ బాధ్యతను ఒక కొత్త సంఘం తీసుకుంది. 'థెంకల్ కన్మాయ్ నీటిపారుదల రైతులు, జల్లికట్టు సంఘం' పేరుతో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు దీనిని నడిపించే ప్రయత్నం చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద గొడవ జరిగింది. ఈ కేసు హైకోర్టు వరకు వెళ్లింది. అప్పుడే కోర్టు స్పందిస్తూ, ప్రైవేట్ వ్యక్తులు వద్దు, జిల్లా యంత్రాంగమే చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జల్లికట్టు జరుగుతోంది.

ప్రపంచం చూస్తోంది
అవనియాపురం, పాలమేడు, అలంగనల్లూర్ జల్లికట్టులకు ఉన్న క్రేజ్ సాధారణమైంది కాదు. ఈ మూడు ప్రాంతాల్లో జరిగే పోటీలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ఇవి "వరల్డ్ ఫేమస్" ఈవెంట్స్. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన వేడుకల నిర్వహణలో చిన్న పొరపాటు జరిగినా అది రాష్ట్ర ప్రతిష్ఠకే మచ్చ తెస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తే పక్షపాతం, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం చేయడం 'అత్యంత సముచితం' అని కోర్టు అభిప్రాయపడింది.

ఫైనల్ తీర్పు ఇదే
పిటిషనర్ కోరినట్లుగా గ్రామ కమిటీకి బాధ్యతలు ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. మురుగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అవనియాపురం, పాలమేడు, అలంగనల్లూర్ జల్లికట్టులను ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశిస్తూ కేసును ముగించింది. మొత్తానికి జల్లికట్టు నిర్వహణపై క్లారిటీ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి పండుగ వేళ ఎద్దుల పందెం పూర్తి ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగనుంది.

Last Updated : January 8, 2026 at 9:00 PM IST