డోర్ లాక్ వల్ల పెరిగిన మృతులు- నాన్ ఏసీ బస్సు ఏసీగా ఛేంజ్- రాజస్థాన్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి!
రాజస్థాన్ బస్సు ప్రమాదం- విచారణలో కీలక విషయాలు

Published : October 15, 2025 at 8:16 PM IST
Rajasthan Bus Accident : రాజస్థాన్‌లో చోటుచేసుకున్న బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. జైసల్మేర్‌లో మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. ఈ ప్రమాదంపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రారంభ దశలోనే కీలక విషయాలను వెల్లడించారు.
డోర్ లాక్ అవడం వల్లే ప్రాణ నష్టం!
ఏసీ స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించగానే ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిందని, అందువల్ల ప్రయాణికులు బయటపడలేకపోయారని జైసల్మేర్ అదనపు ఎస్పీ కైలాశ్ దాన్ తెలిపారు. "మంటలు చెలరేగిన వెంటనే తలుపు మూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. అందుకే సీట్ల మధ్య, కిటికీల వద్దే మృతదేహాలు కన్పించాయి" అని ఆయన వివరించారు.
ఆర్మీ సహాయం- భయానక దృశ్యాలు
ఈ ప్రమాదం ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలో జరిగింది. గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే మంటలు బస్సు మొత్తాన్ని ఆవహించాయి. బస్సుకు ఒకే డోర్ ఉండటంతో బయటపడడం కష్టమైపోయింది. కొంతమంది ప్రయాణికులు కిటికీలను బద్దలుకొట్టి తప్పించుకున్నారు. అయితే 19 మంది బస్సులోనే కాలిపోయి మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
షార్ట్ సర్క్యూట్‌నా? బాణసంచా కారణమా?
జైసల్మేర్ నుంచి బయల్దేరిన కేవలం 10 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అయితే బస్సులో బాణసంచా (ఫైర్ క్రాకర్స్) కూడా ఉన్నాయా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
అసలు బస్సు ఏసీదేనా?
ఈ ఘటనతో రవాణా శాఖ అధికారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. చిత్తౌడ్‌గఢ్‌లో నమోదు అయిన ఈ బస్సు అసలు నాన్ ఏసీ బస్సుగా రిజిస్టర్ చేసి ఉన్నట్లు తెలిసింది. కానీ యజమాని నిబంధనలకు విరుద్ధంగా దానిని ఏసీ స్లీపర్‌గా మోడిఫై చేసినట్లు బయటపడింది. ఈ మార్పు గురించి ట్రాన్స్‌పోర్ట్ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
కలెక్టర్ తనిఖీలు- రికార్డులు సీజ్
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తౌడ్‌గఢ్ జిల్లా కలెక్టర్ ఆలోక్ రంజన్ స్వయంగా రవాణా కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ నేమీచంద్ పారీక్వ్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ నీరజ్ షా నుంచి వివరాలు సేకరించారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం, బస్సు మే 21న బిల్లింగ్ అయ్యి మూడు నెలల్లో బాడీ నిర్మాణం పూర్తి చేశారు. సెప్టెంబరులో రిజిస్ట్రేషన్ జరగ్గా, అక్టోబర్ 1న రోడ్డు మీదకు వచ్చింది. కేవలం 14 రోజులకే ఈ ఘోర ప్రమాదం జరిగింది.
"మోడిఫికేషన్ ఎలా జరిగిందో విచారణలో తేలుతుంది"
జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ నీరజ్ షా మాట్లాడుతూ, "ఈ బస్సు నాన్ ఏసీగా నమోదైంది. కానీ యజమాని ఏసీగా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో, ఎవరెవరికి సమాచారం ఉందో అన్నది దర్యాప్తు తర్వాత తేలుతుంది" అని తెలిపారు. ప్రమాదంలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై బస్సు యజమానిపై కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన ఇతర బస్సులను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ప్రజల ఆగ్రహం – భద్రతపై ప్రశ్నలు
కొత్త బస్సు, ఆధునిక సదుపాయాలు ఉన్న వాహనంలో ఇంత భయానక ప్రమాదం జరగడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై, ఆటోమేటిక్ లాక్ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రవాణా నిబంధనల ఉల్లంఘన, సాంకేతిక నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారవచ్చని జైసల్మేర్ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఘటనపై పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.

