AI సమ్మిట్ షర్ట్‌లెస్ నిరసన కేసు- అర్ధరాత్రి హైడ్రామా- యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి బెయిల్
ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌కు బెయిల్ - అర్ధరాత్రి 1 గంటకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు

Published : February 28, 2026 at 8:15 AM IST
IYC President Bhanu Bail : దిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో గతవారం చేసిన షర్ట్‌లెస్ నిరసన కేసులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌కు బెయిల్ మంజూరైంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున స్థానిక డ్యూటీ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పోలీసు కస్టడీని పొడిగించాలన్న క్రైమ్ బ్రాంచ్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా 'భారత్ మండపం నిరసన' రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్‌లో కింది స్థాయి నేతల నుంచి అగ్ర నాయకత్వం వరకు బీజేపీలో ప్రధాని మోదీ మొదలు కార్యకర్త వరకు ఇదే విషయంపై రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు.
అర్ధరాత్రి 1 గంటలకు హాజరు
శనివారం తెల్లవారుజామున ఈ కేసులో ఊహించని పరిణామాలు జరిగాయి. ఉదయ్ భాను చిబ్ తరపు న్యాయవాది రూపేశ్ సింగ్ భదౌరియా తెలిపిన వివరాల ప్రకారం, చిబ్‌ను శనివారం ఉదయం 6 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు తొలుత సమాచారం ఇచ్చారు. అయితే, అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అకస్మాత్తుగా ఆయనను 1 గంటకే హాజరుపరుస్తున్నట్లు పోలీసులు ఫోన్ చెప్పినట్లు భదౌరియా తెలిపారు. దీంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టుకు చేరుకోవాల్సి వచ్చింది. సరిగ్గా 1:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. సాధారణంగా పగటిపూట జరిగే ఇటువంటి విచారణలు ఇలా తెల్లవారుజామున నిర్వహించడం ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
#WATCH | Delhi | India Youth Congress National President Uday Bhanu Chib has been granted bail by the Duty Magistrate in the IYC protest at AI Impact Summit case. https://t.co/x8wBorMLgV pic.twitter.com/hpfzQ8EdQl
— ANI (@ANI) February 27, 2026
దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అభ్యర్ధన తిరస్కరణ
విచారణ సందర్భంగా దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఉదయ్ భాను చిబ్ ఇప్పటికే నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ, కేసు విచారణలో ఇంకా మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు వాదించారు. చిబ్ కస్టడీని మరో 7 రోజుల పాటు పొడిగించాలని కోరారు. ఇదే కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులకు 5 రోజులు, 2 రోజుల పాటు రిమాండ్ కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. నాలుగు రోజుల కస్టడీ తర్వాత కూడా చిబ్‌ను ఇంకా ఎందుకు కస్టడీలో ఉంచాలని చిబ్ తరపు న్యాయవాది సులేమాన్ మహ్మద్ ఖాన్ వాదించారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి పోలీసుల వాదనతో ఏకీభవించలేదు.
షరతులతో బెయిల్ మంజూరు
కస్టడీ పొడిగింపునకు తగిన ఆధారాలు, కారణాలు లేవని చెబుతూ, ఉదయ్ భాను చిబ్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఉదయ్ భానుకు కొన్ని షరతులను విధించింది. షరతుల్లో భాగంగా చిబ్ తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో అప్పగించాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు.విచారణలో భాగంగా ఆయన తన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులకు లేదా కోర్టుకు సమర్పించాలి. రూ. 50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
ఏఐ సమ్మిట్‌లో నిరసన కేసు
ఫిబ్రవరి 20న దిల్లీలోని ప్రతిష్టాత్మక 'భారత్ మండపం' వేదికగా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగం, యూఎస్‌తో ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా, ఇతర సమస్యలపై ఆ సమ్మిట్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి ప్రదర్శన నిర్వహించడం తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం వంటి ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్, ఫిబ్రవరి 25న ఉదయ్ భాను చిబ్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి భాను పోలీసు కస్టడీలోనే ఉన్నారు.

