ETV Bharat / bharat

సోదరుడి కోసం రూ.700తో 'స్మార్ట్ గాగుల్స్'- ఐటీఐ విద్యార్థి వినూత్న ఆవిష్కరణ

దృష్టి లోపం ఉన్న సోదరుడి కష్టాలే స్ఫూర్తి- సెన్సార్లతో అడ్డంకులను ముందే గుర్తించి హెచ్చరించే 'స్మార్ట్ గాగుల్స్​'- అందరి ప్రశంసలు అందుకుంటున్న ఐటీఐ విద్యార్థి

ITI Student Invented Smart Goggles
ITI Student Invented Smart Goggles (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 3, 2026 at 2:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

ITI Student Invented Smart Goggles : ఆవిష్కరణలకు భారీ పెట్టుబడులు లేదా అత్యాధునిక ప్రయోగశాలలు తప్పనిసరి కాదని ఓ ఐటీఐ విద్యార్థి నిరూపించాడు. తన సోదరిడికి ఉన్న దృష్టి లోపం కారణంగా, నడుస్తున్నప్పుడు వస్తువులకు తగిలి ఇబ్బంది పడకూడదని ఓ ప్రత్యకమైన 'స్మార్ట్​ గాగుల్స్​'ను రూపొందించాడు. కేవలం రూ.700లతో తయారు చేసిన ఈ ఆవిష్కరణ ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన కుటుంబంలో ఎదురైన సమస్యకు పరిష్కారం వెతుకుతూ ప్రారంభించిన ప్రయత్నం, ఇప్పుడు వేలాది మంది అంధులకు ఉపయోగపడే సాంకేతిక ఆవిష్కరణగా మారింది.

ఝార్ఖండ్​లోని రాంచీకి చెందిన బాబులాల్ కర్మాళీ ప్రభుత్వ ఐటీఐ హెహాల్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్​ మెకానిక్స్ విభాగంలో చుదువుతున్నాడు. అతడి సోదరుడికి దృష్టి లోపం ఉండటంతో, రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు పడటం చూశాడు. నడుస్తున్న సమయంలో గోడలు, స్తంభాలు లేదా ఇతర వస్తువులను ఢీకొనడం, తడబడడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతుండేవి. తన సోదరుడు ఇలా ప్రతి చిన్న పనికీ ఇతరులపై ఆధారపడాల్సి రావడాన్ని గమనించిన బాబులాల్‌ ఏదొకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. దృష్టి లోపంతో ఎవరూ ఇబ్బంది లేకుండా సులభంగా, సురక్షితంగా నడిచేలా ఒక స్మార్ట్ గాగుల్​ను రూపొందించాలనుకున్నాడు.

ITI Student Invented Smart Goggles
'స్మార్ట్ గాగుల్స్' ధరించిన బాబులాల్ (Etv Bharat)

సైరన్ ద్వారా హెచ్చరిక
బాబూలాల్ తన ఆలోచనను కళాశాల ఉపాధ్యాయులతో పంచుకున్నాడు. వారు కూడా అతడిని ప్రోత్సహించి అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు. అనేక ప్రయోగాలు, సవరణల తర్వాత తక్కువ ఖర్చుతో పనిచేసే స్మార్ట్ గాగుల్స్‌ను తయారు చేయడంలో విజయవంతమయ్యాడు. ఈ స్మార్ట్ గాగుల్స్‌లో ప్రత్యేక సెన్సర్లు అమర్చారు. గాగుల్స్ ధరించిన వ్యక్తి ముందున్న గోడ, స్తంభం, వాహనం లేదా ఇతర వస్తువులకు దగ్గరగా వెళ్లగానే సెన్సర్లు వాటిని గుర్తిస్తాయి. వెంటనే శబ్దంతో సంకేతం లేదా సైరన్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. దీంతో అంధులు ముందుగానే దిశ మార్చుకుని ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ధరలో తయారైన ఈ పరికరం దైనందిన జీవితంలో వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

స్మార్ట్ గాగుల్స్ తయారీ ఆలోచనను చెప్పినప్పుడు అధ్యాపకులు పూర్తి సహకారం అందించారని బాబుల్ చెప్పారు. 'వారి మార్గదర్శకత్వంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. నేను కేవలం రూ.500 ప్రవేశ రుసుము చెల్లించి ప్రభుత్వ ఐటీఐలో చేరాను. నెలకు కేవలం రూ.20 రుసుముతో తన చదువును కొనసాగిస్తున్నాను. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, నా కలలను ఎప్పుడూ వదులుకోలేదు. నా సోదరుడు ఎదుర్కొన్న కష్టాలు వల్ల కొత్తగా ఏదైనా సృష్టించాలనే స్ఫూర్తి నాలో వచ్చింది. ఆ స్ఫూర్తి చివరికి ఈ స్మార్ట్ గాగుల్స్ రూపంలో రూపుదిద్దుకుంది' అని బాబులాల్ తెలిపాడు.

ITI Student Invented Smart Goggles
'స్మార్ట్ గాగుల్స్' (Etv Bharat)

ప్రశంసించిన ఉపాధ్యాయులు
బాబూలాల్ రూపొందించిన స్మార్ట్ గాగుల్స్‌పై ఐటీఐ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ప్రిన్సిపాల్ పరమానంద్ రజక్ మాట్లాడుతూ, ఇలాంటి విద్యార్థులే ప్రభుత్వ విద్యాసంస్థలకు నిజమైన గుర్తింపు తెస్తారని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనే ఆలోచన ఉన్న యువతకు బాబూలాల్ ఆదర్శంగా నిలుస్తాడని అన్నారు. బాబులాల్ విద్యార్థిగా చేరినప్పటి నుంచే కొత్త సాంకేతిక ఆలోచనలతో ముందుకొచ్చేవాడని మరో ఉపాధ్యాయుడు తెలిపారు. స్మార్ట్ గాగుల్స్ తయారు చేయాలన్న ఆలోచన చెప్పినప్పటి నుంచి అందరూ కలిసి అతడికి మార్గనిర్దేశనం చేసినట్లు వెల్లడించారు.

రూ.700 ఖర్చుతో స్మార్ట్​ గూగుల్స్
ప్రస్తుతం తాను రూపొందించినది తొలి నమూనా మాత్రమేనని బాబులాల్ చెప్పాడు. అతడు కేవలం రూ.700 ఖర్చుతో పరిమిత వనరులను ఉపయోగించి వీటిని అభివృద్ధి చేశాడు. దీనిని మరింత మెరుగుపరచడానికి ఇప్పటికే కొత్త డిజైన్, బ్లూప్రింట్ సిద్ధం చేశానని తెలిపాడు. ఇంకా ఆధునిక సాంకేతికతను జోడించి మరింత తేలికగా, ఆకర్షణీయంగా, ఉపయోగించడానికి సులభంగా ఉండే కొత్త మోడల్ రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పాడు. తన ప్రాజెక్టుకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది దృష్టి లోపం ఉన్నవారికి ఈ పరికరం ఉపయోగపడుతుందని బాబులాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చి సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసేలా చేయాలనేది తన లక్ష్యమని చెప్పాడు.

భర్త గురక పెడుతున్నాడంటూ విడాకులు కోరిన భార్య- ఐదేళ్ల దాంపత్య జీవితం చివరకు ఏమైందంటే?

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం- భారీ వర్షంలోనూ భక్తుల సందడి- యాత్రికులకు మోదీ లేఖ