ETV Bharat / bharat

బిహార్​లో మాదే విజయం- మహాగఠ్​బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: తేజస్వి యాదవ్​

ఇది ప్రజల విజయం అవుతుంది- బిహార్​లో మహాగఠ్​బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది- తేజస్వి యాదవ్​

Tejashwi Yadav
Tejashwi Yadav (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 10:09 AM IST

3 Min Read
Choose ETV Bharat

Tejashwi Yadav Confident On Victory : బిహార్​లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వేళ రాష్ట్రీయ జనతాదళ్​ (ఆర్​జేడీ) నేత, మహాగఠ్​బంధన్​ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్​లో కచ్చితంగా మార్పు వస్తుందని, మహాగఠ్​బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

"ఇది ప్రజల విజయం అవుతుంది. మేము సిద్ధంగా ఉన్నాం. బిహార్​లో మార్పు వస్తుంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాం."​
- తేజస్వి యాదవ్​, ఆర్​జేడీ నేత

తేజస్వి ప్రభుత్వమే వస్తుంది!
బిహార్​లో తేజస్వి ప్రభుత్వమే రానుంది అని ఆర్​జేడీ నేత విశ్వనాథ్ యాదవ్ అన్నారు. "ప్రజల సెంటిమెంట్ మార్పునకు అనుకూలంగా ఉంది. మహాగఠ్​బంధన్​కు అందరి మద్దతు ఉంది. కనుక బిహార్​లో తేజస్వి ప్రభుత్వం రానుంది. ఇక గయ విషయానికి వస్తే, గయ జిల్లా ఆర్​జేడీ పార్టీకి ఎప్పుడూ లక్కి ప్లేస్​. ఎవరూ ఆర్​జేడీకి మద్దతు ఇవ్వనప్పుడు కూడా గయా జిల్లా ప్రజలు మాకు మద్దతుగా నిలిచారు" అని అన్నారు.

ఓట్ల లెక్కింపు సంక్రమంగా జరిగితే!
న్యాయమైన రీతిలో ఓట్ల లెక్కింపు జరిగితే, బిహార్​ ఎన్నికల్లో మహాగఠ్​బంధన్​ కచ్చితంగా గెలుస్తుందని బిహార్ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాజేశ్​ రామ్​ విశ్వాసం వ్యక్తం చేశారు. మహాగఠ్​బంధన్​ ఎన్నికల వాగ్దానాలే కూటమికి విజయాన్ని చేకూరుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జంగిల్​ రాజ్​ యువరాజ్​
మరోవైపు బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, తేజస్వి యాదవ్​పై విమర్శలు గుప్పించారు. బిహార్ ప్రజలు ఆటవిక రాజ్యానికి(జంగిల్ రాజ్​) యువరాజు అయిన తేజస్వి యాదవ్​కు గట్టి బదులు ఇస్తారని, దీని ద్వారా జమీందారీ సంస్కృతిని అంతం చేస్తారని అన్నారు. విజయ్ కుమార్ ప్రస్తుతం లఖిసరాయి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆయన భవిత్వం కూడా ఇవాళే తేలనుంది.

"ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. బిహార్​ను తమ రాజ్యంగా (ఎస్టేట్​)గా భావించేవారికి ప్రజలు బలమైన సందేశాన్ని ఇస్తారు. ఆటవిక రాజ్యానికి యువరాజు అయిన తేజస్వి యాదవ్ బంగారు చెంచా(గోల్డెన్​ స్పూన్​)తో జన్మించాడు. బిహార్ ప్రజలు ఈ జమీందారీ భావాన్ని అంతం చేస్తారు."
- విజయ్ కుమార్ సిన్హా, బీజేపీ నేత

జోరుగా సాగుతున్న కౌంటింగ్​
బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు 2025 కౌంటింగ్ రాష్ట్రంలోని మొత్తం 243 నియోకవర్గాల్లో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దీనితో ఆయా కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మెజారిటీ స్థానాల్లో ఎన్​డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు, ఎన్​డీఏ కూటమి నేతల్లో మరీ ముఖ్యంగా ఇంతకు ముందు రాష్ట్ర మంత్రులుగా పని చేసినవారిలో కొందరు సేఫ్ జోన్​లో ఉండగా, మరికొందరు వెనుకబడ్డారు.

బిహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్​ చౌదరి (బీజేపీ) ప్రస్తుతానికి సేఫ్ ఉన్నారు. కాగా మరో ఉపముఖ్యమంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా మాత్రం వెనుకబడినట్లు తెలుస్తోంది. ఇక మంత్రుల విషయానికి వస్తే విజయ్ కుమార్ చౌదరి, శ్రావణ్ కుమార్​ ముందజలో ఉండగా, మంగళ్ పాండే వెనుకబడ్డారు. మిగతా మంత్రుల్లో చాలా మంది ప్రస్తుతానికి సేఫ్ జోన్​లోనే ఉన్నారని సమాచారం.​

అంచనాలు నిజమవుతాయా?
బిహార్​లో ఈసారి రికార్డ్ స్థాయిలో 67.13 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 1951 తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈసారి పురుష ఓటర్లు (62.8 శాతం) కంటే మహిళా ఓటర్లు (71.6 శాతం) ఎక్కువగా ఉన్నారు. కాగా, చాలా ఎగ్జిట్ పోల్స్​ ఎన్​డీఏకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. మహాగఠ్​బంధన్​ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని చెప్పాయి. మరి ఈ అంచనాలు నిజమవుతాయో, లేదో ఈరోజే తేలనుంది.