ఆనాడు కశ్మీర్లో పర్యటించిన ఖమేనీ- ఆర్టికల్ 370 రద్దుపై ఆయన ఏమన్నారంటే?
1980ల్లో భారత్‌లో పర్యటించిన ఖమేనీ- ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు- కశ్మీరీ ముస్లింలను అణిచివేస్తున్నారంటూ వ్యాఖ్యలు

Published : March 2, 2026 at 6:01 PM IST
Khamenei visited Kashmir in 1980: పశ్చిమాసియాలో అత్యంత ప్రభావవంతమైన మత, రాజకీయ నాయకుడిగా ఎదగడానికి చాలా కాలం ముందే అయతుల్లా అలీ ఖమేనీ కశ్మీర్లో పర్యటించారు. కశ్మీర్‌లోని ముస్లింల పరిస్థితిపై ఆయన బహిరంగంగానే మాట్లాడారు. దశాబ్దాల తర్వాత, ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక కూడా ఆయన కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
భారత్‌లో పర్యటన
1979లో ఇరాన్ చివరి షా (మొహమ్మద్ రెజా పహ్లావి) పతనం తర్వాత ఆ దేశంలో సుమూలంగా పెను రాజకీయ మార్పులు జరిగాయి. ఆ సమయంలో ఖమేనీ వయస్సు 41 ఏళ్లు. ఇస్లామిక్ విప్లవానంతర ఇరాన్లో ఆయన ఒక కీలక నేతగా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. ఈ తరుణంలోనే ఆయన భారత్‌లో పర్యటించారు. విశ్వసనీయ ఆధారాల ప్రకారం, 1980లో ఖమేనీ కశ్మీర్లో పర్యటించారు. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక జామియా మసీదులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే కశ్మీర్ ఆధునిక రాజకీయ, మతపరమైన చరిత్రలో ఈ పర్యటన ఇప్పటికీ అంతగా వెలుగులోకి రాని అధ్యాయంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
జామియా మసీదులో చేసిన ప్రసంగంలో ఖమేనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పరిస్థితుల గురించి మాట్లాడారు. రాజకీయ, సామాజిక పోరాటాలు చేస్తున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఖమేనీ చేసిన ఈ ప్రసంగం ఆనాడి ఇరాన్ మొదటి సుప్రీం లీడర్‌గా అయతుల్లా రుహొల్లా ఖమేనీతో సహా, కశ్మీర్ మత పెద్దలు, రాజకీయ విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. ఈ పర్యటనలోనే ఖమేనీ శ్రీనగర్‌లోని జాదిబల్ ఇమాంబారాలో షియా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. హజ్రత్బల్ దర్గాను సందర్శించారు. బుద్గాంకు కూడూ వెళ్లారు. అక్కడ ఆయనకు 'ఆఘా' కుటుంబం అతిథ్యం ఇచ్చింది. ఈ విధంగా, ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం సమాజాలతో సంబంధాలు పెంపొందించుకోవాలనే ఇరాన్ సిద్ధాంతానికి ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలిచింది.
ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు
2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. దీనితో ఆర్టికల్ 370 రద్దును ఖమేనీ తీవ్రంగా ఖండించారు. "కశ్మీర్‌లోని ముస్లిం పరిస్థితి పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. వాస్తవానికి భారత్‌తో మా సంబంధాలు బాగున్నాయి. అయితే భారత్ ఒక న్యాయమైన విధానాన్ని అనుసరించాలి. కశ్మీర్ ముస్లింపై జరుగుతున్న అణచివేతను అరికట్టాలి. కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితికి, భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న వివాదాలకు, బ్రిటీష్ వారి దుష్ట చర్యలే కారణం. బ్రిటీష్ వారు ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్లో ఘర్షణలు కొనసాగేలా ఈ గాయాన్ని మిగిల్చారు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.
We’re concerned about Muslims’ situation in #Kashmir. We have good relations with India, but we expect the Indian government to adopt a just policy towards the noble people of Kashmir and prevent the oppression & bullying of Muslims in this region.
— Khamenei.ir (@khamenei_ir) August 21, 2019
అప్పటి వరకు భారత్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆర్టికల్ 370 రద్దుపై ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ విమర్శలు చేయడం - ఇరుదేశాల మధ్య రాజకీయ, దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
1990లో ఏమన్నారంటే?
వాస్తవానికి 1990లో కూడా ఖమేనీ కశ్మీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజాల పట్ల చూపిస్తున్న వివక్ష గురించి చర్చిస్తూ, కశ్మీర్‌ను కూడా ప్రస్తావించారు. "చూడండి. ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా, వారిని ఇతరుల కన్నా చాలా హీనంగా, కఠినంగా చూస్తున్నారు. దీనికి కశ్మీర్ ఒక ఉదాహరణ" అని అన్నారు. కశ్మీర్‌లోని ముస్లింలు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారని, వారి డిమాండ్లు చాలా న్యాయమైనవని ఖమేనీ పేర్కొన్నారు.
"కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలిసిన ఎవరైనా సరే, అక్కడి ముస్లింలు చెబుతున్నది నిజం, న్యాయమని అంగీకరిస్తారు. వారిని అన్యాయమైన ఉద్దేశాలు ఉన్నవారు అణచివేస్తున్నారు. కశ్మీర్ ముస్లింలపై దాడి చేసేవాళ్లు చాలా తప్పు చేస్తున్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచం ఇదంతూ చూస్తూ ఉదాసీనంగా ఉంది" అని ఖమేనీ అన్నారు.
భారత్‌తో దౌత్య సంబంధాలు
ఏదేమైనప్పటికీ, భారత్, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు చారిత్రకంగానూ, ఆచరణాత్మకంగానూ, పరస్పర సహకారంతోనే కొనసాగుతున్నాయి. మరోవైపు పాక్‌తో ఇరాన్ సరిహద్దు కలిగి ఉంది., ఆఫ్గానిస్థాన్, మధ్య ఆసియా వాణిజ్య మార్గాలతో అది వ్యూహాత్మక ప్రయోజనాలను పొందుతోంది. అందుకే దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాల్లో అది వ్యూహాత్మక సమతుల్య విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది.
పాక్ తీర్మానంపై నీళ్లుజల్లిన ఇరాన్
1990వ దశకం ప్రారంభంలో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. నిజానికి అది విజయవంతం అయ్యుంటే, భారత్ అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన ఒత్తిడి, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేంది. ఈ పరిస్థితుల్లో అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు ఇరాన్ మద్దతు కోరారు. పాక్ ఎత్తుగడను తిప్పికొట్టడానికి అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి దినేశ్ సింగ్‌ను టెహ్రాన్‌కు పంపించారు. నాటి ఇరాన్ విదేశాంగమంత్రి స్వయంగా వచ్చి దినేశ్ సింగ్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భారత్ ఆందోళనను ఆనాటి ఇరాన్ అధ్యక్షుడికి కూడా చేరవేశారు. దీనితో పాక్ పెట్టిన తీర్మానానికి ఇరాన్ మద్దతు ఇవ్వలేదు. దీనితో ఆ అంశం ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లలేదు.
నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ- పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం

