ETV Bharat / bharat

48 గంటల్లో 8 పశ్చిమాసియా దేశాధినేతలతో మాట్లాడిన మోదీ

ఒమన్‌, కువైట్‌లో జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ- ఒమన్‌ సుల్తాన్‌, కువైట్‌ రాజుతో మాట్లాడిన మోదీ- ఒమన్‌, కువైట్‌లో ఉన్న భారతీయుల భద్రత గురించి ఆరా తీసిన మోదీ

PM Modi Speak Oman Kuwait Leaders
PM Narendra Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 5:39 PM IST

|

Updated : March 3, 2026 at 7:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Speak Oman Kuwait Leaders : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలపై దాడులు జరగడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. గత 48 గంటల్లో ప్రధానమంత్రి 8 పశ్చిమాసియా దేశాల అధినేతలతో మాట్లాడారు. యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్దాన్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖతార్ నాయకులతో మాట్లాడారు. అటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఆందోళ వ్యక్తం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

మంగళవారం మధ్యాహ్నం ఒమన్‌ సుల్తాన్‌ హైతామ్‌ బిన్‌ తారిక్‌, కువైట్‌ యువరాజు షేక్‌ సబాహ్‌ అల్‌ ఖలేద్‌, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్‌ అల్ థానీతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. ఒమన్, కువైట్​ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతా అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు. గత రెండు రోజుల్లో మొత్తం 8 దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఆయా దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను ఉల్లంఘిస్తూ జరిగిన దాడులను ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ వారి ప్రజలతో ఐక్యతగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ శాఖ
అటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ శాఖ కూడా తీవ్ర ఆందోళ వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి దిగజారడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించిందని తెలిపారు. విధ్వంసం, ప్రాణనష్టం పెరుగుతుండగా సాధారణ జీవనం, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయని పేర్కొంది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్​ కోరినట్లు తెలిపింది.

గల్ఫ్ ప్రాంత భద్రత, స్థిరత్వంలో కీలక వాటా కలిగిన సమీప పొరుగు దేశంగా ఈ పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాటని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు కోటిమంది భారతీయులు ఉన్నారనీ వారి భద్రత, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించింది. భారతదేశ వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు ఈ ప్రాంతంపై ఆధారపడి ఉన్నాయన్న విదేశాంగశాఖ ఇక్కడి అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని తెలిపింది. వాణిజ్య ఓడలపై దాడులను ఖండిస్తున్నామని, ఇప్పటికే పలువురు భారతీయులు మృతిచెందారని వివరించింది. గత కొన్ని రోజుల్లో జరిగిన దాడుల్లో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు కనిపించకుండా పోయారని విచారం వ్యక్తం చేసింది.

చర్చలు, దౌత్యానికే భారత్ మద్దతు
ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే చర్చలు,దౌత్యానికి తిరిగి రావాలని భారత్ బలంగా పునరుద్ఘాటించింది. ఘర్షణకు త్వరితగతిన ముగింపు పలకాలని కోరింది. ఇప్పటికే అనేక ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేసింది. ప్రభావిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు అక్కడి భారతీయులతో, సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. అవసరమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నాయని, ఘర్షణ కారణంగా చిక్కుకుపోయిన వారికి సాధ్యమైన సహాయం అందిస్తున్నాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో కూడా కాన్సులర్ సేవలను చురుకుగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ప్రాంతీయ ప్రభుత్వాలతో సంప్రదింపులు
ఈ ప్రాంత ప్రభుత్వాలతో పాటు ఇతర కీలక భాగస్వామ్య దేశాలతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి తమ సమకాలీనులతో చర్చలు జరిపారని వెల్లడించింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తూ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తగిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.

పశ్చిమాసియా పరిణామాలపై మంత్రిత్వ బృందం ఏర్పాటు
మరోవైపు పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా గమనించేందుకు అంతర మంత్రిత్వ బృందాన్ని (ఇంటర్ మినిస్ట్రీయల్ గ్రూపు) కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రతిరోజూ సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ మంగళవారం వెల్లడించారు.

'రోజూ సమావేశమయ్యే అంతర మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేశాం. పశ్చిమాసియా పరిణామాలను సమీక్షిస్తూ, నౌకాశ్రయం, లాజిస్టిక్స్, ఎగుమతులు, కీలక దిగుమతుల విషయంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో పరిశీలిస్తున్నాం. అవసరమైతే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటాం. మంగళవారం జరిగిన తొలి సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖలు కొన్ని సూచనలు చేశాయి. వాటిపై పనిచేస్తాం. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత్‌పై కనిష్ఠ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. వాణిజ్య మంత్రిత్వ శాఖకు మీ విలువైన సూచనలు అందించాలని కోరుతున్నాం' అని గోయల్ పేర్కొన్నారు.

Last Updated : March 3, 2026 at 7:23 PM IST