ETV Bharat / bharat

దేశాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు ముందుకు రావాలి : ప్రధాని మోదీ

ప్రభుత్వం, పరిశ్రమలు, విజ్ఞాన భాగస్వాములు కలిసినప్పుడే సంస్కరణలు ఫలితాలుగా మారుతాయన్న మోదీ - గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిందన్న ప్రధాని

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi (@NarendraModi/YT)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 2:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Industry Investments : దేశాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు ఆచరణాత్మక పరిష్కారాలతో అండగా నిలిచి మార్కెట్ నమ్మకాన్ని పెంచాలని సూచించారు. 'వికసిత్​ భారత్' కోసం సాంకేతికత, సంస్కరణలు, ఆర్థికం అనే అంశంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ప్రభుత్వం, పరిశ్రమలు, విజ్ఞాన భాగస్వాములు కలిసినప్పుడే సంస్కరణలు ఫలితాలుగా మారుతాయని మోదీ పేర్కొన్నారు. కాగితంపై ఉన్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో విజయాలుగా సాకారం అవుతాయని వివరించారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిందని ప్రధాని తెలిపారు. 11 ఏళ్ల క్రితం కేవలం రూ. 2 లక్షల కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులు, 2026-27 బడ్జెట్‌లో రూ. 12 లక్షల కోట్లకుపైగా పెరిగాయని వివరించారు. ఈ భారీ కేటాయింపులు ప్రైవేట్ రంగానికి ఒక సంకేతమని పేర్కొన్నారు. మరోవైపు, బడ్జెట్‌లోని విషయాలపై మరింత చర్చ జరిపేకంటే దాని తక్షణ అమలుపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ వాటాదారులను కోరారు.

"బడ్జెట్ గురించి చర్చించడం దీని ఉద్దేశం కాదు. వీలైనంత త్వరగా బడ్జెట్‌ను అమలు చేయడం, అది సులభమైన మార్గంలో చేయడం దీని ఉద్దేశం. వాటాదారులందరూ దీని నుంచి ప్రయోజనం పొందాలి. బడ్జెట్‌ను కేవలం స్వల్పకాలిక వ్యాపార పత్రంగా చూడకూడదు. అది ఒక విధానపరమైన మార్గదర్శి. బడ్జెట్ ప్రభావాన్ని పటిష్టమైన, వాస్తవిక పారామితులపై అంచనా వేయాలి. ఇలాంటి విధానాలు మౌలిక సదుపాయాలను విస్తరించాలి. రుణ లభ్యతను మరింత సరళతరం చేయాలి. సులభతర వాణిజ్యాన్ని పెంచాలి. పాలనలో పారదర్శకత పెరగాలి. ప్రజల జీవనం మరింత సులభతరం కావాలి. బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఏ బడ్జెట్‌ను కూడా వేరు చేసి చూడడానికి వీల్లేదు. దేశ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ. ప్రతీ బడ్జెట్‌ ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక అడుగు అవుతుంది. మన ముందు ఉన్న ఆ పెద్ద లక్ష్యం ఏమిటంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావని. ప్రతీ సంస్కరణ, ప్రతీ మార్పు ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అదేవిధంగా, ఆర్థిక రంగం గురించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బాండ్​ మార్కెట్లను మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడి చట్రాన్ని మరింత అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

"విదేశీ పెట్టుబడి చట్రాన్ని సులభతరం చేస్తున్నాం. పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడానికి మేం ప్రయత్నిస్తున్నాం. దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బాండ్ మార్కెట్లను మరింత చురుగ్గా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. బాండ్లను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి ప్రక్రియను సులభతరం చేస్తున్నాం. దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే బాండ్ మార్కెట్ సంస్కరణలను మనం చూడాలి. స్థిరమైన విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మనం సరికొత్త సాధనాలను తీసుకురావాలి. ప్రభుత్వం, పరిశ్రమ, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థల మధ్య ఉమ్మడి వెంచర్‌గా స్పష్టమైన సంస్కరణ భాగస్వామ్య చార్టర్​ను అభివృద్ధి చేయాలి"
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

అదేవిధంగా పరిశ్రమలు నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని ప్రధాని మోదీ కోరారు. 2026-27 బడ్జెట్‌లో ప్రకటించిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం కోసం 'రిఫార్మ్ పార్టనర్‌షిప్ చార్టర్' రూపొందించాలని ప్రధాని ప్రతిపాదించారు. 2047 నాటికి 'వికసిత్​ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ పత్రం కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచంలోని టాప్-3 AI సూపర్ పవర్స్​లో భారత్​- అదే మా టార్గెట్​: ప్రధాని మోదీ

మేడ్ ఇన్ ఇండియా చిప్స్ అత్యవసరం- స్వయం సమృద్ధే వికసిత్ భారత్​కు పునాది: ప్రధాని మోదీ