గణేశుడి కోసం 3.5అడుగుల భారీ రాఖీ- గత 24 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీ!
వినూత్నమైన సంప్రదాయాన్ని పెట్టుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం- రక్షాబంధన్ సందర్భంగా ఖజ్రానా వినాయకుడికి భారీ రాఖీ సమర్పిస్తున్న ఫ్యామిలీ- రెండు దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతున్న ఆచారం

Published : August 26, 2026 at 4:30 PM IST
Indore Khajrana Ganesh Rakhi : దేశవ్యాప్తంగా ఉన్న సోదర-సోదరిమణులు రక్షాబంధన్ వేడుకలకు సిద్ధమవుతున్నవారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన ఓ కుటుంబం ప్రముఖ ఖజ్రానా గణేశుడికి 3.5 అడుగుల భారీ రాఖీని కట్టేందుకు రెడీ అవుతోంది. ఏటా రాఖీ పండుగ సందర్భంగా ఈ ఫ్యామిలీ నగరంలోనే అతిపెద్ద రాఖీని గణేశుడికి సమర్పించే సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వినాయకుడి భారీ రాఖీ కడుతున్న ఫ్యామిలీ ఏది? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? తదితర విషయాలు తెలుసుకుందాం.
24 ఏళ్లుగా ఇదే ఆచారం
పాల్‌రేచా కుటుంబం గత 24 ఏళ్లుగా ఇందౌర్‌లోని ఖజ్రానా గణేశుడికి రాఖీని కట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఏటా దేవుడి కోసం ఒక భారీ రాఖీని తయారు చేస్తోంది. ఈ ఏడాది కూడా వివిధ దేవతామూర్తుల ఫొటోలతో భక్తిభావం, చైతన్యం ప్రతిబింబించేలా 40x40 అంగుళాల (3.5 అడుగులు) రాఖీని రూపొందించింది. ఈ భారీ రాఖీలో జగన్నాథ స్వామి, బాబా మహాకాల్, భోజ్‌శాల మాతా వాగ్దేవి, మహాలక్ష్మి , మహాకాళి వంటి దేవతామూర్తుల చిత్రాలు కనిపిస్తాయి. పాల్‌రేచా కుటుంబ సభ్యులు శాంతను, పుండరీక్, ధీరజ్, జయేశ్, మితేష్ సహా ఇంకొందురు కలిసి ఈ రాఖీని తయారుచేయడానికి గత రెండున్నర నెలలుగా రేయింబవళ్లు శ్రమించారు.
పాల్‌రేచా కుటుంబం కొవిడ్ తర్వాత వాణిజ్యపరమైన రాఖీల తయారీ వ్యాపారాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ రక్షాబంధన్ సందర్భంగా గణేశుడి కోసం రాఖీని తయారుచేయడానికి కుటుంబ సభ్యులందరూ ఏకమవుతారు. ఈ ఏడాది నేహా పాల్‌రేచా (పాల్‌రేచా ఫ్యామిలీ కోడలు) రాఖీ థీమ్ రూపకల్పన నుంచి తయారీ వరకు అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రంగురంగుల రత్నాలుతో తీర్చిదిద్దిన ఈ రాఖీ దేవతామూర్తుల సజీవ చిత్రణలతో కూడిన అద్భుతమైన కళాఖండంగా కనిపిస్తోంది. కాగా, ఖజ్రానా గణేశ్ ఆలయానికే కాకుండా వీర్ అలిజా సర్కార్ మహాకాల్ గుడి, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వినాయకుడి దేవాలయాలకు తాము రాఖీలను తయారు చేసి పంపుతామని నేహా తెలిపారు. తమ కుటుంబం తయారు చేసిన రాఖీలు గతంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు.

కుటుంబ పెద్ద ఏమన్నారంటే?
తమ ఫ్యామిలీ గత 50 ఏళ్లుగా రాఖీ తయారీ వ్యాపారంలో ఉందన్నారు కుటుంబ పెద్ద పుండరీక్ పాల్‌రేచా. వ్యాపార ప్రారంభ రోజుల్లో రాఖీల తయారీ ప్రక్రియ ఎప్పుడూ ముందుగా గణేశుడి కోసం ఒక రాఖీని రూపొందించడంతోనే మొదలయ్యేదని వివరించారు. కాలక్రమేణా ఇదొక సంప్రదాయంగా మారిందన్నారు. అమ్మకం కోసం రాఖీలను తయారు చేయడానికి ముందు కుటుంబ సభ్యులు మొదట దేవుడి కోసం ఒక అద్భుతమైన, అందమైన రాఖీని రూపొందిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత ఆ రాఖీని కుటుంబ సభ్యులంతా సంగీత వాద్యాల నడుమ ఉత్సాహభరితమైన, భక్తి వాతావరణంలో దేవుడికి సమర్పించడానికి వెళ్తామని చెప్పారు. ఈ ఆచారాన్ని తమ మూడో తరం కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాలకు పాకిన పాల్‌రేచా రాఖీ మేనియా
పాల్‌రేచా కుటుంబం తయారు చేసే రాఖీల కీర్తి ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. దీంతో రాఖీకి తయారీకి అవసరమైన వివిధ ముడి సరకులను సరఫరా చేసే పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు పాల్‌రేచా కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. సరకులను సరఫరా చేసిన తర్వాత ఆ వ్యాపారులు ఏటా గణేశుడి కోసం తయారుచేసే భారీ రాఖీని చూసేందుకు వస్తుంటారు. ఈ ఏడాది పాల్‌రేచా ఫ్యామిలీ తమ రాఖీకి 'సనాతన్ రాఖీ' అని పేరు పెట్టింది. దీని తయారీలో కోల్‌కతా, జైపుర్, ముంబయి, సూరత్ ప్రాంతాల నుంచి సేకరించిన అలంకరణ సామగ్రిని ఉపయోగించారు. చివరగా దీనికి సంప్రదాయ రాఖీ రూపాన్ని కల్పించేందుకు ఇరువైపులా పవిత్ర దారాలను కట్టారు.
ఈ ఏడాది పాల్‌రేచా ఫ్యామిలీ రూపొందించిన రాఖీని చూసేందుకు సూరత్ నుంచి భూపేంద్ర ఠకారియా ఇందౌర్‌కు వచ్చారు. "భారీ రాఖీని తయారు చేసి దేవుడికి సమర్పించే సంప్రదాయం దేశంలో మరెక్కడా లేదు. అందుకే దేవుడికి రాఖీని సమర్పించే మొత్తం ప్రక్రియను కళ్లారా చూడాలనే కోరికతో నేను ప్రతి సంవత్సరం నా కుటుంబంతో కలిసి ఇందౌర్ వస్తుంటాను. ఈ ఏడాది సనాతన్ ఇతివృత్తం ఆధారంగా పాల్‌రేచా ఫ్యామిలీ రాఖీని రూపొందించింది. ఈ రాఖీ చాలా అద్భుతంగా ఉంది" అని ఠకారియా పేర్కొన్నారు.
రైల్వే ట్రాక్‌పై రీల్స్- రైలు ఢీకొట్టడంతో రెండు చేతులు కోల్పోయిన యువతి
యజమాని ఎవరో తేల్చేందుకు గేదెకు DNA పరీక్ష- పోలీసుల సంచలన నిర్ణయం!

