ETV Bharat / bharat

భారీ వరదలను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్- రంగంలోకి దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందం

మహారాష్ట్రను అతలాకుతలం చేసేస్తున్న భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, నదులు- కొల్హాపుర్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం- సహాయక చర్యల కోసం 10 మంది సభ్యులతో కూడిన ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందం

India First Transgender Disaster Management Team
India First Transgender Disaster Management Team (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 9, 2026 at 5:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

India First Transgender Disaster Management Team : దేశంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రవాణా, కరెంట్ కష్టాలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కొల్హాపుర్ జిల్లాలో సంభవించే వరదలను ఎదుర్కోవడానికి జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆథారిటీ దగ్గర శిక్షణ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌తో కూడిన విపత్తు నిర్వహణ బృందం సిద్ధంగా ఉంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందం ఇదే. 10 రోజుల పాటు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్న ఈ పది మంది ట్రాన్స్‌జెండర్స్ సభ్యుల బృందం బుధవారం (జూలై 8) నాడు విపత్తు నిర్వహణ పరికరాలను స్వయంగా వినియోగించి క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందింది. జిల్లాలో ఏ విపత్తు సంభవించినా స్పందించేందుకు సన్నద్ధమైంది.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు
మహారాష్ట్రల్లోని కొల్హాపుర్ జిల్లా సహా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. స్థానిక నదులు ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొల్హాపుర్ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ 2,000 మందికి పైగా 'ఆపద మిత్ర', 'సఖి' వాలంటీర్లతో కూడిన శిక్షణ పొందిన బృందాన్ని సిద్ధం చేసింది. ఆ శిక్షణ పొందిన వారిలో 10 మంది ట్రాన్స్‌జెండర్ల బృందం కూడా ఉంది.

ఈ బృందం పనేంటి?
విపత్తు సమయంలో గాలింపు, సహాయక చర్యలు చేపట్టడం, బలమైన గాలుల వల్ల రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడం, వరద ప్రభావిత గ్రామాల్లో ముప్పును అంచనా వేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,అలాగే రోడ్డు ప్రమాదాలు లేదా రుతుపవన సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం వంటి వివిధ సందర్భాల్లో పౌరులకు సహాయం చేయడానికి ఈ బృందం సిద్ధంగా ఉంది. ఈ ఏడాదే తొలిసారిగా కొల్హాపుర్ జిల్లాకు చెందిన 10 మంది సభ్యుల ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందం కూడా ఈ విధుల్లో పాల్గొననుంది. కాగా, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు పౌరులకు సకాలంలో సహాయం అందేలా చూడటానికి తాము కట్టుబడి ఉన్నామని ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందంలో ఒకరైన శివాని గజ్‌బర్ వెల్లడించారు.

ఆగని భారీ వర్షాలు
కొల్హాపుర్ జిల్లాలోని ఘాట్‌మాథా ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కాస్త విరామం ఇచ్చినప్పటికీ, కొల్హాపుర్ జీవనాడి అయిన పంచగంగ నది నీటి మట్టం ప్రస్తుతం రాజారాం వీర్ (ఆనకట్ట) వద్ద 36 అడుగుల వద్ద ఉంది. వర్షాలు మరింత తీవ్రమైతే నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ సూచనల మేరకు వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లా విపత్తు నిర్వహణ విభాగం ట్రాన్స్‌జెండర్స్ బృందంతో కలిసి సిద్ధంగా ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ప్రసాద్ సంక్‌పాల్ తెలిపారు.

India First Transgender Disaster Management Team
దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ విపత్తు నిర్వహణ బృందం (ETV Bharat)

వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పింప్రి చించ్వాడ్‌లో కొండలా పేరుకుపోయిన చెత్తకుప్ప కూలి మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మందిని విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. మరో 11 మంది శిథిలాల కింద చిక్కుకుపోగా, వారి కోసం సహాయ చర్యలు చేపట్టారు. ఠాణె జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. 800 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు.

మరోవైపు, దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడటంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వసాయి-విరార్ సెక్షన్‌లో నీరు నిలిచి గుజరాత్ వైపునకు వెళ్లే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భోర్ ఘాట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ముంబయి-పుణె మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఆ దిశగా అధికారులు, మహా సర్కార్ చర్యలు చేపడుతోంది.

వయనాడ్‌ దుర్ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య- సహాయక చర్యలు ముమ్మరం

దేశంలో భారీ వర్షాలు- వరదలో కొట్టుకుపోయిన 3000 సిలిండర్లు