పాకిస్థాన్ కంటే భారత్ వద్ద అణ్వాయుధాలు ఎన్ని ఎక్కువ ఉన్నాయో తెలుసా?
రక్షణ రంగం, ఆయుధాలు, శాంతి భద్రతలపై నివేదిక విడుదల చేసిన సిప్రి- 2026జనవరి నాటికి భారత్ అణు వార్‌హెడ్‌ల సంఖ్య 190కి చేరిక- ప్రపంచంలో టాప్-15 సైనిక వ్యయ దేశాల్లో పాక్‌కి దక్కని చోటు

Published : June 8, 2026 at 5:09 PM IST
Sipri Rreport Nuclear Weapons : అంతర్జాతీయ అణు పోటీలో పాకిస్థాన్‌పై ఆధిపత్యాన్ని భారత్ మరింత పెంచుకుంది. 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య 190కాగా పాక్ వద్ద 170 ఉన్నాయి. ఈ మేరకు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-సిప్రీ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. పాకిస్థాన్ కంటే భారత్ 20 అణు వార్‌హెడ్‌లను అదనంగా కలిగి ఉంది. 2025లో ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మరింత ఆధునీకరించుకున్నాయి. గత దశాబ్ద కాలంలో భారత్ తన వ్యూహాత్మక అణు ప్రణాళికల్లో భాగంగా దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారించింది. అణ్వాయుధాల విషయంలో ప్రధానంగా చైనాను భారత్ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి పాకిస్థాన్ ద్వారా కలిగే ముప్పును తక్కువగా అంచనా వేయడం లేదని నివేదిక విశ్లేషించింది.
ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. రక్షణ వ్యయం విషయంలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. 2025లో భారత సైనిక వ్యయం 8.9 శాతం వృద్ధితో 92.1 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోని టాప్-15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్థాన్‌కు చోటు దక్కలేదు. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2 శాతం వాటాతో నిలిచింది. పాకిస్థాన్ 4.2శాతం వాటాతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రీ వివరించింది.
ఇదిలా ఉండగా, చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రి పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బీజింగ్ 20 అణు వార్‌హెడ్‌లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుందని చెప్పింది. ఇక, ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. ప్రస్తుతం రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది కాగా, వాటి వద్ద మొత్తంగా 12వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ (370), యూకే (225), ఇజ్రాయెల్ (90), ఉత్తరకొరియా (60) దేశాలు ఉన్నాయి.
ఇంకా, 2021-25 కాలంలో ప్రధాన ఆయుధాలను పొందిన 162 దేశాలను కూడా SIPRI గుర్తించింది. ఇందులో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ అతిపెద్ద దేశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధ దిగుమతుల్లో వీటి వాటా 35 శాతంగా ఉందని పేర్కొంది. అటు అణు ఆయుధాలు కలిగిన తొమ్మిది దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ తమ జాతీయ శక్తికి సాధనాలుగా అణు ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొంది. దేశాల మధ్య సాయుధ ఘర్షణల సంఖ్య 2024లో మూడు నుంచి 2025 నాటికి ఆరుకు రెట్టింపు అయిందని పేర్కొంది. వీటిలో కనీసం 13 దేశాలు పాలుపంచుకున్నాయి.
గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసిందని సిప్రి పేర్కొంది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని నివేదిక గుర్తుచేసింది. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, ఆర్మ్‌డ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మళ్లుతోందని సిప్రి స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యుద్ధాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణుశక్తి కలిగిన దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటున్నాయి.
అంగీకారంతో కూడిన శారీరక సంబంధం చెడు ప్రవర్తనకు సంకేతం కాదు: సుప్రీంకోర్టు
ఎస్ఐఆర్ సహా ఎన్నికల అక్రమాలపై త్వరలోనే CJIకు లేఖ రాస్తాం : మల్లికార్జున ఖర్గే

