ETV Bharat / bharat

భారత్​- వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం- 25బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం : మోదీ

భారత్ అనుసరిస్తున్న 'యాక్ట్ ఈస్ట్' విధానంలో వియత్నాం కీలక దేశమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి- UPI వ్యవస్థను వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో త్వరలో అనుసంధానం

india vietnam relations
india vietnam relations (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 3:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

India Vietnam Trade Agreement : ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని భారత్‌, వియత్నాం నిర్ణయించాయి. ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్న అవగాహనకు వచ్చాయి. ఇరుపక్షాలు 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు డిజిటల్ చెల్లింపులు, అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సంస్కృతితో సహా పలు రంగాలలో లోతైన ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశం కల్పిస్తాయి. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం అధ్యక్షుడు టో లాం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు.

భారత్ అనుసరిస్తున్న 'యాక్ట్ ఈస్ట్' విధానంలో వియత్నాం కీలక దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వియత్నాం సహకారంతో ఆసియాన్‌ దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం వియత్నాంతో కలిసి భారత్ పని చేస్తుందని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో అండగా నిలిచినందుకు వియత్నాంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక అనుసంధానతను పెంపొందించేందుకు రెండు దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా యూపీఐ వ్యవస్థను వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో త్వరలో అనుసంధానం చేయనున్నట్లు ప్రధాని వివరించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వియత్నాం అధ్యక్షుడు టో లాం తెలిపారు.

"2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మన ఔషధ అధికార వర్గాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం వియత్నాంలో భారతీయ ఔషధాల లభ్యతను పెంచుతుంది. వియత్నాంకు భారతీయ వ్యవసాయ, మత్స్య, పశు ఉత్పత్తుల ఎగుమతి కూడా సులభతరం కాబోతోంది. "త్వరలోనే భారతదేశపు ద్రాక్ష, దానిమ్మ పండ్లను వియత్నాం రుచి చూస్తుంది, అలాగే మనం వియత్నాం పోమెలో పండ్లను రుచి చూస్తాము. అంతేకాకుండా, ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఆధునీకరించడానిక అంగీకరించాం. ఇది భారతదేశానికి, అన్ని ఆసియాన్ దేశాలకు మధ్య వాణిజ్యానికి, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుంది. కీలక ఖనిజాలు, అరుదైన భూలోహాలు, ఇంధన సహకారంలో కొత్త కార్యక్రమాలు మన రెండు దేశాల ఆర్థిక భద్రతను, సరఫరా గొలుసు మెరుగుపరుస్తాయి. అనుసంధానం, సామర్థ్య నిర్మాణం మన భాగస్వామ్యానికి ముఖ్యమైన స్తంభాలు. రెండు దేశాల మధ్య విమాన అనుసంధానం నిరంతరం పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక బలాన్ని పెంచుకుంటున్న విషయం కూడా ఇరుపక్షాల మధ్య జరిగిన ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి వచ్చిన వియత్నాం అధ్యక్షుడు లామ్, మూడు రోజుల భారత్​లో పర్యటించనున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన దేశంలో చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇది. అంతకుముందు మంగళవారం రాష్ట్రపతి భవన్​లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి మోదీ ఆయనకు స్వాగతం పలికారు. దిల్లీకి వచ్చేముందు బిహార్​లోని బోధ్ గయాలోనూ పర్యటించి మహాబోధి ఆలయంలో ప్రార్థనలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం- మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

మగ పులి విక్రమ్: ముగ్గురు అటవీ సిబ్బందిని చంపిన నరమాంస భక్షకి- ఎనిమిదేళ్లు రెస్క్యూ సెంటర్‌లో ఖైదు!