ETV Bharat / bharat

బ్రహ్మోస్‌ 2.O- శత్రువులకు హడలే! 800 కిలోమీటర్ల పరిధికి అప్​గ్రేడ్

బ్రహ్మోస్ సామర్థ్యాన్ని పెంచే పనిలో నిమగ్నమైన భారత్ రక్షణ రంగ సంస్థలు

BrahMos Missiles 2.O
BrahMos Missiles 2.O (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 20, 2025 at 4:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

BrahMos Missiles 2.O : ఆధునిక యుద్ధ కాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదుగా మారింది. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రుస్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్‌ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు వణుకుపుట్టించిన బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణిని సామర్థ్యాన్ని పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది.

ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్థాన్‌పై దాడులకు బ్రహ్మోస్‌ క్షిపణులు కీలకపాత్ర పోషించాయి. అత్యంత కచ్చితత్వంతో శత్రుస్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్‌ క్షిపణులను భారత్‌ ఇప్పుడు అప్‌గ్రేడ్‌ చేసే పనిలో పడింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఈ క్షిపణి మరింతగా పదునుదేలుతోంది. దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సూపర్‌ సోనిక్‌ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లుగా ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోస్‌ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడుతో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. సుఖోయ్‌-30 MKI యుద్ధ విమానం దీనిని ప్రయోగించగలదు. ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్‌ క్షిపణిని తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తైపోయింది.

బ్రహ్మోస్ 2.O ముందుగా నేవీకి
అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌కు సంబంధించి ఇంటర్నల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ-ఎక్స్‌టర్నల్‌ గ్లోబల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ కాంబినేషన్‌ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్‌ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్‌ వేరియంట్‌లో సాఫ్ట్‌వేర్‌, ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజిని పెంచే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. క్షిపణి డిజైన్‌, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరింయట్‌ను చివరిగా వాయుసేన వాడే వేరియంట్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు.

భారత్‌ వద్ద ఉన్న అస్త్ర మార్క్‌ బియాండ్‌ విజువల్‌ రేంజి క్షిపణలను అప్‌గ్రేడ్‌ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న అస్త్ర మార్క్‌-2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకుపైగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. అస్త్ర మార్క్‌-1 రేంజిని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో ఆరు నెలల్లో అస్త్ర మార్క్‌-2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్‌-30 MKI, తేజస్‌లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్‌ జెట్‌ ఇంజిన్‌తో పనిచేసే అస్త్ర మార్క్‌-3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజిని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ నుంచి బీవీఆర్‌ క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది.