గ్లోబల్ చిప్ హబ్‌గా భారత్- మేక్ ఇన్ ఇండియా తదుపరి దశ సెమీకండక్టర్లే: ప్రధాని మోదీ
గుజరాత్ సనంద్‌లో సీజీ సెమీ ఓఎస్ఏటీ ప్లాంట్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ- భారత్‌లోనే పూర్తి ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్ నిర్మిస్తామని ప్రకటన- గ్లోబల్ చిప్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతామని కీలక వ్యాఖ్యలు

Published : July 4, 2026 at 7:27 PM IST
Modi Gujarat Visit : భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేసిన CG సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్ రంగం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో తదుపరి దశ (నెక్ట్స్ ఫేజ్) అని పేర్కొన్నారు. దేశంలో పూర్తి ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ గుజరాత్ ప్లాంట్‌లో ప్రతి ఏడాది 20 కోట్ల చిప్‌ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సంస్థ త్వరలోనే చేరుకుంటుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. 'సెమికాన్ ఇండియా కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. స్టెప్ బై స్టెప్.. బ్రిక్ బై బ్రిక్.. ఇప్పుడు చిప్ బై చిప్‌గా భారత్ ముందుకు సాగుతోంది. దేశంలో ఏడాదికి 50 కోట్ల చిప్‌ల ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా త్వరలోనే సాధిస్తామని నమ్ముతున్నాను' అని మోదీ అన్నారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్
ఈ సందర్బంగా గత పదేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధాని వివరించారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచిందన్నారు. మొబైల్ ఎగుమతుల్లో కూడా రెండో స్థానంలో ఉందని, 2014తో పోలిస్తే దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి దాదాపు 7 రెట్లు పెరిగిందన్నారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సుమారు 11 రెట్లు పెరిగినట్లు తెలిపారు.
ఫినిష్డ్ ప్రొడక్ట్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు
సెమీ కండక్టర్ రంగంలో ఈ అభివృద్ధి ఒక్కరోజులో సాధ్యపడలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత పదేళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితమే నేటి విజయం అని పేర్కొన్నారు. 'ముందుగా ఫినిష్డ్ ప్రొడక్ట్స్.. తర్వాత కాంపోనెంట్స్.. ఇప్పుడు సెమీకండక్టర్ల దశకు చేరుకున్నాం. అంటే పూర్తి ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్ భారత్‌లోనే ఏర్పడుతుంది. అది నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే రోడ్ మ్యాప్. ఇదే మేక్ ఇన్ ఇండియా తదుపరి దశ' అని మోదీ అన్నారు. ఐదేళ్ల కిందటే భారత్‌ను ప్రపంచ సెమీ కండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించామని ప్రధాని గుర్తు చేశారు.
చిప్ ప్యాకేజింగ్ ఉత్పత్తి ప్రారంభం కావడం చరిత్రాత్మక ఘట్టం: మోదీ
డిజైన్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మంత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దేశంలోని మూడో సెమీ కండక్టర్ ప్లాంట్‌లో ఇప్పుడు వాణిజ్య పరంగా చిప్ ప్యాకేజింగ్ ప్రారంభం కావడం కీలక మైలురాయి, చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ప్లాంట్‌కు 2024లో తాను శంకుస్థాపన చేశానని, 2025 ఆగస్టులో టెస్టింగ్ చిప్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పిన మోదీ ఇప్పుడు పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వ్యాఖ్యానించారు. శంకుస్థాపన నుంచి ఉత్పత్తి దశకు చేరుకోవడం వెనుక సంస్థ బృందం, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల కృషి ఎంతో ఉందని వారిని అభినందించారు.
భారత్- జపాన్- థాయిలాండ్ భాగస్వామ్యానికి నిదర్శనం
గుజరాత్‌లోని ఈ CG సెమీ ప్లాంట్ కేవలం వ్యాపార కేంద్రం మాత్రమే కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్, జపాన్, థాయిలాండ్ దేశాల పరిశ్రమల మధ్య ఏర్పడిన సాంకేతిక సహకారం, పరస్పర విశ్వాసం, భాగస్వామ్యానికి నిదర్శనం అని అన్నారు. ఈ భాగస్వామ్యం భారత సెమీకండక్టర్ రంగానికి మరింత ఊతం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా లక్ష్యంగా ఉంది. ఇంకా దీని ద్వారా గ్లోబల్ చిప్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.
'మరణం కోసం ఆస్ట్రేలియా వస్తున్న మోదీ'- ప్రధానికి హత్య బెదిరింపులు
అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం- ప్రజలపై భారం పడకుండా చూశాం: మోదీ

