ETV Bharat / bharat

విదేశాంగ విధానాలు ఫెయిల్- మోదీ సర్కారు వల్లే భారత్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది: కాంగ్రెస్

దేశ ప్రజల చూపును మళ్లించడానికే అమెరికాతో ట్రేడ్ డీల్- డీల్‌ను ఖరారు చేయమని ట్రంప్‌పై మోదీ ఒత్తిడి చేసి ఉంటారు- కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్

Congress On Modi
Congress On Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 2:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

Congress On Modi : మోదీ సర్కారు విదేశాంగ విధానం విఫలమవుతున్నందుకు, మన దేశం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, భారతదేశ విలువలు, సూత్రాలు, ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని పేర్కొంది. ఇరాన్‌పై దాడికి అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ, ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించి ప్రధాని మోదీ పెద్ద తప్పు చేశారని హస్తం పార్టీ మండిపడింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇంఛార్జి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని ఆయన గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పార్లమెంటు (నెస్సెట్)లో ప్రధాని మోదీ ప్రసంగించి, పిరికితనంతో నైతికతకు నీళ్లు వదిలిన విషయాన్ని యావత్ ప్రపంచానికి చాటుకున్నారని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు.

ప్రధాని సారథ్యంలోని చీర్ లీడర్లకు అర్థం కావట్లేదు
"తనను తాను విశ్వగురువుగా ప్రకటించుకున్న ప్రధాని మోదీ గురించి ఇప్పుడు అందరికీ పూర్తిగా తెలిసిపోయింది. ప్రధాని మోదీ అనుసరించిన విదేశాంగ విధానంపైనా అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ప్రధాని సారథ్యంలోని కొందరు చీర్ లీడర్లకు ఇదేమీ అర్థం కావడం లేదు. ఇరాన్‌లోని కీలక వ్యక్తుల హత్యల కోసం ఇజ్రాయెల్, అమెరికా నిర్వహించిన దాడులపై మోదీ సర్కారు స్పందించకపోవడం అనేది భారతదేశ విలువలు, సూత్రాలు, ప్రయోజనాలకు ద్రోహం చేయడమే" అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం ఎందుకు ?
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో రొమాన్స్‌లో ఉన్నారు. అందుకే ఆయన పదేపదే పాక్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. చివరకు విద్వేష వ్యాఖ్యలతో జమ్మూకశ్మీరులోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగడానికి కారకుడైన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను కూడా ట్రంప్ ఆకాశానికి ఎత్తుతున్నారు. తాజాగా అఫ్గానిస్థాన్‌పై పాక్ దాడులనూ అమెరికా అధ్యక్షుడు సపోర్ట్ చేశారు. దిగుమతి సుంకాలను పెంచుతానని బెదిరించి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను 2025 మే 10న ఆపింది తానే అని ఇప్పటివరకు వందల సార్లు ట్రంప్ చెప్పుకున్నారు. కానీ భారత ప్రధాని మోదీ పూర్తిగా మౌనాన్ని వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌ ఆగిందనే విషయంపై తొలుత అమెరికానే ప్రకటన చేసింది. 2025 మే 10న సాయంత్రం 5.37 గంటలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనిపై ప్రకటన చేశారు" అని జైరాం రమేశ్ తెలిపారు.

ట్రంప్‌పై మోదీ ఒత్తిడి చేసి ఉంటారు
"ప్రధాని మోదీ విన్నపం మేరకు భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌ను ఖరారు చేశానని 2026 ఫిబ్రవరి 2న ట్రంప్ ప్రకటించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న కీలక అంశాల నుంచి ప్రజల చూపును మళ్లించడానికే మోదీజీ ఈ ప్రయత్నం చేసి ఉంటారు. ట్రంప్ ప్రకటన చేసిన 18 రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వ సుంకాల పాలసీని తప్పుపడుతూ సాక్షాత్తూ అక్కడి సుప్రీంకోర్టే తీర్పును ఇచ్చింది. ఏకపక్షంగా ప్రపంచ దేశాలపై సుంకాలను బాదడం రాజ్యాంగ వ్యతిరేకమని ట్రంప్ సర్కారుకు మొట్టికాయలు వేసింది. ట్రంప్‌ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇలాంటి తీర్పు వస్తుందని అన్ని దేశాలూ ముందే అంచనావేశాయి. కానీ తన సొంత రాజకీయ సమీకరణాల కోసం భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేయమని ట్రంప్‌పై ప్రధాని మోదీ ఒత్తిడి చేసి ఉంటారు. భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ ఏకపక్షంగా ఉందని అందరికీ తెలిసిపోయింది. అమెరికా వస్తు, ఉత్పత్తుల కోసం భారత మార్కెట్‌ను తెరుస్తామని మోదీ సర్కారు పెద్దపెద్ద హామీలు ఇచ్చింది. కానీ అమెరికా వైపు నుంచి భారత్‌కు అలాంటి హామీలేం లభించలేదు. ఈ ట్రేడ్ డీల్‌కు ప్రతిగా రష్యా నుంచి చమురును కొనడాన్ని ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా అంటోంది.దీనిపైనా ఇప్పటిదాకా మోదీ సర్కారు దేశ ప్రజలకు స్పష్టతను ఇవ్వలేదు" అని జైరాం రమేశ్ చెప్పారు.

చైనాకు ప్రధాని మోదీయే క్లీన్‌చిట్ ఇచ్చారు
"గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనిక ఘర్షణ జరిగాక, 2020 జూన్ 19న చైనాకు క్లీన్ చిట్ ఇచ్చేలా ప్రధాని మోదీ ప్రకటన చేశారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వారి త్యాగాలను మర్చిపోయినట్టుగా భారత ప్రధాని వ్యవహరించారు. మోదీ బాధ్యతారహిత ప్రకటన వల్లే చైనాతో జరిగిన చర్చల్లో భారత్ బలంగా వాణిని వినిపించలేకపోయింది. చైనా షరతుల ప్రకారమే సరిహద్దు నిర్వహణ మార్గదర్శకాలను అమల్లోకి తేవాల్సి వచ్చింది. మోదీ సర్కారు విదేశాంగ విధాన వైఫల్యాల వల్ల భారతదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది" అని జైరాం రమేశ్ తెలిపారు.