ఎబోలా వైరస్ అలర్ట్ - ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం- భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ- కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన

Published : May 24, 2026 at 9:58 AM IST
India Advises Citizens Mid Ebola Outbreak : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయడం తప్పనిసరని ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల ఎబోలా వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అదే సమయంలో ఆఫ్రికా సీడీసీ కూడా కాంగో, ఉగాండాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ పరిస్థితిని 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ'గా గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సూచనల ప్రకారం, భారత పౌరులు అత్యవసరం కాని పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాకుండా విదేశీ ప్రయాణికులపై విమానాశ్రయాల్లో ఆరోగ్య తనిఖీలు కఠినతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే ప్రత్యేక స్క్రీనింగ్ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
WHO Declares Ebola Outbreak a Public Health Emergency of International Concern; Africa CDC Declares Public Health Emergency of Continental Security. Government of India Advises Citizens to Avoid Non-Essential Travel to Democratic Republic of the Congo, Uganda and South Sudan.
— ANI (@ANI) May 24, 2026
In… pic.twitter.com/na0aqU51TR
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ, మే 22న సభ్య దేశాలకు తాత్కాలిక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా విమానాశ్రయాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని సూచించింది. కాంగో, ఉగాండా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో జ్వరం లేదా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అలాగే వైరస్ గుర్తించిన ప్రాంతాలకు ప్రయాణాలను తగ్గించాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ప్రస్తుతం దీనికి కచ్చితమైన చికిత్స లేదు!
"మామూలుగా ఎబోలా వైరస్ జంతువులు, గబ్బిలాలకు సోకుతుంది. ఆ వైరస్ సోకిన జంతువులను వేటాడి (బుష్‌మీట్) తినడం వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే, వ్యాధి లక్షణాలు కనిపించడానికి మాత్రం 21 రోజుల సమయం పడుతుంది. ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు తొలుత కనిపించినా, చివరకు అవయవాల వైఫల్యానికి దారితీసే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో శరీరం లోపలా, బయటా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. వైరస్ సోకిన వ్యక్తి శరీర ద్రవాల ద్వారా ఇది ఇతరులకూ వ్యాపిస్తుంది" అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అయితే, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం, కాంగో, ఉగాండా సరిహద్దు దేశాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సూడాన్ దేశానికి వ్యాధి వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఎబోలా ఒక తీవ్రమైన వైరల్ హీమరేజిక్ ఫీవర్ అని, ఇది బుండిబుగ్యో వైరస్ స్ట్రెయిన్ వల్ల వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఈ స్ట్రెయిన్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా కచ్చితమైన చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వైరస్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక బృందాలు ఖననం చేయాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. అయితే ఇప్పటివరకు భారత్‌లో బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా కేసులు ఏవీ నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.
క్రికెట్ గాడ్‌కు డైహార్డ్ ఫ్యాన్- ఏటా సచిన్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్‌గా షాహీ లిచీ ఫ్రూట్స్

