ETV Bharat / bharat

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు- ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్‌!- ఫీచర్స్​ అదుర్స్​!

చైనా, జర్మనీలకు ధీటుగా భారత్‌లోని హైడ్రోజన్ రైలు- త్వరలో పట్టాలపై పరుగులు పెట్టే ఛాన్స్

India First Hydrogen Train
India First Hydrogen Train (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 9:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

India First Hydrogen Train : ఏ దేశ ఆర్థిక, సామాజిక పురోగతికైనా రైల్వేల పాత్రను కీలకంగా పరిగణిస్తారు. భారతీయ రైల్వే కూడా ఇదే వ్యూహంపై ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో దేశంలో మొదటి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలును త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. అందుకే ఈ స్టోరీలో దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి నడుస్తుంది? దానిలో ఉన్న స్పెషల్ ఫీచర్లు ఏంటి? ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది? మొదటి హైడ్రోజన్ రైలు ఏ దేశంలో నడిచింది? ప్రస్తుతం హైడ్రోజన్ రైళ్లు ఏయే దేశాలలో నడుస్తున్నాయి? తదితర విషయాలు తెలుసుకుందాం.

ట్రయల్ రన్ పూర్తి
2030 నాటికి కర్బన ఉద్గారాలు జీరోకు తగ్గించేందుకు, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లపై ఆధారపడటాన్ని తొలగించేందుకు హైడ్రోజన్ రైళ్లను రైల్వే శాఖ తీసుకొస్తోంది. అలాగే హైడ్రోజన్ రైళ్ల వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. ఈ ట్రైన్ ట్రయల్ రన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 25న హరియాణాలోని జింద్‌లో నిర్వహించారు.

అధునాతన ఫీచర్లు
కాగా, హైడ్రోజన్‌ రైలు బోగీలను చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారు చేశారు. ఈ ట్రైన్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బ్రాడ్ గేజ్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన రైలు (10 కోచ్‌లు) ఇదే కానుంది. అలాగే అత్యంత శక్తివంతమైన (2400 kW) హైడ్రోజన్ రైలు కూడా ఇదే అవ్వనుంది. దీనికి రెండు 1200 kW డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీలు) ఉన్నాయి. అంటే ఒకటి ఇంజిన్ ముందు భాగంలో, మరొకటి వెనుక భాగంలో అమర్చి ఉంటుంది. ఇందులో ఎనిమిది ప్యాసింజర్ కార్లు కూడా ఉన్నాయి. అలాగే హైడ్రోజన్ రైలు సౌకర్యాల పరంగా కూడా చాలా అధునాతనంగా ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

పర్యావరణహిత ట్రైన్
డీజిల్‌తో నడిచే రైళ్లు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను విడుదల చేస్తాయి. దీంతో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ రైళ్లు నడపాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న విషయం. ముఖ్యమైన ఓవర్‌హెడ్ లైన్ మౌలిక సదుపాయాలు అవసరం. తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ రైలును నడపొచ్చు. అలాగే ఇది కాలుష్య కారకాలను ఉత్తత్తి చేయదు. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. అంతే కాకుండా ఈ హైడ్రోజన్ రైలు డీజిల్ ఇంజిన్ల లాగా భారీ శబ్దాలు చేయకుండా చాలా నిశబ్దంగా వెళ్లిపోతుంది.

ఛార్జీ కూడా తక్కువే!
ఒక్కో హైడ్రోజన్ రైలు తయారీకి దాదాపు రూ.80 కోట్ల ఖర్చు అవ్వనుంది. మొదటి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ కోసం రూ.120 కోట్లు ఖర్చు చేశారు. డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణీకులకు సమయం ఆదా అవుతుంది. అలాగే ఇతర రైళ్లతో పోలిస్తే టికెట్ ధరలు కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది.

ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జర్మనీ 2018లో పట్టాలపైకి తీసుకొచ్చింది. ఈ రైలులో 150 సీటింగ్ సామర్థ్యం ఉంది. ఇది గరిష్ఠంగా గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అలాగే 1,000 కి.మీల రేంజ్ వరకు ప్రయాణించగలదు. ఆ తర్వాతి కాలంలో చైనా, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలాగే ఇండియాతో పాటు కెనడా, ఇటలీ, సౌదీ అరేబియా, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, పోలాండ్, స్వీడన్‌లలో హైడ్రోజన్ రైళ్ల ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. త్వరలో ఆయా దేశాల్లోనే హైడ్రోజన్ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.