దేవుడి ఊరేగింపులో హ్యూమనాయిడ్ రోబో- మంత్రాలు పఠిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి
మహాకాల్ ఊరేగింపులో తొలిసారి ప్రత్యేక ఆకర్షణగా మరమనిషి- షిప్రా నదిలో పడవపై రోబో ప్రయాణం- మంత్రం పఠిస్తూ, భక్తుల అభివాదాలకు స్పందించిన హ్యూమనాయిడ్

Published : September 2, 2026 at 8:52 AM IST
Humanoid Robot In Ujjain Sawari : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే బాబా మహాకాల్ ఊరేగింపు భక్తులకు ఎంతో ప్రత్యేకం. శ్రావణ మాసంలో నాలుగు, భాద్రపద మాసంలో రెండు సార్లు జరిగే ఈ ఊరేగింపులకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న జరిగిన భాద్రపద మాసపు తొలి ఊరేగింపు మాత్రం మరింత ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా దేవుడి ఉత్సవ విగ్రహాలు, కళాకారులు, భక్తులతో కనిపించే ఊరేగింపులో ఈసారి ఓ హ్యూమనాయిడ్ రోబో కూడా పాల్గొంది. మనిషిని పోలిన రూపంతో ఉన్న ఈ మరమినిషి ఊరేగింపులో సందడి చేయడమే కాకుండా షిప్రా నదిలో పడవపై ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచింది.
ఊరేగింపులో రోబో ప్రత్యేక ఆకర్షణ
భాద్రపద మాసపు తొలి సోమవారం సందర్భంగా బాబా మహాకాల్ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఇందులో ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల, నడుము భాగంలో కంప్యూటర్ వ్యవస్థకు అనుసంధానమైన కెమెరాలు, సెన్సార్లతో ఈ రోబోను రూపొందించారు. ఊరేగింపులో రోబో కనిపించడంతో భక్తులు ఆసక్తిగా దాన్ని తిలకించారు. భక్తులు అభివాదం చేయగా రోబో కూడా స్పందించింది. అంతేకాకుండా సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
రోబోకు కాషాయ వస్త్రాలు
ఊరేగింపు షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌కు చేరుకున్న సమయంలో ఈ రోబోకు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక అలంకరణ చేశారు. పూజారులు దాని మణికట్టుకు పవిత్రమైన కలావా కట్టారు. రుద్రాక్ష మాల, కాషాయ రంగు వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం రోబో సంస్కృత మంత్రాన్ని పఠించింది. "ఆకాశే తారకం లింగం పాతాలే హాటకేశ్వరం, భూలోకే చ మహాకాలో లింగత్రయ నమోస్తుతే" అంటూ రోబో మంత్రాన్ని పఠించడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

షిప్రాలో పడవపై ప్రయాణం
మహాకాల్ ఊరేగింపులో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం షిప్రా నది వద్ద కనిపించింది. దత్త అఖాడా ఘాట్ నుంచి రోబో ఓ పడవలో ఎక్కింది. అనంతరం షిప్రా నదిపై ప్రయాణిస్తూ శ్రీరామ్ ఘాట్‌కు చేరుకుంది. ఒకవైపు పవిత్ర షిప్రా నదిలో పడవపై ఆధునిక హ్యూమనాయిడ్ రోబో, మరోవైపు ఘాట్ల వద్ద మహాకాల్ నామస్మరణతో భక్తులు కనిపించడంతో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా షిప్రా నది, మహాకాల్ స్వామికి నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన రోబోను కూడా కలిశారు. ఇదే సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించడంతో మహాకాల్ ఊరేగింపు మరింత వైభవంగా సాగింది.

మనుషులను భర్తీ చేయడం లక్ష్యం కాదు
హ్యూమనాయిడ్ రోబో మనిషి శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినట్లు మహాకాళ్ ఆలయ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆశిష్ ఫల్వాడియా తెలిపారు. దీని ఉద్దేశం మనుషులను భర్తీ చేయడం కాదని, భవిష్యత్తులో మనుషులతో కలిసి పనిచేయగల సాంకేతికతను పరిచయం చేయడమేనని చెప్పారు. మహాకాళ్ ఆలయ నిర్వహణ కమిటీ కూడా ఈ రోబో ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంది. భక్తిభావంతో నిండిన వాతావరణంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా మారుతున్న కాలంలో టెక్నాలజీ ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చినట్లు తెలిపింది. జనసమూహ నిర్వహణకు సంబంధించిన సందేశాన్ని కూడా రోబో ద్వారా అందించారు. ఇప్పటివరకు H1, H1-2, G1, R1 వంటి పలు నమూనాలను అభివృద్ధి చేసినట్లు వివరించింది.

గిరిజన కళాకారుల ప్రదర్శనలు
మహాకాల్ ఊరేగింపులో రోబోతో పాటు మధ్యప్రదేశ్ జానపద, గిరిజన సంస్కృతులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలోని ఎనిమిది గిరిజన బృందాలకు చెందిన 500 మందికి పైగా కళాకారులు తమ సంప్రదాయ కళలను ప్రదర్శించారు. మరోవైపు వేద విద్యను అభ్యసిస్తున్న 1,100 మంది బటుకులు వేద మంత్రాలను పఠించారు. '84 మహాదేవుల'ను ప్రతిబింబించే శకటాలు, కదిలే ప్రదర్శనలు కూడా ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటి ద్వారా ఉజ్జయిని ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మహాదేవుని వివిధ రూపాల గురించి భక్తులకు వివరించారు. రామ్‌ఘాట్‌కు ఊరేగింపు చేరుకున్న తర్వాత శ్రీ మహాకాళేశ్వర్ బ్యాండ్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది.

1,500 మంది డమరుకం కళాకారులతో రికార్డు
మహాకాల్ ఊరేగింపు సందర్భంగా అవంతిక నగరమంతా డమరుకం శబ్దంతో మార్మోగింది. భస్మ హారతి తాళానికి అనుగుణంగా 1,500 మంది వాద్యకారులు డమరుకాలను వాయించారు. ఈ భారీ ప్రదర్శన ప్రపంచ రికార్డును సృష్టించింది. భక్తులు, సాధువులు, కళాకారులు, వేద విద్యార్థులతో పాటు హ్యూమనాయిడ్ రోబో కూడా ఊరేగింపులో భాగం కావడంతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా నిలిచింది. హ్యూమనాయిడ్ రోబోలను కేవలం గృహ సహాయకులుగా చూడటం తొందరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోటిక్స్, కృత్రిమ మేధ పరిశోధనలు, విద్య, శిక్షణ, ప్రదర్శనలు, పరిశ్రమల్లోని కొన్ని ప్రత్యేక పనుల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే వస్తువులను ఎత్తడం, ప్రమాదకరమైన పనుల్లో సహాయం చేయడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి తోడ్పడటం వంటి పనుల్లోనూ హ్యూమనాయిడ్ రోబోలు ఉపయోగపడే అవకాశం ఉంది.
క్యాన్సర్‌తో మాట పోయినా కళను వదల్లేదు- పెయింటింగ్, కాలిగ్రఫీతో భావాలకు ప్రాణం
ఇంట్లోని తడి చెత్తతో కంపోస్ట్ తయారీ- 'హోమ్ కంపోస్టింగ్ మెషీన్' అభివృద్ధి- యువకుడి వినూత్న స్టార్టప్

