AI రంగంలో భారత్‌దే హవా- రెండేళ్లలో రూ.18లక్షల కోట్ల పెట్టుబడులు: అశ్విని వైష్ణవ్
ప్రపంచ దిగ్గజాల చూపు మనవైపే- డీప్ టెక్ స్టార్టప్స్‌కు పండగే- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోనే ఇది సాధ్యం- దిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జోష్

Published : February 17, 2026 at 8:25 PM IST
200 billion AI investment India : రానున్న రెండేళ్ల కాలంలోనే దేశంలోకి ఏకంగా 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు రానున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం దిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' వేదికగా ఆయన ఈ వార్తను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లు ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
"ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ప్రధానంగా మూడు రకాల ఆసక్తులు కనిపిస్తున్నాయి. మొదటిది నేరుగా భారీ పెట్టుబడులు పెట్టడం. రానున్న రెండేళ్లలో 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. రెండోది 'డీప్ టెక్' ఫండింగ్. వెంచర్ క్యాపిటలిస్టులు భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడానికి క్యూ కడుతున్నారు. మూడోది భారతీయ ఆవిష్కరణలు. మన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది" అని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయని, ఇవి వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో కార్యరూపం దాలుస్తాయని తెలిపారు.
#WATCH | Delhi | At India AI Impact Summit, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw says, " so far, in the coming two years, we should be seeing more than usd 200 billion investment across the five layers of the ai stack." pic.twitter.com/OwuaUr37cH
— ANI (@ANI) February 17, 2026
టెక్నాలజీలో మనమే టాప్
భారతదేశం సాధించిన డిజిటల్ విప్లవం గురించి మంత్రి గొప్పగా చెప్పారు. "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం నిర్మించుకున్న 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ఒక అద్భుతం. దీనివల్ల ఏఐ టెక్నాలజీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. జనాభా ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించడానికి మన వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. అందుకే గ్లోబల్ సీఈఓలు మన దేశంలోని డీప్ టెక్ స్టార్టప్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు" అని అన్నారు.
కఠిన చట్టాలు తప్పవు!
సాంకేతికత ఎంత మంచిదో, డీప్‌ఫేక్స్ అంత ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో, దానిపై మంత్రి స్పందించారు. "సమాజంలో డీప్‌ఫేక్స్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మన పిల్లలను, సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవు. మరింత కఠినమైన రెగ్యులేషన్స్ అవసరం. దీనిపై పార్లమెంట్‌లో ఏకాభిప్రాయం తీసుకురావాలి" అని మంత్రి చెప్పారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా (ఫేస్‌బుక్), ఎక్స్ వంటి సంస్థలు కచ్చితంగా భారత రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వయసు ఆధారిత ఆంక్షలు విధించే దిశగా పరిశ్రమ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మేక్ ఇన్ ఇండియా సత్తా
ఈ సదస్సులో భారత్ తన సొంత ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించింది. "మన దేశీయ మోడల్స్ ప్రపంచస్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవు. గ్లోబల్ బిగ్ మోడల్స్‌తో (చాట్ జీపీటీ, జెమినై వంటివి) ఇవి పోటీ పడుతున్నాయి. ఐఐటీ బాంబే కన్సార్టియం, సర్వం ఏఐ, టెక్ మహీంద్రా వంటి 12 సంస్థలు భారతీయ డేటాసెట్స్ ఆధారంగా వీటిని రూపొందించాయి. 'ఏఐ మిషన్ 2.0'లో భాగంగా వీటికి భారీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం" అని వైష్ణవ్ తెలిపారు.
యువతలో ఫుల్ జోష్
ఈ సమ్మిట్‌కు వచ్చిన స్పందన చూసి మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. "ఏఐ సమ్మిట్‌లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా యువకులు, పరిశోధకులు, విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. సెషన్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా యువతలో ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తోంది" అని అన్నారు.
ఈ సమ్మిట్‌లో పాలసీ మేకర్లు, గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్లు, ఇన్వెస్టర్లు, ఇన్నోవేటర్లు ఒకే వేదికపైకి వచ్చారు. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఏఐ అభివృద్ధిపై భారత్ విజన్‌ను ప్రధాని ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్ : భారత ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ గైర్హాజరు!
మూడో పెళ్లి చేసుకున్న IAS అధికారి- 'ఆమె' కూడా ఐఏఎస్ ఆఫీసర్- మాజీ భార్యలిద్దరూ కలెక్టర్లే!

