వార్ ఎఫెక్ట్- మక్కాలో చిక్కుకున్న వేలాది భారతీయులు!
మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశం నుంచి మక్కాకు వెళ్లిన వేల మంది భక్తులు- విమానాలు లేక మక్కా, మదీనాల్లో తీవ్ర ఇబ్బందులు

Published : March 2, 2026 at 9:11 PM IST
Indian Devotees Stuck In Makkah : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర రంజాన్ వేళ మక్కాకు వెళ్లిన వేలాది భారతీయుల భక్తులు అక్కడే చిక్కుకుపోయారని సమాచారం. పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా కోసం మహారాష్ట్రలోని నాసిక్, మాలెగావ్, ధూలే జిల్లాలకు చెందిన వేలాది మంది ముస్లిం భక్తులు మక్కా వెళ్లారు. ఇంతలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు భీకరంగా దాడి చేశాయి. అవి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీనితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. దీనితో ఆయా దేశాలు విమాన సర్వీసులను ఆపేశాయి. దీనితో భారత్ నుంచి వెళ్లిన భక్తులు మక్కా, మదీనాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో రెండో అష్రా కోసం వెళ్లాలనుకున్న భక్తుల ప్రణాళికలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.
ఇస్లాం మతంలో రంజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం మూడు అష్రాలుగా విభజింపబడుతుంది. ఒక్కో అష్రాలో 10 రోజులు ఉంటాయి. మొదటి అష్రా 'రహ్మత్' (కృప), రెండోది 'మగ్ఫిరత్' (క్షమాపణ), మూడోది 'నిజాత్' (నరకం నుంచి విముక్తి). ప్రతి సంవత్సరం నాసిక్ జిల్లా నుంచి సుమారు 1000 మందికి పైగా, మాలెగావ్, ధూలే నుంచి సుమారు 1500 మందికి పైగా భక్తులు సౌదీ అరేబియాకు వెళ్తుంటారు. మొదటి అష్రా కోసం వెళ్లిన భక్తులు మార్చి 2, 3 తేదీల్లో తిరిగి భారత్‌కు రావాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీనితో మక్కా, మదీనాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తమ వారి కోసం భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వీసా వెబ్సైట్ క్లోజ్
రంజాన్ సమయంలో ఉమ్రా కోసం వెల్లే యాత్రికుల కోసం సౌదీ అరేబియా ఓ వీసా వెబ్‌సైట్‌ను ఉంచింది. అది మరో 3 రోజుల్లో క్లోజ్ అవుతుంది. దీని వల్ల ఇప్పుడు మక్కా, మదీనాలకు వెళ్లాలని కోరుకుంటున్న భక్తులకు వీసా దొరకడం కష్టంగా మారింది. మరోవైపు ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్లు తమ వీసా గడువు పొడిగించుకోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రంజాన్ 20వ రోజు నాటికి మరో 300మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వెళ్లాల్సి ఉంది. కానీ యుద్ధ పరిస్థితుల వల్ల వారి ప్రయాణం రద్దు అయ్యింది.

