ETV Bharat / bharat

వేల ఏళ్లు నిలిచేలా అయోధ్య రామాలయ నిర్మాణం- కట్టడమంతా రాతి దిమ్మెలతోనే- ధ్వజారోహణకు అంతా సిద్ధం!

వేల ఏళ్లు నిలిచేలా అయోధ్య రామమందిరం- నిర్మాణ పనుల్లోని ప్రతీదశపైనా నిపుణుల ప్రత్యేక శ్రద్ధ- రామ మందిరంపై ధర్మ ధ్వజాన్ని ఎగురవేయనున్న ప్రధాని మోదీ

Dharma Dhwaja Ceremony In Ayodhya
Dharma Dhwaja Ceremony In Ayodhya (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 24, 2025 at 2:27 PM IST

5 Min Read
Choose ETV Bharat

Dharma Dhwaja Ceremony In Ayodhya : అయోధ్య రామమందిరం ఆధ్యాత్మికతకు చిహ్నంగానే కాకుండా, ప్రాచీన భారతీయ నిర్మాణ శైలి, ఆధునిక శిలా నిర్మాణ మెళకువల అద్భుత సమాహారంగా నిలుస్తోంది. ఇనుము, సిమెంట్ లేకుండా బండరాళ్లతో వేల ఏళ్లు నిలిచేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణంతో ముడిపడిన ప్రతీ సమాచారం ఎంతో ఆసక్తికరమైంది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీ వేదికగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్) జరుగుతోంది. ఇందులో అయోధ్య రామ మందిరం నమూనాను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిపుణుల సంయుక్త టీమ్ ప్రదర్శించింది. ఆలయం నిర్మాణ రహస్యాలను, నిర్మాణంలో వినియోగించిన బలమైన బండరాళ్ల సమాచారాన్ని సందర్శకులకు వారు వివరిస్తున్నారు. ఆ వివరాలను మనమూ తెలుసుకుందాం.

రాతి దిమ్మెలతోనే ఆలయ నిర్మాణం
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం వేల సంవత్సరాల వయసు కలిగిన బలమైన బండరాళ్లను వినియోగించారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యోగేంద్ర సింగ్ తెలిపారు. మొత్తం ఆలయాన్ని రాతి దిమ్మెలతోనే నిర్మించినట్లు చెప్పారు. ఏ భాగంలోనూ ఇనుము లేదా సిమెంట్‌ను వాడలేదన్నారు. బండరాళ్లను ఒకదానికొకటి 'ఇంటర్‌లాక్' అయి ఉండేలా అత్యంత జాగ్రత్తగా నిర్మాణ పనులు చేసినట్లు వివరించారు. ఈక్రమంలో ఒక బండరాయిని, మరో బండరాయితో బిగించడానికి రాగి క్లాంప్‌లను వాడామని యోగేంద్ర తెలిపారు.

Dharma Dhwaja Ceremony In Ayodhya
అయోధ్య రామమందిరం నమూనా (ETV Bharat)

ఆలయ నిర్మాణంలో 3 రకాల శిలలు

  • అయోధ్య రామమందిరం పునాది పనుల్లో గ్రానైట్‌ను వాడారు. ఆలయం పునాదిలో ఉపయోగించిన గ్రానైట్ దాదాపు 2.4 బిలియన్ సంవత్సరాలు పాతది, చాలా బలమైంది.
  • రామాలయం బాహ్య అలంకరణ పనుల కోసం ఇసుకరాయిని వినియోగించారు. దీన్ని రాజస్థాన్‌లోని పింద్వారా. బన్సీ పర్వతాల నుంచి తీసుకొచ్చారు.
  • రామాలయం లోపల కనిపించే అన్ని తెల్లని భాగాలలో అమర్చింది పాల రాయే. దీన్ని మక్రానా నుంచి తెప్పించారు. 'గ్రేడ్ వన్' చక్కటి నాణ్యత గల పాలరాయిని ఇందుకు వినియోగించారు.
  • శ్రీరాముడి విగ్రహం కూడా చాలా చక్కటి గ్రేడ్, అధిక నాణ్యత, అధిక బలం కలిగిన గ్రానైటిక్ శిలతో తయారు చేశారు.
Dharma Dhwaja Ceremony In Ayodhya
రామమందిరం కోసం ఉపయోగించిన శిలలు (ETV Bharat)

ప్రతీ బండరాయి, దిమ్మెకు ప్రత్యేక టెస్టులు
అయోధ్య రామమందిరం వేల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా నిర్మాణ పనులు జరిగాయి. అందుకే నిర్మాణ పనులకు ఎంపిక చేసే ప్రతీ బండరాయి జీవితకాలంపై నిపుణులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సీనియర్ శాస్త్రవేత్త యోగేంద్ర సింగ్ తెలిపారు. ప్రతి బండరాయిని ఆధునిక పరికరాలతో పరీక్షించారని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రతీ పెద్ద రాతి దిమ్మె నాణ్యతను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించారని పేర్కొన్నారు. ప్రతి దిమ్మెను నిర్మాణ పనుల్లో ఉపయోగించే ముందు, దాని బలం, మన్నికను టెస్ట్ చేశారని యోగేంద్ర సింగ్ వివరించారు. పెద్ద రాతి దిమ్మెల లోపల అంతర్గత పగుళ్లు, లోపాలు ఉన్నాయా ? లేదా ? అనేది తేలాకే, నిర్మాణ పనుల్లో వాటిని వాడారన్నారు. ఒకసారి దిమ్మెను ఇన్‌స్టాల్ చేస్తే, దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టమని ఆయన తెలిపారు.

Dharma Dhwaja Ceremony In Ayodhya
ఆయోధ్య రామమందిరం నమునాతో శాస్త్రవేత్తలు (ETV Bharat)
Dharma Dhwaja Ceremony In Ayodhya
అయోధ్య రామమందిరం నమూనా (ETV Bharat)

బండరాళ్లకు చేసిన టెస్టులివీ

  • అయోధ్య రామమందిరం పనుల్లో వినియోగించిన ప్రతీ బండరాయికి ఫ్రాక్చర్ టెస్టింగ్ చేశారు. జియో-మెడికల్ పారామితుల ఆధారంగా దాని లోపల ఏవైనా పగుళ్లు ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు.
  • బండరాళ్లకు కోర్ నమూనా పరీక్షలు చేశారు. ఇందులో ఆ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించి, అన్ కన్‌ఫైన్డ్ కాంప్రెసివ్ స్ట్రెంత్ (యూసీఎస్) పరీక్ష చేశారు. దీనివల్ల బండరాయి ఎంతటి ఒత్తిడిని తట్టుకొని నిలువగలదనే తేలుతుంది.
  • బండరాళ్లలో ఉండే అంతర్గత పగుళ్లను గుర్తించేందుకు వాటికి అల్ట్రాసోనిక్ స్పీడ్ పరీక్షలు చేశారు.
  • సోనిక్ స్పీడ్ టెస్ట్ ద్వారా ఇసుకరాళ్ల నాణ్యతను నిర్ధారించారు.
Dharma Dhwaja Ceremony In Ayodhya
అయోధ్య రామమందిరం నమూనా (ETV Bharat)

ధర్మధ్వజ వేడుకకు 100 టన్నుల పూలతో అయోధ్య ముస్తాబు
అయోధ్య రామమందిరం అందంగా ముస్తాబు అవుతోంది. మంగళవారం (నవంబరు 25న) జరగనున్న ధర్మ ధ్వజారోహణ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరిస్తున్నారు. శ్రీరాముడు, గణేశుడి విగ్రహాలను బంతి పూలతో అలంకరించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఇంకొన్ని గంటల సమయమే మిగిలినందున పెద్దసంఖ్యలో కార్మికులతో చకచకా ఏర్పాట్లు చేయిస్తున్నారు. రామ మందిరం ప్రధాన నిర్మాణ పనులన్నీ పూర్తయిన సందర్భంగా ఆలయం గర్భగుడిపై కాషాయ రంగులోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎగురవేయనున్నారు. దీనిపై ఓం, సూర్యుడు, కోవిదర చెట్టు చిహ్నాలు ఉంటాయి. 'ఓం' అనేది ఆధ్యాత్మిక ధ్వని. ‘సూర్యుడు’ రాముడి సూర్యవంశ వంశానికి సూచిక. మందార, పారిజాత మొక్కలను రిషి కశ్యపుడు సంకరం చేస్తే 'కోవిదార్ చెట్టు' పుట్టింది. మేవార్ చిత్ర రామాయణంలో అయోధ్య శ్రీరాముడి జెండా పెయింటింగ్ ఉండటాన్ని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ఆయన ధృవీకరించారు. ఇప్పుడు ఆ సమాచారం ప్రకారమే జెండాను రూపొందించి అయోధ్య రామయ్య సన్నిధిలో ఎగురవేయబోతున్నారు.

రామయ్య సన్నిధికి పోటెత్తిన భక్తులు
మంగళవారం (నవంబరు 25న) ధర్మ ధ్వజారోహణ వేడుక ఉన్నందున సాధారణ భక్తులకు అయోధ్య రామయ్య దర్శన అనుమతి లభించదు. ఈనేపథ్యంలో సోమవారం పెద్దసంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని పులకించిపోయారు. ధర్మ ధ్వజారోహణ వేడుకకు సరిగ్గా ఒకరోజు ముందు రామయ్యకు పూజలు చేసే అవకాశం దక్కడాన్ని తమ భాగ్యంగా చెప్పుకొచ్చారు. అయోధ్య రామయ్యను గర్భగుడిలో ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.5 కోట్ల మందికిపైగా ఆలయాన్ని దర్శించుకున్నారు. ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత అయోధ్యకు దేశ,విదేశాల నుంచి భక్తుల తాకిడి మరింత పెరుగుతుందనే ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం వ్యక్తం చేసింది. భక్తుల తాకిడి వల్ల యూపీలోని చాలా జిల్లాలకు చెందిన వాణిజ్య ఉత్పత్తుల గిరాకీ పెరుగుతోందని తెలిపింది. ఆధ్యాత్మిక టూరిజం అనేది రూ.కోట్లు విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తోందని పేర్కొంది.

Dharma Dhwaja Ceremony In Ayodhya
అయోధ్య రామమందిరం నమూనా (ETV Bharat)

అయోధ్య మెరిసిపోతోంది
'రామమందిరంలో ధర్మధ్వజ వేడుకకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. పూల అలంకరణలతో అయోధ్య మెరిసిపోతోంది. ఆలయాన్ని అలంకరించడానికి దాదాపు 100 టన్నుల పువ్వులు ఉపయోగిస్తున్నాం' అని అయోధ్య రామమందిర పూజారి ఒకరు తెలిపారు.

ఈ పనిలో భాగం కావడం మా అదృష్టం
అయోధ్య రామ మందిర అలంకరణ పనిలో భాగం కావడం తమ అదృష్టమని ఓ కార్మికుడు తెలిపారు. 'ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మంగళవారం రోజు ధర్మ ధ్వజ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వస్తున్నారు. సాధువులు, పండితుల సూచనల మేరకు అలంకరణ పనులు చేస్తున్నాం' అని కార్మికుడు పేర్కొన్నాడు. గత 3 రోజులుగా రాత్రి, పగలు అయోధ్య రామమందిరాన్ని ముస్తాబు చేస్తున్నామని మరో వ్యక్తి తెలిపాడు. ఇప్పుడు ఆలయం చాలా అందంగా కనిపిస్తోందని చెప్పాడు.