ముంబయిని ముంచెత్తిన కుండపోత వర్షం- రెడ్ అలర్ట్ జారీ- వరదలతో జనజీవనం అస్తవ్యస్తం
23 గంటల్లో 300 మి.మీ. వరకు వర్షపాతం- ముంబయి, రాయ్‌గఢ్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్- లోతట్టు ప్రాంతాలు జలమయం- భవనం బాల్కనీ కూలి ఆందోళన, సహాయక చర్యలు ముమ్మరం

Published : July 5, 2026 at 12:19 PM IST
IMD Issues Red Alert In Mumbai : ముంబయి మహానగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయి, రాయ్‌గఢ్ జిల్లాలకు రానున్న మూడు గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో గత 23 గంటల్లోనే 250 నుంచి 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
ఐఎండీ వివరాల ప్రకారం, శనివారం ఒక్కరోజే ముంబయిలోని పలు ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలోనూ భారీ వర్షం కురవడంతో నీటి నిల్వలు మరింత పెరిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి ముంబయిలోని బేలాపుర్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఓ భవనం బాల్కనీ కూలిపోయింది. ప్రస్తుతం ఆ భవనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, రోడ్లు కుంగిపోవడం, కొన్ని పాత ఇళ్లకు నష్టం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
#WATCH | Maharashtra: Rain lashes parts of Mumbai; visuals from Mahim pic.twitter.com/7xAxVpTMll
— ANI (@ANI) July 5, 2026
రంగంలోకి రెస్క్యూ బృందాలు
పరిస్థితి విషమించడంతో రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు. సుమారు 10 వేల మందికి పైగా సిబ్బందిని సహాయక చర్యల కోసం మోహరించినట్లు అధికారులు తెలిపారు. నగరంలో నీటి నిల్వలను తొలగించేందుకు 448 డీవాటరింగ్ పంపులు, 19 మినీ పంపింగ్ స్టేషన్లు నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించారు. ముంబయితో పాటు థానే, పాల్ఘర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. పాల్ఘర్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న 180 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Haryana: Rain lashes parts of Gurugram; visuals from the Delhi-Jaipur Expressway near Narsinghpur. pic.twitter.com/36Sh8VRpJx
— ANI (@ANI) July 5, 2026
బయటకు రావద్దని సూచన
పుణె జిల్లాలోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురిసినా రైలు సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు.
#WATCH | Maharashtra: Heavy rainfall causes Panchganga River in Kolhapur to rise above danger level. pic.twitter.com/sNwPsV3D0e
— ANI (@ANI) July 5, 2026
"వెస్ట్రన్ రైల్వే సబర్బన్ నెట్‌వర్క్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో 250 మిల్లీమీటర్లకు పైగా, మరికొన్ని చోట్ల 150 నుంచి 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అయినా లోకల్, దూరప్రాంత రైళ్ల రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదు. శనివారం రాత్రి నుంచి ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజామున సముద్రపు పోటు సమయంలో కూడా భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ వెస్ట్రన్ రైల్వే పరిధిలో రైలు సేవలను నిరంతరాయంగా కొనసాగించగలిగాం."
- వినీత్ అభిషేక్, వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
బీఎంసీ హెల్ప్‌లైన్
మరోవైపు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే బీఎంసీ హెల్ప్‌లైన్ "1916"కు సమాచారం ఇవ్వాలని సూచించింది. నగరంలో మెట్రో, బెస్ట్ బస్సు సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే సబర్బన్ లోకల్ రైళ్లు కొన్ని మార్గాల్లో స్వల్ప ఆలస్యంతో నడుస్తున్నాయని ప్రయాణికులు తెలిపారు.
ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలు
బీఎంసీ గణాంకాల ప్రకారం, 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలలో మలబార్ హిల్, మాండవి ఫైర్ స్టేషన్, కొలాబా, మెమోన్‌వాడ ఫైర్ స్టేషన్, విఖ్రోలి ఫైర్ స్టేషన్, పోవాయిలోని పాస్పోలి మున్సిపల్ స్కూల్, భండప్ కాంప్లెక్స్, అంధేరి ఫైర్ స్టేషన్, చకాలా మున్సిపల్ స్కూల్, జోగేశ్వరి, గోరేగావ్‌లోని ఆరే కాలనీ ఉన్నాయి. అలాగే శనివారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాల్లో రైలు పట్టాలు నీట మునగడం వల్ల సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేల సబర్బన్ సేవలకు కొంతకాలం అంతరాయం కలిగింది. అదే సమయంలో, సాంకేతిక లోపం కారణంగా మెట్రో లైన్ 2A సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
#WATCH | Mumbai, Maharashtra: Potholes on the Kurla–Andheri Road in the suburbs, following monsoon rains.
— ANI (@ANI) July 5, 2026
Deteriorating road conditions, water-filled potholes and pits make city streets hazardous for daily commuters. pic.twitter.com/Bj2ofEF5ak
దట్టమైన పొగమంచు అలుముకున్న దృశ్యాలు
ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. మండి జిల్లాలో బియాస్ నదిపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొండలను ఆవరించిన మేఘాలు, నదిపై కమ్ముకున్న పొగమంచుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. అయితే హిమాచల్‌లో అందమైన దృశ్యాలతో పాటు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా వర్షాలు- రుద్రప్రయాగ్‌లో హై అలర్ట్- ముంబయి అతలాకుతలం

