రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఐటీ మద్రాస్ 'డిజిటల్' అస్త్రం
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఒక వినూత్న డిజిటల్ వేదికను రూపొందించింది.

Published : January 16, 2026 at 10:51 PM IST
IIT Madras develops Integrated Road Safety : దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) ఒక సాంకేతికతను అభివృద్ధి చేసింది. 'ఇంటిగ్రేటెడ్ రోడ్ సేఫ్టీ డ్యాష్‌బోర్డ్' (Integrated Road Safety Dashboard) పేరుతో రూపొందించిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రోడ్డు భద్రతతో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలకు సహాయపడనుంది. వివిధ శాఖల డేటాను ఒకే చోట చేర్చి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడనుంది.
'ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్' అంటే ఏమిటి?
సాధారణంగా రోడ్డు భద్రత అనేది పోలీస్, రవాణా, రోడ్లు-భవనాలు, మునిసిపల్ వంటి వివిధ శాఖలతో ముడిపడి ఉంటుంది. వీటి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రభుత్వాలు చేపట్టిన ప్రమాద నివారణ చర్యలు అనేకసార్లు విఫలమవుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఐటీ మద్రాస్‌లోని ఆర్‌బీజీ ల్యాబ్స్ ఈ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసింది. ఇది వివిధ శాఖల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకే చోట చేరుస్తుంది. ఎక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి? కారణాలేంటి? అనే అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి అధికారులకు రియట్ టైమ్ డేటాను అందిస్తుంది. ఇదే సమయంలో ఏ శాఖ ఏ పని చేయాలి? చేపట్టిన చర్యల వల్ల మార్పు వచ్చిందా? అనే అంశాలను పర్యవేక్షించడం ఈజీ అవుతుంది. ఈ డ్యాష్‌బోర్డ్‌ను ఐఐటీ మద్రాస్‌లోని ఆర్‌బీజీ ల్యాబ్స్ ఈ సాంకేతికతను రూపొందించగా, ఎన్ఐసీఎస్ఐ అమలు చేసింది.
ఒడిశాలో విజయవంతంగా అమలు!
'ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్' సాంకేతికత ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో విజయవంతంగా అమలైంది. జనవరి 2026లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం ఈ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ సాంకేతికతపై రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ మాట్లాడారు. ఇది తమ అధికారులకు ఆధునిక సాంకేతికతను అందించి వాహనదారుల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
"రోడ్డు నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నా, ప్రమాదాలను అరికట్టడానికి సరైన చర్యలు తీసుకోవాలన్నా ఈ డ్యాష్‌బోర్డ్ మాకు ఒక వెన్నుముకలా పనిచేస్తుంది. ప్రమాదాల వివరాలను గణాంకాలతో సహా విశ్లేషించేందుకు మా అధికారులకు ఆధునిక సాంకేతికతను అందిస్తున్నాం. దీనివల్ల అధికారులు రోడ్డు భద్రతను మరింత మెరుగ్గా పర్యవేక్షించగలుగుతారు. ఇది చివరికి విలువైన ప్రాణాలను కాపాడడానికి, రహదారులను సురక్షితంగా మార్చడానికి తోడ్పడుతుంది." అని అమితాబ్ ఠాకూర్ పేర్కొన్నారు.
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు రోడ్డు భద్రత ప్రస్తుతం జాతీయ ప్రాధాన్యత అంశంగా మారింది. పటిష్ఠమైన రోడ్డు భద్రత వ్యవస్థ రూపకల్పనకు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ అది సవాల్ గానే మారింది. ఇలాంటి సమయంలోనే సమగ్ర డిజిటల్ వ్యవస్థలు అవసరమని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి తెలిపారు. అకడమిక్ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు ప్రజా పాలనకు నేరుగా ఉపయోగపడే ఉదాహరణగా ఈ డ్యాష్‌బోర్డ్ నిలుస్తుందని ఆయన అన్నారు.
"రోడ్డు భద్రత అనేది ఒక సంక్లిష్టమైన సామాజిక సవాల్. దీనిని పరిష్కరించాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం, సంస్థాగత జవాబుదారీతనం, సమాచారాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. విద్యాపరమైన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు పరిపాలనకు ఏ విధంగా నేరుగా అండగా నిలవగలవో చెప్పడానికి ఈ డ్యాష్‌బోర్డ్ ఒక చక్కని ఉదాహరణ. పక్కా ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఈ ప్లాట్‌ఫారమ్ తోడ్పడుతుంది. తద్వార దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోడ్డు భద్రతా నిర్వహణను గణనీయంగా బలోపేతం అవుతుంది" అని ప్రొఫెసర్ వి. కామకోటి తెలిపారు.
ప్రొఫెసర్ వెంకటేష్ నాయకత్వంలో
ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఆర్‌బీజీ ల్యాబ్స్ హెడ్ ప్రొఫెసర్ వెంకటేశ్ బాలసుబ్రమణియన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ డ్యాష్‌బోర్డ్ కేవలం ఒక సాంకేతిక వేదిక మాత్రమే కాదని, ఇది ఒక పరిపాలనా సంస్కరణ సాధనమన్నారు. సాంకేతికత నేరుగా ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడటమే ఈ గవర్నెన్స్‌కు నిజమైన అర్థమన్నారు.
ఒడిశా భీమ మండలి గుహలు- 15 వేల ఏళ్లనాటి ఆదిమానవుల ఆనవాళ్లు!
16 ఏళ్లకే పెళ్లి- ఆపై భర్తతో విడాకులు- కట్ చేస్తే తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డ్

