ETV Bharat / bharat

'నేను ఎప్పుడూ పార్టీ లైన్​ దాటలేదు'- కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​

నేను పార్టీ విధానానికి ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించలేదు- ఇకపై రాష్ట్ర రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటా- శశిథరూర్​ వెల్లడి

Shashi Tharoor
Shashi Tharoor (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 7:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Shashi Tharoor Party Line Stance : కాంగ్రెస్ పార్టీ విధానానికి తాను ఎన్నడూ విరుద్ధంగా ప్రవర్తించలేదని, ఎప్పుడూ పార్టీ లైన్​ను దాటలేదని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్​ అన్నారు. ఇటీవలి కాలంలో ఆయన పదే పదే ప్రధాని మోదీని పొగిడారు. పైగా తాను రాసిన ఓ వ్యాసంలోని విషయాలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడంతో శశిథరూర్​ సోమవారం ఈ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండడం గమనార్హం.

రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన కోసం సుల్తాన్ బతేరీలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) 'లక్ష్య 2026' పేరులో లీడర్​షిప్​ క్యాంప్​ను ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన శశిథరూర్​ విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"నేను పార్టీ లైన్ దాటానని ఎవరు చెప్పారు? వివిధ అంశాలపై నేను నా అభిప్రాయాలను వ్యక్తం చేశాను. అయినప్పటికీ, చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ, నేను ఒకే మాటపై నిలబడ్డాం."
- శశిథరూర్​, ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు

అందువల్ల వివాదాలు!
మీడియాలో వచ్చే కథనాల విషయానికి వస్తే, కేవలం హెడ్​లైన్స్​ను మాత్రమే చూసి, పూర్తి సారాంశాన్ని చదవకపోవడం వల్లనే తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని శశిథరూర్​ అన్నారు. "నేను రాసిన దాన్ని ప్రజలు నిజంగా చదివారా అని అడిగితే, ఎక్కువ మంది చదవలేదని తేలింది. అందువల్ల పూర్తి కథనాన్ని చదివిన తర్వాతే, అసలు విషయం వారికి అర్థం అవుతుంది" అని ఆయన అన్నారు. 'గత 17 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సహచరులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు హఠాత్తుగా అపార్థాలు చేసుకోవాల్సిన అవసరం లేదు' అని ఆయన పేర్కొన్నారు.

సమస్య అప్పుడే మొదలైందా?
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయా? అనే ప్రశ్నకు శశిథరూర్ తనదైన రీతిలో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య సంప్రదాయాలను అనుసరిస్తుందని, గతంలోనూ చాలా మంది నేతలు అంతర్గత ఎన్నికల్లో పోటీ చేశారని ఆయన గుర్తు చేశారు. "నేను పోటీ చేసి ఓడిపోయాను. అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది. అందులో ప్రత్యేక అంటూ ఏమీ లేదు. పార్టీ చరిత్రలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. చాలా మంది గెలిచారు. మరెందరో ఓడారు" అని అన్నారు.

మోదీని అందుకే పొగిడా!
బీజేపీ సీనియర్ నేత ఎల్​కే అడ్వాణీని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలపైనా శశిథరూర్​ మాట్లాడారు. 'అడ్వాణీ 98వ పుట్టిన రోజు సందర్భంగా కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే నేను అలా చేశాను. పెద్దలను గౌరవించడం మన సంస్కృతి. నేను అదే చేశాను' అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన విషయాన్ని విలేకరులు అడగగా, 'ఒక బహిరంగ కార్యక్రమంలో చెప్పిన మాటలనే నేను ఊటంకించాను. అంతేకానీ నేను మోదీని ఎక్కడ ప్రశంసించానో చూపండి. పూర్తి పోస్టును చదివితే అటువంటిది ఏదీ లేదని మీకు స్పష్టమవుతుంది' శశిథరూర్ వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ గెలుస్తుంది!
ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై తాము పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతామని శశిథరూర్ అన్నారు. రాష్ట్ర నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలు- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు, కొందరు పార్లమెంటేరియన్లు ఆసక్తు చూపిస్తున్నారని, అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ కేరళలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకు ఉందని శశిథరూర్​ అన్నారు. కాంగ్రెస్​ 100 స్థానాలను గెలుచుకుంటుందన్న అంచనాలు సాధ్యమేనని అన్నారు. కాంగ్రెస్​లో ముఖ్యమంత్రి పీఠానికి అర్హులైన వాళ్లు చాలా మందే ఉన్నారని, కానీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తరువాతే తుది నిర్ణయం జరుగుతుందని స్పష్టం చేశారు. తనకు పార్లమెంటరీ బాధ్యతలు ఉన్నప్పటికీ కేరళ రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని పేర్కొన్నారు. 2021 కొవిడ్​ సమయంలోనూ 56 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రచారం చేశానని, ఈసారి అంత కంటే ఎక్కువగా ప్రచారం చేస్తానని తెలిపారు.

'వికసిత్ భారత్​లో రేప్ కేసు నిందితులకు బెయిల్- ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినవారికి కాదు'- ప్రియాంక ఖర్గే ఫైర్

'ట్రంప్​ను మోదీ ఆలింగనం చేసుకున్నా ఏ మేలు జరగలేదు'- కేంద్రంపై కాంగ్రెస్​ ఫైర్​