తమిళనాడులో 'హంగ్'- విజయ్ వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?
హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేకు 108 సీట్లు- మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలో- స్వతంత్రులు, చిన్న పార్టీలతో కలిసి సర్కారు?- చర్చల కోసం రంగంలోకి టీవీకే ముఖ్య నేతలు

Published : May 4, 2026 at 10:36 PM IST
TVK Vijay Options on Hung Govt : తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేల ద్విధృవ రాజకీయాలకు తొలిసారిగా బ్రేక్ పడింది. హీరో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రూపంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయం బలంగా ఆవిర్భవించింది. ఈ పార్టీ మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్‌గా 108 సీట్లను కైవసం చేసుకొని ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతిస్వల్ప దూరంలో నిలిచింది. ఈ తరుణంలో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని స్పష్టమవుతోంది. ఇందుకోసం టీవీకే అధినేత విజయ్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? పొత్తుల కోసం ఆయన ఎదుట ఉన్న ఆప్షన్లు ఏమిటి? విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఏ పార్టీలు చొరవ చూపే ఛాన్స్ ఉంది? తమిళనాడులో హంగ్ సర్కారుల చరిత్రేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
తమిళనాడులో హంగ్ : ఇది ఎన్నోసారి?
గత 60 ఏళ్లుగా(1967 నుంచి) తమిళనాడులో డీఎంకే లేదా అన్నా డీఎంకే పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. మరో పార్టీకి ఈ అవకాశం లభించనే లేదు. చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే పరిశీలిస్తే 2016లో అన్నా డీఎంకే, 2021లో డీఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈసారి డీఎంకే, అన్నా డీఎంకేలకు షాకిచ్చేలా హీరో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ విజయ దుందుభి మోగించింది. 100కుపైగా సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118ని సాధించేందుకు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరం. ఈవిధంగా తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుండటం ఇది తొలిసారేం కాదు. కానీ ఒక కొత్త రాజకీయ పార్టీ తొలి ప్రయత్నంలోనే హంగ్ సర్కారు ఏర్పాటు చేసేదాకా వెళ్లడం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి. 1952లో మద్రాస్ స్టేట్ (తమిళనాడు) మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ఇతర పార్టీల మద్దతుతో రాజాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2006లో ఎం. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే 96 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం డీఎంకేకు బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ ఐదేళ్ల పాటు రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం నడిచింది. ఈసారి కూడా హీరో విజయ్ ఇదే రీతిలో హంగ్ సర్కారును ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆయనకు మద్దతివ్వనున్న పార్టీ ఏది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
విజయ్ చూపు వారిపైనే
ఇప్పుడు టీవీకేకు కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే చాలు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇందుకోసం టీవీకే అధినేత విజయ్ స్వతంత్రంగా గెల్చిన అభ్యర్థులు, చిన్న పార్టీలు, డీఎంకే కూటమిలోని అసంతృప్త పార్టీల మద్దతు కోసం చర్చలను మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ చర్చల కోసం కొందరు పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల గెలవగా, 6 చోట్ల లీడ్‌లో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు 4 చోట్ల లీడ్‌లో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు విజయ్ పార్టీ రెబల్స్ లేదా చిన్న స్థానిక గ్రూపులకు చెందిన వారు. వీసీకే (తిరుమావళవన్) పార్టీ 1 చోట గెలవగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. సీపీఐ, సీపీఎంలు చెరొక చోట గెలవగా, చెరో 2 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్షాలు, వీసీకే (తిరుమావళవన్) పార్టీతో విజయ్ చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలోని విపక్ష ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న డీఎంకేను కాదని, టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సాహసించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉంది. డీఎంకేను అధికారానికి దూరంగా ఉంచేందుకు విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకూ అన్నాడీఎంకే సిద్ధపడొచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
విజయ్ అత్యవసర సమావేశం - అజెండా ఏమిటి?
ఈ ప్రతికూల పరిస్థితుల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా మిత్రపక్షాలను కాపాడుకోవడానికి యత్నించే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు, చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ అండ్ టీమ్ కసరత్తు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేనందున, ఎమ్మెల్యేలతో క్యాంప్ పాలిటిక్స్ జరిగే ముప్పు ఉందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. సోమవారం సాయంత్రం చెన్నైలోని పనైయూర్‌లో ఉన్న తన కార్యాలయంలో టీవీకే ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. టీవీకేకు చెందిన గెలిచిన అభ్యర్థులు, ముందంజలో ఉన్న అభ్యర్థులందరూ వెంటనే పనైయూర్ కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఆదేశించారు. ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, గెలిచిన వారిని ఒక సురక్షిత రిసార్ట్‌కు తరలించే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ చివరి రౌండ్లలో ఎలాంటి అక్రమాలు జరగకుండా టీవీకే పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విజయ్ నివాసం, పనైయూర్ కార్యాలయం వద్దకు అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో పోలీసులు ముమ్మర భద్రతను ఏర్పాటు చేశారు.
బీజేపీకి విజయాన్ని అందించి- ప్రజలు భారత రాజ్యాంగాన్ని గెలిపించారు: ప్రధాని మోదీ
బంగాల్లో రికార్డు స్థాయి పోలింగే టీఎంసీ కొంప ముంచిందా? మమత ఓటమికి కారణాలు ఇవేనా?

