ETV Bharat / bharat

పనిమనిషి టు ఎమ్మెల్యే- బంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ సంచలనం- 12వేలకుపైగా ఓట్ల తేడాతో విక్టరీ

బంగాల్ అసెంబ్లీ పోరులో ప్రభంజనం సృష్టించిన పని మనిషి- ఔస్‌గ్రామ్ నియోజకవర్గంలో జయకేతనం- టీఎంసీ అభ్యర్థిని మట్టికరిపించిన కలితా మాఝీ

BJP MLA Kalita Majhi Success Story
BJP MLA Kalita Majhi Success Story (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2026 at 12:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

BJP MLA Kalita Majhi Success Story : బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టింది. 15 సంవత్సరాల తృణమూల్ పాలనకు చరమగీతం పాడింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అనేక సంచనాలు నమోదు అయ్యాయి. అందులో బీజేపీ నాయకురాలు కలితా మాఝీ విజయం ఒకటి. ఎందుకంటే ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ నెలలో కొద్దిగా వచ్చే జీతంతో జీవనం సాగిస్తున్న కలితా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థిపై ఏకంగా 12వేలకుపైగా ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో కలితా మాఝీ ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లేంటి? ఆమెకు మొదటిసారే విజయం వరించిందా? తదితర విషయాలు తెలుసుకుందాం.

రెండోసారి దక్కిన విజయం
బంగాల్‌లోని ఔస్‌గ్రామ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కలితా మాఝీ బరిలో దిగారు. ఆమెకు 1,07,692 ఓట్లు పడ్డాయి. తన ప్రత్యర్థి, టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్‌కు 95157 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో శ్యామా ప్రసన్నపై 12,535 ఓట్ల తేడాతో కలిత గెలుపొందారు. 2021లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిత పోటీ చేశారు. అయితే టీఎంసీ అభ్యర్థిపై 11వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కలితపై నమ్మకంతో ఔస్‌గ్రామ్ నుంచి మరోసారి ఆమెను బీజేపీ బరిలోకి దింపింది. ఈసారి మాత్రం కలితా మాఘీ సత్తా చాటి ఘనవిజయం సాధించారు.

నెలకు రూ.2500 జీతం
పూర్వ బర్ధమాన్ జిల్లాలోని గుస్కారా మున్సిపాలిటీకి చెందిన కలితా మాఝీకి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదా వారసత్వం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె వద్ద తగినన్నీ ఆర్థిక వనరులు కూడా లేవు. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు కలిత నాలుగు ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించేవారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకునేవారు. అటువంటి కలితా మాఝీకి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. కలిత సాధారణ జీవిత నేపథ్యం, స్థానికంగా ఉన్న బలమైన సంబంధాల కారణంగా ఎన్నికల ప్రచార సమయంలో ఆమె అభ్యర్థిత్వం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో స్థానిక ప్రజల మద్దతుతో భారీ విజయాన్ని నమోదు చేశారు.

అంత ఈజీగా గెలుపు రాలేదు
అయితే కలితా మాఝీకి ఈ విజయం అంత సునాయాశంగా రాలేదు. ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను స్వయంగా కలిసేందుకు ఇంటింటికీ తిరిగారు. కఠోరంగా శ్రమించారు. నేరుగా ఓటర్లతో మమేకయ్యారు. ఈ శ్రమ ఫలించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం గానీ, ఆర్థిక అండ గానీ లేని కలితా మాఝీ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. కాగా, కలిత గత దశాబ్ద కాలం నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఔస్‌గ్రామ్ నియోజకవర్గంలో కలితా మాఝీ సాధించిన విజయం ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఓటుకున్న శక్తిని నిస్సందేహంగా నిరూపించింది. కలిత గెలుపు అనేది ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఆర్థికంగా బలంగా లేకపోయినా ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కొచ్చనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సవాళ్లను అధిగమించి ముందుకు సాగితే కచ్చితంగా విజయం వరిస్తుందని కలితా మాఝీ నిరూపించారు.

అలాంటి వారికి ఏకైక వేదిక బీజేపీ : ఎంపీ పీసీ మోహన్
కలితా మాఝీ ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంపై బీజేపీ ఎంపీ పీసీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం బీజేపీ బలాన్ని చాటి చెబుతోందన్నారు. సామాన్య వ్యక్తి కూడా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోగలిగే ఏకైన వేదిక భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. కలితా మాఝీది ఒక స్ఫూర్తిదాయకమైన కథని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన కలితా మాఝీకి అభినందనలు తెలియజేశారు.

CCTV లు ఆపేసింది- వందకు పైగా సీట్లను BJP లూటీ చేసింది : ఎన్నికల్లో ఓటమి వేళ మమత ఆరోపణలు

బంగాల్​లో బీజేపీ భారీ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే!