హోలీ కోసం నేచురల్ కలర్స్ తయారుచేస్తున్న మహిళలు- వారి హెర్బల్ గులాల్‌కు ఫుల్ డిమాండ్
మరికొద్ది రోజుల్లో హోలీ- సహజసిద్ధంగా హోలీ కలర్స్ తయారుచేస్తున్న ఛత్తీస్‌గఢ్, బిహార్‌కు చెందిన మహిళలు- వీటితో హెల్త్‌కి నో రిస్క్!

Published : March 1, 2026 at 8:43 PM IST
Natural Holi Colours Making : పిల్లలు నుంచి పెద్దల వరకు వయసులో సంబంధం లేకుండా చేసుకునే పర్వదినం హోలీ. అయితే ఈ పండగనాడు ఉపయోగించే రంగులతోనే అసలు సమస్య వస్తోంది. ఎందుకంటే వాటిలో కలిపే రసాయనాలు మన చర్మానికి హాని చేస్తాయి. అందుకే చర్మానికి ఎటువంటి హాని కలిగించని హెర్బల్ గులాల్ ( హోలీ రంగులు)ను తయారుచేస్తున్నారు బిహార్, ఛత్తీస్‌గఢ్ చెందిన మహిళలు. ఈ రంగుల తయారీకి ఎటువంటి రసాయనాలు వాడడం లేదు. పువ్వులు, ఆకుకూరలను ఉపయోగించి స్వచ్ఛమైన, పర్యావరణహితమైన హోలీ రంగులను తయారుచేస్తున్నారు.
సహజసిద్ధమైన రంగుల తయారీ
ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని మా దంతేశ్వరి స్వయం సహాయక బృందంలోని మహిళలు పూర్తిగా సహజసిద్ధమైన హోలీ రంగుల (హెర్బల్ గులాల్) తయారీలో దూసుకెళ్తున్నారు. బస్తర్ జిల్లా అధికారులు, లైఫ్ సైన్స్ సెంటర్ చొరవతో ఈ మహిళలు పాలకూర, కొత్తిమీర, బంతి పువ్వులు, టెసు పువ్వులతో హెర్బల్ గులాల్‌ను తయారు చేయడం నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు.

ఫుల్‌గా ఆర్డర్లు
ఈ మహిళలు తయారుచేసిన మూలికా గులాల్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. పూర్తిగా సేంద్రీయ పద్ధతులను ఉపయోగించి తయారవ్వడంతో పర్యావరణ అనుకూలమైనది కూడా. అందుకే ఈ హెర్బల్ గులాల్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఈ మహిళలు ఇప్పటికే దాదాపు 200 కిలోగ్రాముల మూలికా గులాల్‌ను విక్రయించేశారు. వీరికి ఇతర జిల్లాల నుంచి మూలికా గులాల్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి.
వీటితో రంగులు తయారీ
పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరల నుంచి ఆకుపచ్చ రంగు, ఎరుపు పాలకూర, బీట్‌రూట్ నుంచి రెడ్ కలర్, బంతి పువ్వులు నుంచి పసుపు రంగు, టెసు పువ్వుల నుంచి కుంకుమ రంగును తయారుచేస్తున్నారు. ఈ ఆకుకూరలు, పువ్వులను మొదట ఎండబెడతారు. తర్వాత వాటిని మొత్తగా గ్రైండ్ చేస్తారు. ఈ ప్రక్రియ రసాయన రహితంగా జరుగుతుంది. దీంతో సహజసిద్ధమైన ఈ రంగులను పూసుకున్నా చర్మానికి ఎటువంటి హాని కలగదు.

ప్రజలకు విజ్ఞప్తి
త్వరలో రాబోయే హోలీలో మూలికా గులాల్‌ను ఉపయోగించమని స్వయం సహాయక బృందంలోని మహిళలు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్లో దొరికే హోలీ రంగుల్లో రసాయనాలు కలపడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే ఆ రంగులు కళ్లలో పడితే ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.
ప్రకృతి దీదీలుగా మారిన బీడీ కార్మికులు
అలాగే బిహార్ జముయీ జిల్లా మటియా గ్రామానికి చెందిన మహిళలు ఆకుకూరలు, పువ్వులు, ఔషధ మొక్కలను ఉపయోగించి హోలీ రంగులను (హెర్బల్ గులాల్) తయారు చేస్తున్నారు. అందుకే మటియా గ్రామాన్ని 'ప్రకృతి గ్రామం' అని పిలుస్తారు. ఒకప్పుడు బీడీ కార్మికులుగా పనిచేసిన ఈ మహిళలు, ఇప్పుడు హోలీ రంగుల తయారీలో అదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగానూ మెరుగయ్యారు.
గ్రామానికి చెందిన 10-15 మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి గత మూడేళ్లుగా హోలీ రంగులను తయారు చేస్తున్నారు. మొదటి ఏడాది 6 క్వింటాళ్ల రంగులను ఉత్పత్తి చేశారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 50 క్వింటాళ్ల సహజ రంగులను తయారు చేయడానికి ఆర్డర్‌ను అందుకున్నారు. ఈ హెర్బల్ గులాల్ తయారీ ద్వారా మహిళలు నెలకు రూ.6,000 రూపాయలు సంపాదిస్తున్నారు. గతంలో బీడీలు చుడితే రోజుకు రూ.50-రూ.100 మాత్రమే సంపాదించగలిగేవారు.
ఈ మహిళలు గతంలో తమ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందారని నేచర్ విలేజ్ వ్యవస్థాపకుడు, లక్ష్మీపుర్ మాజీ బీడీఓ నిర్భయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ మహిళలలో కొంత మందిని శిక్షణ కోసం విదేశాలకు పంపామని పేర్కొన్నారు. "ఒకప్పుడు అవిశ్రాంతంగా బీడీలు తయారు చేసి రోజుకు రూ.50 కూడా సంపాదించలేని మహిళలు ఇప్పుడు ప్రకృతి దీదీ అనే కొత్త పేరును తెచ్చుకున్నారు. హోలీ రంగుల తయారీ వారి ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచింది. పొరుగు జిల్లాల నుంచి కూడా వారికి ఆర్డర్లు వస్తున్నాయి. త్వరలో నేచర్ దీదీ ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి." అని నిర్భయ్ ప్రతాప్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

