పాలకూర, హెన్నా, బియ్యం పిండితో నేచురల్ కలర్స్- ఇంట్లోనే రంగుల తయారీ- 'ఒడిశా గ్రీన్ క్వీన్'స్టోరీ!
రసాయన రంగుల వల్ల చర్మ సమస్యలు, అలెర్జీలు, పర్యావరణ కాలుష్యం వంటివి తలెత్తుతున్న నేపథ్యంలో- 2019లో ఈకోదర్శిని బ్రాండ్ ప్రారంభించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ప్రియదర్శిని

Published : March 3, 2026 at 10:10 PM IST
Holi Natural Colours : హోలీ పండుగ సందర్భంగా భువనేశ్వర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహిళలు పర్యావరణ అనుకూలమైన సహజ రంగులతో హోలీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయన రంగుల వల్ల చర్మ సమస్యలు, అలెర్జీలు, పర్యావరణ కాలుష్యం వంటివి తలెత్తుతున్న నేపథ్యంలో, సహజ రంగులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సహజ రంగుల ధర ఎక్కువగా ఉండటంతో, అపార్ట్‌మెంట్ మహిళలు స్వయంగా ఇంట్లోనే రంగులు తయారు చేసుకుంటున్నారు. ఒడిశా గ్రీన్ క్వీన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రియదర్శిని దాస్ ప్రేరణతో ఈ కార్యక్రమం జరుగుతోంది.
వారం ముందు నుంచే : ప్రియదర్శిని దాస్ నేతృత్వంలో హోలీకి ఒక వారం ముందు నుంచే రంగుల తయారీ ప్రారంభమవుతుంది. బీట్‌రూట్‌ను ఉడకబెట్టి ఎరుపు రంగు, పాలకూర, హెన్నా ఆకులతో ఆకుపచ్చ రంగు, గులాబీ పువ్వులతో గులాబీ రంగు తదితర రంగులను సులభంగా తయారు చేస్తున్నారు. మామిడి ఆకులు, వేపాకులు, అరటి పండు, గెండు పువ్వులు, అపరాజిత పువ్వులు, అన్నాటో గింజలు, దానిమ్మ గింజలు సేకరించి, ఎండబెట్టి చూర్ణం చేసి రంగులుగా మారుస్తున్నారు. బియ్యం పిండి, బంకమట్టి వంటివి కూడా ఉపయోగిస్తున్నారు. ఆలయాలు, ఇంట్లో చేసే పూజల నుంచి వచ్చే పువ్వులతో సహజ రంగులు తయారు చేస్తున్నారు.
2019లో ఈకోదర్శిని బ్రాండ్ : ఈ సహజ రంగులు చర్మానికి హాని చేయకపోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ప్రియదర్శిని దాస్ తెలిపారు. 50 ఏళ్ల ప్రియదర్శిని కటక్‌కు చెందిన వారు. ఆమె గతంలో దిల్లీ, గుజరాత్‌లో నివసించారు. ఒడిశా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భువనేశ్వర్‌లో నివసిస్తున్నారు. ప్రియదర్శిని భర్త ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈమె 25 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. 2019లో ఈకోదర్శిని బ్రాండ్ ప్రారంభించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు.
అందరూ కలిసి తయారు చేసిన సహజ రంగులతో హోలీ ఆడటం వల్ల ఆనందకరమైన వాతావరణం నెలకొంటుందని ఆమె అన్నారు. పండగ సందర్భంగా అపార్ట్‌మెంట్ సభ్యులందరూ కలిసి సహజ రంగులతో హోలీ ఆడి, పర్యావరణ రక్షణకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యం, పర్యావరణం రెండింటినీ కాపాడుకోవచ్చని నిపుణులు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ చొరవ ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తోంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి : హోలీ పండుగ ఆనందంగా సాగాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కృత్రిమ రంగుల జోలికి అస్సలు వెళ్లకూడదు. వీటివల్ల కళ్లు, జుట్టు, చర్మం దెబ్బ తినొచ్చు. కాబట్టి పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన రంగుల్నే ఎంచుకోవాలి. ఓపిక ఉంటే బీట్‌రూట్, వేప, పసుపు, గులాబీ పూల లాంటివాటితో ఇంట్లోనే తయారుచేసుకోండి. ఆడే ముందు ఒంటికి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి లేదా ఆలివ్ నూనె రాసుకోవాలి. ముఖ్యంగా గోళ్లు, చెవుల దగ్గర బాగా రాయాలి. జుట్టుకు కూడా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది రక్షణ పొరలా పనిచేయడమే కాదు, రంగులు త్వరగా పోవడానికీ ఉపయోగపడుతుంది.
ఎండలో ఆడటం వల్ల ముఖం నల్లబడకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా ఫుల్‌హ్యాండ్ డ్రెస్సులు ధరించాలి. అనుకోకుండా కళ్లలో రంగులు పడినా టిష్యూలాంటి వాటితో తుడవకుండా దోసిట్లో నీటిని తీసుకుని అందులో ముఖం పెట్టి కళ్లను నెమ్మదిగా తెరవాలి. రంగులు ఆడుతూ అదే చేతితో ఎలాంటి ఆహారం తినకూడదు. మేడలపైనా, అపార్టుమెంట్ల మీదా హోలీ ఆడకూడదు, సందడిలో ప్రమాదాలు జరగొచ్చు. హోలీ ఆడాక గోరువెచ్చని నీటితో రంగుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. స్నానం తర్వాత కూడా ఒంటికి మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాలి.
హోలీ రోజు 'రామ్‌లీలా' ప్రదర్శన- 120ఏళ్లుగా ఇదే సంప్రదాయం- ఈ నాటకానికి పాకిస్థాన్‌తో కనెక్షన్!
మౌనమే భారత ప్రతిష్ఠను తగ్గిస్తోంది- ఖమేనీ మృతిపై మోదీ మాట్లాడాలి : రాహుల్ గాంధీ

