ముగిసిన జంతర్ మంతర్ శకం- చారిత్రక పోరాటాలకు సజీవ సాక్ష్యం
1993 జైల్ భరో కార్యక్రమం నుంచి 2026 నీట్ పేపర్ లీకేజీ వివాదాల వరకు ఎన్నో కీలక ప్రజా ఉద్యమాలకు జంతర్ మంతర్ వేదికైంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ప్రస్థానం ముగిసిపోయింది.

Published : October 12, 2026 at 7:31 PM IST
Jantar Mantar Protest History : ఒకప్పుడు ఆకాశంలోని గ్రహాల గమనాన్ని, కాలాన్ని లెక్కించడానికి కట్టిన చరిత్రాత్మక కట్టడం అది. కానీ కాలక్రమేణా ప్రజల బాధలు, సమస్యలను పాలకులకు వినిపించే శక్తిమంతమైన నిరసనల వేదికగా మారిపోయింది. అదే దేశ రాజధానిలోని జంతర్ మంతర్. ప్రభుత్వంపై తమకున్న అసంతృప్తిని లేదా డిమాండ్లను దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనుకునే కోట్లాది మంది ప్రజల ఆశల చిరునామా ఇది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిన ఎన్నో చరిత్రాత్మక నిరసనలకు ఈ ప్రాంగణమే సజీవ సాక్ష్యంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఒక విప్లవమే సృష్టించిన అన్నా హజారే నిరాహార దీక్షల నుంచి దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంపై యావత్ భారతావని గర్జించిన ఆందోళనల వరకు- ఇటీవల నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో విద్యార్థుల ఉద్యమాల వరకు ఎన్నో ప్రజా నిరసనలను, ప్రజాస్వామ్య గొంతుకలను ఈ వేదిక దగ్గరుండి చూసింది. అలా ఏళ్లుగా ప్రజాస్వామ్య పోరాటాలు, చారిత్రక ఉద్యమాలు, సామాన్యుల గొంతుకకు కేంద్రంగా నిలిచిన ప్రముఖ నిరసన వేదిక జంతర్ మంతర్ శకం ముగిసిపోయింది. దిల్లీలో శాంతియుత నిరసనల స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తూ, జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశం హోదా నుంచి పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
అసలు జంతర్ మంతర్ నిరసన వేదికగా ఎలా మారింది?
స్వాతంత్య్రానంతరం దశాబ్దాల పాటు దిల్లీలో రాజకీయ ర్యాలీలు, నిరసనలకు ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్' లాన్‌లే ప్రధాన వేదికలుగా ఉండేవి. పార్లమెంట్ భవనం, ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాలకు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడ అప్పట్లో ఆందోళనలు ఉద్ధృతంగా జరిగేవి. అయితే 1988లో రైతు నేత మహేంద్ర సింగ్ టికాయత్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరిగిన రైతు ఆందోళనలతో దిల్లీ నడిబొడ్డున ట్రాఫిక్ నిలిచిపోవడం, భద్రతా సమస్యలు తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 1990ల ప్రారంభంలో రాజ్‌పథ్ (నేటి కర్తవ్యపథ్) పరిసరాల్లో నిరసనల కోసం వేసిన టెంట్లను ప్రభుత్వం తొలగించింది. ఇక్కడ కూడా నిరసనలు పూర్తిగా నిషేధించారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కున్న ఆందోళనకారులు క్రమంగా కన్నాట్ ప్లేస్ సమీపంలోని జంతర్ మంతర్ ప్రాంతంవైపు మళ్లారు. అప్పటినుంచి అంటే 1993 నాటికి ఇదే దేశ రాజధానిలో ప్రధాన నిరసన కేంద్రంగా అవతరించింది.
ఎన్నో చారిత్రక పోరాటాలకు వేదికైన జంతర్ మంతర్
జంతర్ మంతర్ ప్రదేశానికి సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. 18వ శతాబ్దంలో ఖగోళ వస్తువులను, వింతలను, గ్రహాలు, కాల గమనాన్ని పరిశీలించడం కోసం మహారాజా సవాయ్ జైసింగ్ II నిర్మించిన ఈ ఎత్తైన రాతి కట్టడాల ప్రదేశమే జంతర్ మంతర్. ఈ చారిత్రక ప్రదేశం కాలక్రమేణా పాలకులపై ప్రజలకున్న వ్యతిరేకతను వ్యక్తపరిచే వేదికగా మారింది. ఇక్కడే ఎన్నో చారిత్రక ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. అవినీతి నుంచి మహిళల భద్రత వరకు, రైతుల సమస్యల నుంచి పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణల వరకు ఎన్నో అంశాలపై ప్రజలు ఇక్కడే గళమెత్తారు. ఇక్కడికి వచ్చిన జనసమూహాలే కాకుండా, వారు లేవనెత్తిన సమస్యలు, అధికారులను జవాబుదారీగా నిలబెట్టాలన్న డిమాండ్లు కూడా ఈ ప్రదేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక జంతర్ మంతర్ వేదికగా నిర్వహించిన వాటిల్లో ప్రజల దృష్టిని ఆకర్షించిన, చర్చనీయాంశంగా మారిన నిరసనలు, ఆందోళనలు, దీక్షల గురించి ఇప్పుడు చూద్దాం.
- 1993 జైల్ భరో ఆందోళన- జంతర్ మంతర్ వద్ద జరిగిన ముఖ్యమైన మొట్టమొదటి నిరసనల్లో 1993లో నిర్వహించిన ఈ జైల్ భరో కార్యక్రమం ఒకటి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, మతతత్వానికి వ్యతిరేకంగా 33 సంస్థలు కలిసి సుమారు 25 వేల మందితో ఇక్కడ భారీ ఆందోళన నిర్వహించాయి. పార్లమెంటులోనూ దీని గురించి చర్చ జరిగింది.
- 2011 అన్నా హజారే ఉద్యమం- ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే 2011లో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జంతర్ మంతర్ పేరు మరింత మార్మోగిపోయింది. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఆయన చేపట్టిన 5 రోజుల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉద్యమమే జంతర్ మంతర్‌ను తర్వాతి రోజుల్లో జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నిరసనలకు కేరాఫ్‌గా మార్చింది.
- 2012 నిర్భయ ఘటన- 2012లో దిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దేశాన్ని కుదిపేసిన ఈ నిర్భయ ఘటనపై న్యాయం కోరుతూ వేలాదిగా యువతీయువకులు ఇక్కడే రోడ్డెక్కి తమ గళం వినిపించారు.
- 2015 OROP ఆందోళన- మాజీ సైనికాధికారులు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇక్కడ నెలల తరబడి దీక్షలు చేపట్టారు.
- 2017 తమిళనాడు రైతుల నిరసన- కరువు కారణంగా పంట నష్టాలకు సహాయం, రుణ మాఫీ కోసం తమిళనాడు రైతులు పుర్రెలు పట్టుకొని దాదాపు 41 రోజుల పాటు జంతర్ మంతర్ కేంద్రంగా చేసిన వినూత్న నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
- 2019 CAA వ్యతిరేక ఆందోళనలు- పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2019 డిసెంబరులో ఇక్కడ వామపక్షాలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
- 2021 రైతు కిసాన్ సంసద్- రైతు ఉద్యమ చరిత్రలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్) ఒక వినూత్న ఘట్టంగా నిలిచింది. 2021 జులై 22 నుంచి ఆగస్ట్ 9 వరకు రోజుకు 200 మంది రైతులతో ఇక్కడ శాంతియుత నిరసనలు చేపట్టేందుకు కోర్టు, పోలీసుల అనుమతి లభించింది.
- 2023 రెజ్లర్ల ఆందోళన- ప్రముఖ రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలు సహా పలువురు క్రీడాకారులు లైంగిక వేధింపుల ఆరోపణలపై నాటి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఇక్కడే కూర్చొని నిరసన తెలిపారు.
- 2026 నీట్- రాజకీయ ఆందోళనలు- నీట్ పేపర్ లీక్ ఆరోపణలతో ప్రధాన ప్రతిపక్షాలు సహా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలతో జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగిపోయింది.
జంతర్ మంతర్‌ను ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది?
గతంలోనే శబ్ద కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు, స్థానికులకు ఇబ్బందుల కారణంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) 2017లో ఇక్కడ నిరసనలను నిషేధించింది. దీనిపై సుప్రీంకోర్టు 2018లో చారిత్రక తీర్పునిస్తూ- శాంతియుతంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే అయినప్పటికీ, ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు సముచితంగా ఉండేలా ఆంక్షలు విధించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇటీవల అక్టోబర్ 10-11 తేదీల్లో జరిగిన ఉద్రిక్త ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకు దిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 12 నుంచి జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశం హోదా నుంచి పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలో నిరసనలకు ప్రత్యామ్నాయ స్థలం చూడాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యామ్నాయ వేదికలు ఇవే
అయితే ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు, నిరసన తెలిపే ప్రాథమిక హక్కుకు భంగం కలగకుండా ప్రభుత్వం మరో 3 కొత్త ప్రదేశాలను అధికారిక నిరసన వేదికలుగా ఖరారు చేసింది. వీటిల్లో రామ్‌లీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్- ఈస్ట్ దిల్లీ వంటివి ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా సామాన్యుల గొంతుకగా మారిన జంతర్ మంతర్- ఇప్పుడు నిరసన ప్రదేశంగా దాని అధికారిక హోదా కోల్పోవడంతో, ప్రజలు తమ గొంతును వినిపించేందుకు ఉన్న వేదికల భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

