ETV Bharat / bharat

భారత్​లోకి పాకిస్థాన్​ డ్రోన్లు- తిప్పికొట్టిన ఆర్మీ- LoC వద్ద హైఅలర్ట్​

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి గగనతలాన్ని ఉల్లంఘించడానికి 2-3 చిన్న డ్రోన్లు ప్రయత్నం

Pakistan Drones Spotted
Pakistan Drones Spotted (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 3:02 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pakistan Drones Spotted : పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితుల వేళ జమ్ముకశ్మీర్​​లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద హై అలర్ట్​ నెలకొంది. పాకిస్థాన్​కు చెందిన డ్రోన్లు జమ్ముకశ్మీర్​లోని​ నియంత్రణ రేఖ (LoC) వద్ద ప్రవేశించేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి గగనతలాన్ని ఉల్లంఘించడానికి 2-3 చిన్న డ్రోన్లు ప్రయత్నించగా విజయవంతంగా తిప్పికొట్టామని భారత సైన్యం వెల్లడించింది. ఉదయం 5:45 నుంచి ఉదయం 6:00 గంటల మధ్య డ్రోన్లు నియంత్రణ రేఖ వెంబడి భారత గగనతలాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించాయని అధికారులు వివరించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భారత ఆర్మీ వేగంగా ప్రతిఘటించడంతో అవి తిరిగి వెళ్లాయని అధికారులు తెలిపారు.

"ఆదివారం ఉదయం 5:45 నుంచి 6:00 గంటల మధ్య జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి 2-3 చిన్న క్వాడ్‌కాప్టర్లు వైమానిక ప్రాంతాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించాయి. అప్రమత్తమైన భారత ఆర్మీ సిబ్బంది వేగవంతమైన కౌంటర్-డ్రోన్ చర్యలు చేపట్టారు. ఫలితంగా పాక్​ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో క్వాడ్‌కాప్టర్లు తిరిగి పాక్​కు వెళ్లాయి."

--ఆర్మీ అధికారులు

నిఘాతో పాటు పర్యవేక్షణను ముమ్మరం చేసిన సైన్యం
ఈ మధ్య కాలంలో జమ్ము కశ్మీర్​లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక డ్రోన్లు కనిపించాయి. ఈ క్రమంలోనే భవిష్యత్ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి భారత సైన్యం నిఘాతో పాటు పర్యవేక్షణను ముమ్మరం చేసింది.

డ్రోన్లతో వచ్చి మాదక ద్రవ్యాలు
అంతకుముందు కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా మాదక ద్రవ్యాలు లభించాయి. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డ్రోన్‌ వీటిని జారవిడిచినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో 6.5 కిలోలకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిభ్రవరి 13 అర్థరాత్రి అనుమానిత డ్రోన్‌ కదలికలను స్థానికులు గమనించారు. ఆ డ్రోన్‌ ఏదో పదార్థాన్ని జారవిడిచినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ దళాలతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక పొలాల్లో పెద్దఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. దాని మొత్తం విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలాఉండగానే కథువా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా పాక్‌ నుంచి హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన జతిన్‌, కథువాలోని జఖ్‌బార్‌కు చెందిన డానిష్‌ డోగ్రాలుగా గుర్తించారు. వీరికి పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్‌లతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

డ్రోన్‌ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసిన భారత సైన్యం
మరోవైపు పహల్గాం దాడి తర్వాత భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నుంచి పాక్‌ చేసే డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు పటిష్ఠమైన చర్యల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌ స్క్వాడ్రన్‌ను పటిష్టం చేశారు. సరిహద్దు వెంబడి నిఘా ఉంచడంతో పాటు, శత్రు సేనల కదలికల్ని గమనించడం, దాడుల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

త్రికాల్ పేరుతో హైటెక్‌ అటాక్ డ్రోన్లు రెడీ- ఆపరేషన్ సిందూర్​తో డ్రోన్లపై భారత్​ ఫోకస్​!

'ఆపరేషన్ సిందూర్' వేళ పాక్​ డ్రోన్లు భారత్​కు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదు : సీడీఎస్ అనిల్ చౌహాన్