ఫోన్ ఛార్జింగ్ కోసం 30 కి.మీ. ప్రయాణం! భారీ వర్షాలకు కరెంటు కట్- 6రోజులుగా కొవ్వొత్తుల వెలుగులోనే జీవనం
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు- ఖానాపుర్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు స్తంభించిపోయిన జనజీవనం- అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Published : July 9, 2026 at 11:03 AM IST
karnataka Rain Updates : గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని బెలగావి జిల్లా తీవ్ర ప్రభావితమైంది. ముఖ్యంగా ఖానాపుర్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ ఈదురు గాలుల కారణంగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా ఆరు రోజులుగా 25కు పైగా గ్రామాల్లో కరెంటు లేక జనం కొవ్వొత్తుల వెలుగుల మధ్య జీవిస్తున్నారు. మరోవైపు సెల్‌ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి 30 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌కు సమాచారం ఇద్దామన్నా సెల్ఫోన్లో ఛార్జింగ్ లేని పరిస్థితి. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభావిత ప్రాంతప్రజలు కోరుతున్నారు.
25పైగా గ్రామాల్లో కరెంట్ కట్
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఎనిమిది రోజులుగా ఖాన్పుర్ తాలూకాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణాపుర్, హోల్డా, అమాగావ్, చిరకనే, కొంగల, గావలి, పాస్తోలి, అశోక్ నగర్, నేరసే, తేరేగలి, హబ్బనట్టి, కలమణి, మంతుర్గతో పాటు ఇతర గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో పిల్లల విద్య, గృహ అవసరాలు, సమాచార మార్పిడిపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం వేళలో కూడా ఇంట్లో చీకటి కమ్మేసిందని, దీంతో నూనె దీపాలు వెలిగించుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల సరైన వంతెనలు లేక ప్రాణాలను చేత పట్టుకుని వాగులు దాటాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మా సమస్యలు వినడానికి ఎవరూరారు?
అయితే, తమ సమస్యల పట్ల సంవత్సరాలుగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "నగరాల్లో ఒక్క నిమిషం కరెంట్ పోయినా ప్రజలు ఆందోళన చెందుతారు. కానీ మేం 6 రోజులుగా గాఢాంధకారంలో జీవిస్తున్నాం. మా మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, మేము అత్యవసర ఫోన్ కాల్ కూడా చేయలేకపోతున్నాం. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, మా సమస్యలు వినడానికి ఎవరూ రారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికలు లేదా అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రమే మా దగ్గరికి వస్తారు. కానీ సమస్యల వచ్చినప్పుడు మాత్రం పరిష్కరించడానికి ఏమీ చేయరు" అని గ్రామస్థులు వాపోతున్నారు.

తరతరాలుగా ఇదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాం!
నేరసే నివాసి అయిన దేశాయ్ మాట్లాడుతూ, ఈ సమస్యలు తరతరాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. "మేము దశాబ్దాలుగా ఈ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాం. మా గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. వర్షాకాలంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే, దాన్ని పునరుద్ధరించడానికి 15 రోజులు పడుతుంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇది కాకుండా, ఏడాది పొడవునా అడవి జంతువులు తరచుగా మా పంటలను నాశనం చేస్తాయి. ఇక్కడ జీవితం అత్యంత కష్టంగా మారింది" అని ఆయన పేర్కొన్నారు.
సమస్య పరిష్కరిస్తామని వాగ్దానాలు చేస్తారు, వెళ్లిపోతారు!
మరోవైపు, విద్యుత్ కోత వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. "హిద్కల్ రిజర్వాయర్ కారణంగా మా గ్రామం మునిగిపోయింది. 42 ఏళ్ల క్రితం మాకు ఇక్కడ పునరావాసం కల్పించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మేం విద్యుత్, తాగునీరు, రోడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాల కొరతతో పోరాడుతూనే ఉన్నాం. మా సమస్యలను పరిష్కరిస్తామని వాగ్దానం చేసి వెళ్లిపోతారు, కానీ ఏమీ మారదు" అని అశోక్ నగర్ గ్రామ నివాసి చంద్రకాంత్ పూజారి అన్నారు.
ఇదిలా ఉండగా, ఖానాపుర్ తాలూకా వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నందున, వీలైనంత త్వరగా విద్యుత్‌ను పునరుద్ధరించాలని నివాసితులు అధికారులను కోరుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తాము ఏకాకులుగా మిగిలిపోకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ- కన్యాదానం చేసి ఘనంగా అప్పగింతలు
లిటరసీలో ఉత్తరాఖండ్ రికార్డ్- దేశంలో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన ఆరో రాష్ట్రంగా ఘనత

