ETV Bharat / bharat

38 కిలోమీటర్ల కాలినడక- పోలియో చుక్కలు వేసేందుకు కొండలు దాటిన ఆరోగ్య సిబ్బంది

జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ పర్వత ప్రాంతంలో సంచార కుటుంబాలకు చేరిన వైద్య బృందం- 10 గంటలపాటు నడిచి దాదాపు 30 మంది చిన్నారులకు పోలియో చుక్కలు

Health Workers Trek For Polio Drops
Health Workers Trek For Polio Drops (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 2, 2026 at 8:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Health Workers Trek For Polio Drops : వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఒక్క చిన్నారి కూడా పోలియో టీకాకు దూరం కాకూడదనే సంకల్పంతో జమ్మూకశ్మీర్ ఆరోగ్య శాఖ సిబ్బంది విశేష కృషి చేసింది. బండిపోరా జిల్లాలోని గురేజ్​​లో జాతీయ పల్స్ పోలియో రోగనిరోధక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తల బృందం దాదాపు 38 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సంచార కుటుంబాల చిన్నారులకు పోలియో చుక్కలు వేసింది. ఎండ, నిటారుగా ఉన్న పర్వత దారులు, రాతి భూభాగాలను దాటుతూ చేసిన ఈ ప్రయాణం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

వైద్య సామగ్రిని వీపుపై మోసుకుంటూ ప్రయాణం
గురేజ్​​ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో గుజ్జర్​, బకర్వాల్ తెగలకు చెందిన సంచార కుటుంబాలు తమ పశువులతో కలిసి నివసిస్తుంటాయి. ఈ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో పాటు వైద్య సేవలు కూడా చాలా అరుదుగా అందుబాటులో ఉంటాయి. దీంతో అక్కడి చిన్నారులకు పోలియో టీకాలు అందించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆరోగ్య కార్యకర్తలు బషీర్ అహ్మద్ టెరూ, షమ్స్ దిన్ నాసిర్, ఆశా కార్యకర్త రుబీనా తదితరులు దావార్ ప్రాంతం నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వ్యాక్సిన్ క్యారియర్లు, అవసరమైన మందులు, వైద్య సామగ్రిని వీపుపై మోసుకుంటూ పటల్వాన్ పర్వత ప్రాంతానికి కాలినడకన బయలుదేరారు. నిటారుగా ఉన్న కొండదారులు, రాళ్లతో నిండిన మార్గాలు దాటుకుంటూ దాదాపు 10 గంటలపాటు ప్రయాణించి సంచార కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు.

ప్రాథమిక వైద్య సేవలు
రాత్రంతా అక్కడే బస చేసిన వైద్య బృందం మరుసటి రోజు పోలియో కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 30 మంది చిన్నారులకు నోటి ద్వారా పోలియో చుక్కలు వేసింది. అంతేకాకుండా అక్కడే తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సంచార కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు అందించింది. రోగులను పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు సాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించింది. అనంతరం మళ్లీ కాలినడకనే తిరుగు ప్రయాణం ప్రారంభించి మొత్తం 38 కిలోమీటర్ల రౌండ్ ట్రిప్‌ను పూర్తి చేసింది.

"తెల్లవారుజామునే బయలుదేరి సుమారు 10 గంటలపాటు నిరంతరాయంగా నడిచాం. పర్వత మార్గం ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ అక్కడ చిన్నారులు తమ కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు"
- బషీర్ అహ్మద్ టెరూ, ఆరోగ్య కార్యకర్త

ఆశా కార్యకర్త రుబీనా మాట్లాడుతూ, గుజ్జర్, బకర్వాల్ సంచార కుటుంబాలు ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తుండటంతో వారికి శాశ్వత చిరునామా ఉండదని చెప్పారు. అందువల్ల టీకాలు వేయించుకోవడానికి లేదా వైద్య చికిత్స కోసం వారు ఆరోగ్య కేంద్రాలకు రావడం చాలా కష్టమని వివరించారు. దాంతో వారు వస్తారని ఎదురు చూడకుండా, ఆరోగ్య సిబ్బందే వారి వద్దకు వెళ్లి సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య బృందం చేసిన ఈ సేవలకు సంచార కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

విజయవంతంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం
అలాగే తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి, వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఆరోగ్య సిబ్బంది ఇంత దూరం కాలినడకన వస్తారని ఊహించలేదని స్థానిక వృద్ధుడు అన్నారు. తమ కోసం చేసిన ఈ కృషిని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి చిన్నారికి టీకా అందడం ముఖ్యం. అందుకే వైద్య సేవలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలు, కొండలు, అడవులు, సంచార వర్గాలు నివసించే ప్రాంతాల్లోనూ ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. గురేజ్‌లో ఆరోగ్య సిబ్బంది చేసిన ఈ 38 కిలోమీటర్ల పాదయాత్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల పట్ల ఉన్న నిబద్ధతకు, ఆరోగ్య కార్యకర్తల సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.

జమ్ము కశ్మీర్​లో పోలియో ఫ్రీ పాకిస్థాన్​ పోస్టర్లు కలకలం- విచారణకు సీఎంఓ ఆదేశం

వందేళ్ల వయసులోనూ వైద్య సేవలు- క్యాన్సర్‌తో కన్ను కోల్పోయినా వెనుతిరగని డాక్టర్ కాళీగోపాల్ ముఖర్జీ