ETV Bharat / bharat

సర్కార్ బడి బాలికల స్టార్టప్ కంపెనీ- రూ.1లక్ష పెట్టుబడితో హెయిర్ ఆయిల్ బిజినెస్- ఇటలీ, ఆస్ట్రేలియాకు ఉత్పత్తులు ఎగుమతి!

హర్వోల్ పేరుతో హెర్బల్ ఆయిల్ స్టార్టప్ ప్రారంభించిన నలుగులు బాలికలు- కుశాల్ బిజినెస్ ఛాలెంజ్‌ పోటీల్లో రూ. 1 లక్ష గెల్చుకొని వ్యాపారంలో పెట్టుబడి- ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలకు హెర్బల్ ప్రొడక్ట్స్ ఎగుమతి

Haryana Schoolgirls Herbal Startup
బడి బాలికల హెయిర్ ఆయిల్ వ్యాపారం (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 26, 2026 at 10:49 PM IST

4 Min Read
Choose ETV Bharat

Haryana Schoolgirls Herbal Startup : బడిలో ఉపాధ్యాయుడు ఇచ్చిన చిన్న ఛాలెంజ్, తల్లి ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద కేశ తైలం (హెర్బల్ హెయిర్ ఆయిల్) ఈ రెండూ కలిసి నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను చిన్న వయసులోనే మహిళా పారిశ్రామికావేత్తలుగా మార్చేశాయి. హరియాణా యమునానగర్ జిల్లా లహర్‌పుర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 15 నుంచి 17 సంవత్సరాల వయసున్న నలుగురు బాలికలు సియా, రేణుక, నాన్సీ, దివ్య చదువుకుంటూనే సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. హర్వోల్ (Harvol) అనే స్టార్టప్ ప్రారంభించి ఇదే బ్రాండ్ పేరుతో హెర్బల్ హెయిర్ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలకు కూడా తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నారు. చదువుతో పాటు రోజూ సుమా గంట సమయం తమ స్టార్టప్ కోసం కేటాయిస్తున్నారు.

వీరి ప్రయాణం ఎలా మొదలైందంటే?
2025 నవంబర్‌లో ఈ విద్యార్థినుల ప్రయాణం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనల్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు కన్వల్‌ జీత్ 'కుశాల్ బిజినెస్ ఛాలెంజ్' గురించి వివరించారు. అప్పుడే చిన్న పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన విద్యార్థిని సియా- తన తల్లి రీనా దేవి ఇంట్లో తయారుచేసే మూలికా నూనె (హెర్బల్ ఆయిల్) గురించి ప్రస్తావించింది.

నేచురల్ ఆయిల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని భావించిన ఆ టీచర్, ఆ హోమ్ రెమెడీని బ్రాండెడ్ ప్రొడక్ట్‌గా మార్చమని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే సహజమైన హెయిర్ ఆయిల్ తయారు చేయాలనే ఆలోచనతో నలుగురు బాలికలు కలిసి ప్రొడక్ట్‌ను అభివృద్ధి చేశారు. వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో తర్వాత హెర్బల్ షాంపూ, హెయిర్ సీరమ్‌ను కూడా తమ ప్రొడక్ట్స్ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం హెర్బల్ హెన్నాను కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

పోటీల్లో సత్తా చాటి రూ. 1 లక్ష గెల్చుకున్నారు!
కుశాల్ బిజినెస్ ఛాలెంజ్‌లో ఈ హర్వోల్ ఆయిల్ టీమ్- స్కూల్, బ్లాక్, జిల్లా స్థాయిల్లో మొదటి స్థానాన్ని సాధించింది. రాష్ట్ర స్థాయిలో కూడా టాప్- 10 లో నిలిచింది. ఈ క్రమంలో ఆ బాలికలకు మొత్తం రూ. 1 లక్ష ప్రైజ్‌మనీ లభించింది. రేణుక తెలిపిన వివరాల ప్రకారం- జిల్లా స్థాయిలో రూ. 25 వేలు, రాష్ట్ర స్థాయిలో రూ. 75 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఎవరికి వారు ఖర్చు చేయకుండా వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టారు. మొదట ఇంట్లోనే ఉత్పత్తులు తయారు చేసి ప్యాక్ చేసేవారు. అమ్మకాలు పెరగడంతో ఇప్పుడు ఒక షాప్‌ను అద్దెకు తీసుకొని అక్కడి నుంచి ప్రొడక్ట్స్ తయారీ, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

గ్రామాల్లో ప్రచారం- సోషల్ మీడియాలో మార్కెటింగ్
ప్రారంభంలో ఈ బాలికలకు తమ ప్రొడక్ట్స్‌ను విక్రయించడం అంత సాఫీగా ఏం సాగలేదు. నాన్సీతో పాటు టీమ్ సభ్యులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి హెర్బల్ ఉత్పత్తుల తయారీ విధానం, అందులో ఉపయోగించే పదార్థాల గురించి ప్రజలకు వివరించారు. తర్వాత స్థానిక చిన్న దుకాణాలను సంప్రదించి తమ ఉత్పత్తుల్ని విక్రయించడం ప్రారంభించారు. క్రమంగా కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో హర్వోల్ ఉత్పత్తులకు గుర్తింపు పెరుగుతూ వచ్చింది. బాలికలు సోషల్ మీడియాలో హర్వోల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రొడక్ట్స్ ఫొటోలు, వివరాలు, కస్టమర్లు అభిప్రాయాల్ని పంచుకోవడం ద్వారా కొత్త వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నారు.

హర్వోల్ ఉత్పత్తులకు విదేశాల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఒక కస్టమర్ ఈ హర్వోల్ ప్రొడక్ట్‌ను ఆస్ట్రేలియాలో ఉన్న తన బంధువులకు పంపించారు. అక్కడ కూడా ఈ హెయిర్ ఆయిల్‌కు వస్తున్న స్పందనతో బాలికలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఇటలీ నుంచి కూడా ఆర్డర్ వచ్చినట్లు సియా తెలిపింది. 2025 నవంబరులో తమ వ్యాపారం ప్రారంభమైనప్పటి నుంచి హర్వోల్ ద్వారా దాదాపు రూ. 1 లక్ష ఆదాయం వచ్చిందని దివ్య చెప్పింది. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆర్డర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొంది. సియా తల్లి రీనా దేవి కూడా వారి సక్సెస్ గురించి మాట్లాడారు. 'నేనేదో ఇంటి అవసరాల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం మాత్రమే ఈ నూనెను చేసేదాన్ని. నా కూతురు, ఆమె స్నేహితులు ఈ చిట్కాను పెద్ద బిజినెస్ ఐడియాగా మార్చి విజయం సాధించడం నాకెంతో గర్వకారణంగా ఉంది.' అని సంతోషం వ్యక్తం చేశారు.

ఆ బాలికల ప్రకారం ఈ హర్వోల్ హెర్బల్ హెయిర్ ఆయిల్‌లో కలోంజి (నల్ల జీలకర్ర), మెంతులు, భృంగరాజ్ (గుంటగలగరాకు), అతిమధురం వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. కరివేపాకు సహా మరికొన్ని పదార్థాలను విద్యార్థులు గ్రామాల చుట్టుపక్కల ఉన్న పొలాల నుంచి సేకరిస్తారు. వాటిని శుభ్రం చేసి సిద్ధం చేసిన తర్వాత నూనెలో వేసి తక్కువ మంటపై తయారు చేస్తారు. చల్లారిన తర్వాత బాటిళ్లలో నింపి ప్యాక్ చేస్తారు. హెర్బల్ షాంపూ ధర రూ. 150 గా ఉంది. కస్టమర్ల నుంచి వస్తున్న సూచనలు, అభిప్రాయాల ఆధారంగా మరిన్ని ఉత్పత్తుల్ని రూపొందించేందుకు బాలికలు ప్రయత్నాలు చేస్తున్నారు.

యజమాని ఎవరో తేల్చేందుకు గేదెకు DNA పరీక్ష- పోలీసుల సంచలన నిర్ణయం!

రైల్వే ట్రాక్‌పై రీల్స్‌- రైలు ఢీకొట్టడంతో రెండు చేతులు కోల్పోయిన యువతి