భారీ ఉగ్రదాడులకు కుట్ర- హైదరాబాద్ వ్యక్తి సహా ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్- గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన ఏటీఎస్- ఆయుధాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు

Published : November 9, 2025 at 5:11 PM IST
Gujarat ATS Arrest : దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు ఉగ్రవాదులను అహ్మదాబాద్‌లో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్ ఏటీఎస్, ఆయుధాలు సరఫరా చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు గుర్తించింది. నిందితుల వద్ద నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది.
పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా గుర్తింపు!
నిందితుల్లో ఒకడైన అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని గుజరాత్ డీఐజీ సునిల్ జోషి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. అహ్మద్ మొహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అహ్మదాబాద్‌కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
టెలిగ్రామ్ ద్వారా ఉగ్రసంస్థతో సంబంధాలు!
36 ఏళ్ల వయసున్నఅహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఉగ్రదాడి చేయాలని అహ్మద్ మొహియుద్దీన్ భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పలువురు విదేశీయులతోనూ టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా ఓ ఉగ్రసంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
కశ్మీర్‌లోనూ వీరి కదలికలు నమోదు!
గుజరాత్‌లోని కాలోల్ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ మొహియుద్దీన్ చిక్కినట్టు పోలీసులు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుజరాత్‌లోని బనస్కాంతలో అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్లు గుర్తించారు. వీరిద్దరు కూడా విదేశాల్లోని పలువురితో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడుల కోసం ఇప్పటికే దిల్లీ, అహ్మదాబాద్, లఖ్‌నవూలో రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. కశ్మీర్‌లోనూ వీరి కదలికలు నమోదైనట్లు చెప్పారు. నిందితులతో సంబంధం ఉన్న వారిని సైతం గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అల్ ఖైదా ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది. ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్‌ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పాక్‌లోని ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్టు తెలిపారు.
ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
ఇదిలా ఉండగా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్‌లోని కథవా జిల్లాలో ఇద్దరు ఎస్పీవోలపై అధికారులు వేటు వేశారు. ఉగ్రవాదుల కార్యకలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో విధుల నుంచి తొలగించామని అధికారులు పేర్కొన్నారు. ఎస్పీవోలైన అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం దోడా జైలుకు తరలించినట్లు తెలిపారు.
జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు!
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో వరుసగా రెండో రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. శనివారం 59 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆదివారం రాంబన్, కిష్త్‌వాడ్, దోడా, కఠువా, రియాసి, పూంచ్, రాజౌరి జిల్లాలు సహా 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు, సైన్యం, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యుల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఉగ్రవాదులు శీతాకాలం కావడంతో మైదానా ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి.
భారీ ఉగ్రదాడులకు కుట్ర- హైదరాబాద్ వ్యక్తి సహా ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
స్టూడెంట్‌పై అత్యాచారం ట్యూషన్ మాస్టర్ చేసి పరారీ- 25ఏళ్ల తర్వాత పట్టుకున్న పోలీసులు

