టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ తొలగించాలని ఆదేశం
పైరసీ కంటెంట్‌ను తొలగించాలని టెలిగ్రామ్‌కు కేంద్రం ఆదేశాలు- తీసుకున్న చర్యలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సమాచార, ప్రసార శాఖ నోటీసు

Published : July 4, 2026 at 2:31 PM IST
Govt Notice To Telegram : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో-విజువల్ కంటెంట్‌ను వెంటనే నియంత్రించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. ఈ దిశగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని టెలిగ్రామ్‌ను కోరింది. ఇకపై పైరసీ కంటెంట్‌ను గుర్తించి తొలగించే బాధ్యత పూర్తిగా ప్లాట్‌ఫామ్‌పైనే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఒక్కో ఛానెల్‌ను తొలగించే విధానాన్ని అనుసరిస్తున్న టెలిగ్రామ్ ఇకపై ఆ విధానాన్ని కొనసాగించరాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం లేదా హక్కుదారులు ఒక్కో పైరసీ ఛానెల్‌ను గుర్తించి తెలియజేసే వరకు వేచి ఉండకుండా, టెలిగ్రామ్ స్వయంగా తన ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం పర్యవేక్షించి, చట్టవిరుద్ధ కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. కేవలం ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకోవడం ద్వారా ప్లాట్‌ఫామ్ తన బాధ్యతను నిర్వర్తించినట్లు కాదని కేంద్రం పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టం-2000, ఐటీ నిబంధనలు-2021 ప్రకారం మధ్యవర్తిగా టెలిగ్రామ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది.
ఫిర్యాదులు ఎంత సమయంలో పరిష్కరిస్తున్నారు?
ఫిర్యాదులు ఎంత సమయంలో పరిష్కరిస్తున్నారు, ఎలాంటి యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు అనే వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం తాజా చర్య వెనుక ప్రధాన ఉద్దేశం దేశంలోని చలనచిత్ర పరిశ్రమ, ఓటీటీ రంగం, ప్రసార సంస్థలు, నిర్మాతలు, పంపిణీదారులు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమేనని అధికారులు తెలిపారు. పైరసీ కారణంగా సృజనాత్మక రంగానికి భారీ నష్టం జరుగుతోందని, దీనిని అరికట్టేందుకు ప్లాట్‌ఫారమ్‌లను మరింత బాధ్యతాయుతంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
చట్టవిరుద్ధ కంటెంట్‌పై వెంటనే చర్యలు
నీట్ రీ-ఎగ్జామ్ సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేకుండా ముందుజాగ్రత్త చర్యగా గత జూన్‌లో టెలిగ్రామ్ సేవలను భారత్‌లో తాత్కాలికంగా పరిమితం చేసిన విషయాన్ని కూడా అధికారులు గుర్తు చేశారు. ఆ అనుభవం తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ నేరం మాత్రమే కాదని, 'కాపీరైట్ చట్టం-1957', 'సినిమాటోగ్రాఫ్ చట్టం-1952' ప్రకారం అది క్రిమినల్ నేరంగా కూడా పరిగణిస్తారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు గుర్తు చేసినట్లు సమాచారం. అందుకే చట్టవిరుద్ధంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కంటెంట్‌ను ప్రసారం చేసే ఛానెల్‌లపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్లాట్‌ఫామ్‌పై ఉందని పేర్కొంది. ఐటీ చట్టం-2000, ఐటీ నిబంధనలు-2021 ప్రకారం "డ్యూ డిలిజెన్స్" (తగిన జాగ్రత్తలు) పాటించడం ప్రతి మధ్యవర్తి సంస్థకు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం ఫిర్యాదు వచ్చిన తర్వాత స్పందించడం సరిపోదని, చట్టవిరుద్ధ కంటెంట్‌ను ముందుగానే గుర్తించి నిరోధించే సమర్థ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
మెటాపై కేంద్రం నియంత్రణ
మెటాపై కేంద్రం ఇటీవల తీసుకున్న నియంత్రణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్‌కు ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వాట్సాప్‌లో ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు నోటీసు జారీ చేసింది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులకు సంబంధించిన అనుచిత ప్రకటనల అంశంపై కూడా మెటా నుంచి వివరణ కోరింది. ఇలాంటి వరుస చర్యలతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారత చట్టాలు, ఐటీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
నిషేధంపై టెలిగ్రామ్ పిటిషన్- తీర్పు రిజర్వ్ చేసిన దిల్లీ హైకోర్టు- విచారణ వేళ కీలక వ్యాఖ్యలు
టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు- కేంద్ర ఆంక్షలు సమర్థింపు

