గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్: నంబర్1 స్థానంలో స్వీడన్- 125కు దిగజారిన భారత్ ర్యాంక్
గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో స్వీడన్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా ఘనత- ఒక స్థానం కోల్పోయి 125వ ర్యాంక్ సాధించిన భారత్- టాప్-10లో లేని అమెరికా, ఫ్రాన్స్

Published : July 6, 2026 at 7:42 PM IST
Global Passport Index 2026 : ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల బలాన్ని అంచనా వేసేటువంటి గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 జాబితా విడుదలైంది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా స్వీడన్ నిలవగా, భారత్ మాత్రం ఒక స్థానం కోల్పోయి 125వ ర్యాంకుకు చేరింది. గతేడాది భారత్ 124వ స్థానంలో ఉండేది. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విడుదల చేసిన ఈ నివేదికలో మొత్తం 197 దేశాలు, భూభాగాల పాస్‌పోర్ట్‌లను విశ్లేషించారు. ప్రయాణ స్వేచ్ఛ, పెట్టుబడి అవకాశాలు, జీవన నాణ్యత అనే 3 ప్రధాన విభాగాల కింద మొత్తం 14 సూచికల ఆధారంగా ర్యాంకింగ్స్ రూపొందించారు. 2026 ఇండెక్స్‌లో 96.05 పాయింట్లతో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత వరుసగా స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నార్వే, సింగపూర్ టాప్- 10లో చోటు దక్కించుకున్నాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ రెండూ సమాన పాయింట్లతో ఒకే ర్యాంక్ సాధించగా ఆరో స్థానాన్ని ఇండెక్స్ నిబంధనల ప్రకారం ఖాళీగా ఉంచారు.
భారత్ 125వ స్థానం- చైనా ముందంజ
ఈసారి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 125వ ర్యాంక్ సాధించింది. గత ఏడాది 124వ స్థానంలో ఉండగా ఈసారి ఒక ప్లేస్ కోల్పోయింది. మన పొరుగు దేశాల ర్యాంకింగ్స్ గమనిస్తే చైనా 104వ ర్యాంక్ సాధించి ముందంజలో ఉంది. నమీబియా 124, అజర్‌బైజాన్ 126, నేపాల్ 164, బంగ్లాదేశ్ 166, పాకిస్థాన్ 188వ స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ భారత్ కంటే చైనా ముందుండగా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే భారత్ కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇక ఈసారి కూడా ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. కింది నుంచి వరుసగా అఫ్గాన్ తర్వాత సోమాలియా, సౌత్ సూడాన్, యెమెన్, సిరియా ఉన్నాయి.
భారత పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలకు వెళ్లొచ్చు?
గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి 82 దేశాలు, ప్రాంతాల్లో వీసా లేకుండా లేదా సులభంగానే ప్రవేశం లభిస్తోంది. విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం చూస్తే 27 దేశాల్లో పూర్తిగా వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంది. 47 దేశాల్లో వీసా ఆన్ అరైవల్, 66 దేశాల్లో ఈ- వీసా సౌకర్యం భారతీయులకు అందుబాటులో ఉంది. పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌తో పాటు దేశాల వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని కూడా ఈ రిపోర్ట్ అంచనా వేసింది. దీని ప్రకారం వ్యాపారం, పెట్టుబడుల్లో భారత్ 94వ స్థానంలో నిలిచింది. స్టార్టప్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు అనుకూల దేశంగా కూడా గుర్తింపు పొందింది. తక్కువ జీవన వ్యయం- విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ జీవన నాణ్యత, సంతోష సూచికల్లో (హ్యాపీనెస్ ఇండెక్స్) ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
భారత ర్యాంక్ తగ్గడానికి కారణాలేంటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ ర్యాంక్ ఈసారి తగ్గేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో భద్రతా కారణాలతో భారత్ కఠిన వీసా విధానాల్ని అమలు చేస్తుండటం, అక్రమ వలసలు, వీసా గడువు ముగిసినా విదేశాల్లోనే ఉండిపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. పరస్పర వీసా సడలింపుల విషయంలో ఇంకా అనేక దేశాలతో పూర్తి స్థాయిలో ఒప్పందాలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
అగ్రదేశాలుగా పేరొందిన అమెరికా, ఫ్రాన్స్ ఈసారి శక్తిమంతమైన వీసాల జాబితాలో టాప్- 10 లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ రెండు దేశాలు 11వ స్థానంలో నిలిచాయి. గత ఐదేళ్ల కాలంలో భారత్ పరిస్థితి చూస్తే 2021లో 127వ స్థానంలో ఉండగా కిందటేడాది 124, ఇప్పుడు 125వ ర్యాంక్ సాధించింది. ఇక్కడ ఐదేళ్లలో భారత్ 2 స్థానాలు మాత్రమే మెరుగుపడగా, ఈ ఏడాది మళ్లీ ఒక స్థానం వెనక్కి వెళ్లింది. 2026 ఇండెక్స్‌లో మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించారు. అత్యంత బలమైన పాస్‌పోర్ట్ కలిగిన స్వీడన్ 96.05 పాయింట్లతో ఉంటే, చివరి స్థానంలోని అఫ్గానిస్థాన్‌కు 23.10 పాయింట్లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య 72.95 పాయింట్ల భారీ అంతరం ఉందని రిపోర్టులో పేర్కొంది. 2021 నుంచి ప్రతి ఏడాది బలమైన పాస్‌పోర్ట్‌లు మరింత బలపడుతుంటే, బలహీనదేశాల పాస్‌పోర్టులు ఇంకా వెనుకబడుతున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.
బలమైన vs బలహీనమైన పాస్‌పోర్ట్- ఎందుకంత ముఖ్యం?
శక్తిమంతమైన పాస్‌పోర్ట్ ఉన్న దేశాల పౌరులు వీసా లేకుండా ఎక్కువ దేశాలకు ప్రయాణించే వీలు కలుగుతుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు సులభంగా పొందగలరు. అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది. అదే బలహీనమైన పాస్‌పోర్ట్ వల్ల నష్టాలు చూస్తే ఆ దేశాల పౌరులకు తక్కువ దేశాల్లో మాత్రమే వీసా ఫ్రీ ప్రయాణం ఉంటుంది. వీసా రిజెక్షన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి
వధువులకు 'గిల్ట్' మంగళసూత్రాలు పంపిణీ- ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ బిగ్ స్కామ్
ECHR కోర్టులోనూ నీరవ్ మోదీకి షాక్- త్వరలోనే భారత్‌కు అప్పగింత!

