ETV Bharat / bharat

చేతులు, కాలు లేకున్నా స్కూల్​కు- టెన్త్​లో జిల్లా​ టాపర్​- IAS కావడమే టార్గెట్​!

పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 92 శాతం పైగా మార్కులు సాధించిన దివ్యాంగురాలు

Born Without Arms And A Leg
Born Without Arms And A Leg (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 5, 2026 at 8:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Born Without Arms And Leg : "నాన్న, నన్ను స్కూల్లో చేర్పించు. నేను చదువుకోవాలని అనుకుంటున్నాను." అని ఆ చిన్నారి అడిగినప్పుడు ఆ తండ్రి గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే, ఆ అమ్మాయి అందరూ పిల్లల్లాంటిది కాదు. పుట్టుకతోనే రెండు చేతులు లేవు, కేవలం ఒకే ఒక్క కాలు మాత్రమే ఉంది. కానీ, ఆ పట్టుదలే నేడు ఆమెను ఎంతో మందికి ఆదర్శంగా నిలబెట్టింది. పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 92 శాతం పైగా మార్కులు సాధించి, జిల్లా మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం బయాలజీ గ్రూప్‌లో ఇంటర్​ చదువుతున్న ఆమె, భవిష్యత్​లో ఐఏఎస్ (IAS) కావాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. ఇంతకీ ఎవరామే? ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛత్తీస్​గఢ్​ సూరజ్‌పుర్ జిల్లాలోని రామానుజ్‌నగర్ బ్లాక్ పరిధిలోని కళ్యాణ్‌పుర్ గ్రామానికి చెందిన విశ్వకర్మ కుటుంబంలో నలుగురు పిల్లల్లో శీతలా ఒకరు. ఆమె తోబుట్టువులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ, శీతలా మాత్రం పుట్టుకతో వచ్చే తీవ్రమైన వైకల్యంతో జన్మించింది. ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ, రోజువారీ పనులు చేయడం మరింత సవాలుగా మారింది. కానీ శీతలా ఆ అడ్డంకులను అధిగమించి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో విజయం సాధించింది. ప్రతి రోజు ఉదయం శీతలా తల్లి ఆమెను పాఠశాలకు సిద్ధం చేస్తారు. 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది. శీతలా అమ్మనే ఆమెను సగం దూరం వరకు వీల్‌చైర్‌లోనే తీసుకువెళ్తారు. అక్కడి నుంచి శీతలా సహవిద్యార్థులు వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ పాఠశాలకు తీసుకువెళ్తారు.

Born Without Arms And A Leg
స్కూల్​లో శీతలా (ETV Bharat)

దేవ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అయిన శీతలా, తన ఒకే కాలితోనే రాయడం, బొమ్మలు గీయడం, డ్యాన్స్​ చేయడం, మొబైల్ ఫోన్‌లో పాఠ్యాంశాలను చదవుకుంటోంది. ఆమె వైకల్యం ఆమె చదువుకు ఎప్పుడూ ఆటంకం కలిగించలేదు. ఆమె పదో తరగతి బోర్డు పరీక్షలో 600కి 557 మార్కులు (92శాతం పైగా) సాధించింది. ఫలితంగా పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా, జిల్లా స్థాయి అత్యుత్తమ ప్రతిభావంతుల జాబితాలో (టాప్ టెన్) చోటు దక్కించుకుంది. సవాళ్లకు తాను అలవాటు పడ్డానని, వాటిని ఇకపై అడ్డంకులుగా భావించడం లేదని శీతలా చెబుతోంది.

"నేను రాయడం నేర్చుకున్నప్పుడు మా నాన్నతో 'నాన్నా, దయచేసి నన్ను పాఠశాలలో చేర్పించండి' అని అడిగాను. నాకు చదువంటే ఇష్టం, నా వైకల్యం నన్ను వెనక్కి లాగుతుందని ఎప్పుడూ అనిపించదు. వైకల్యం ఉన్న ఇతర పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే దేవుడు మనల్ని సృష్టించిన విధానాన్ని మనం మార్చలేము. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. నేను సివిల్ సర్వెంట్ (ప్రభుత్వ అధికారి) కావాలని కోరుకుంటున్నాను. సమాజంలో విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కృషి చేయాలని అనుకుంటున్నాను. నాకు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ నా పట్టుదలే నాకు బలంగా మారింది. నా తల్లిదండ్రులే నాకు అతిపెద్ద అండగా నిలిచారు."
---శీతలా విశ్మకర్మ, విద్యార్థిని

శీతలా చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఆమె తల్లి చెప్పారు. "ఉదయం శీతలాను సిద్ధం చేయడం నుంచి భోజనం తినిపించే వరకు అన్నీ నేనే చేస్తాను. శీతలాకు చదువంటే చాలా ఇష్టం. ఆమె ఏదో ఒక రోజు ఐఏఎస్ (IAS) అధికారి కావాలని మేము కోరుకుంటున్నాము." అని తల్లి అన్నారు.

"శీతలా పుట్టినప్పుడే ఆమె వైకల్యం గురించి మాకు తెలుసు. కానీ మేము ఎప్పుడూ ఆమెపై ఆశను కోల్పోలేదు. శీతలా చదువుకోవాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, నేను ఓపికగా ఆమెకు తన పాదంతో పెన్సిల్ పట్టుకోవడం నేర్పించాను. అలా ఆరు నెలల్లోనే ఆమె చదవడం, రాయడం నేర్చుకుంది. శీతలా జిల్లా కలెక్టర్ కావాలని కోరుకుంటోంది. ఆమె జీవితంలో గొప్ప స్థానాన్ని చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. మేమందరం ఆమె చదువుకు మద్దతు ఇస్తున్నాం. శీతలాను ఒక అధికారిగా చూడాలని ఆమె తల్లి కూడా కలలు కంటోంది. ఆమె ఒక అధికారి లేదా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అయినా నాకు గర్వంగానే ఉంటుంది. అది మొత్తం గ్రామానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది."
---హీరాలాల్ విశ్వకర్మ, శీతలా తండ్రి

శీతలా కేవలం జిల్లాకే కాకుండా మొత్తం రాష్ట్రానికే స్ఫూర్తిదాయకమని సూరజ్‌పూర్ కలెక్టర్ రీనా జమీల్ అన్నారు. "జిల్లా యంత్రాంగం శీతలా అవసరాలను పరిశీలించి, ఆమెకు అర్హత ఉన్న ప్రతి ప్రభుత్వ పథకం, సహాయం అందేలా చూస్తుంది. శారీరక లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా చూడటమే మా ప్రయత్నం."అని తెలిపారు. అటు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు యాజమాన్యం అన్ని విధాలా మద్దతు అందిస్తోంది.

భార్యను అవమానించారని బావి తవ్విన 71 ఏళ్ల వృద్ధుడు- ఏడేళ్ల పాటు ఒంటరిగానే!

రివర్స్​లో 1 నుంచి 40 వరకు ఎక్కాలను ఒప్పజెప్పిన క్లర్క్- ప్రపంచ రికార్డు సొంతం