ETV Bharat / bharat

సీడీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి

మే 30తో ముగిసిన జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం- ఆయన స్థానంలో సీడీఎస్​గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన రాజా సుబ్రమణి- సాయుధ బలగాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని వెల్లడి

Newly appointed CDS General NS Raja Subramani
Newly appointed CDS General NS Raja Subramani (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2026 at 9:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gen Subramani Takes Charge As CDS : భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్​)గా జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా దిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో జనరల్ రాజా సుబ్రమణికి త్రివిద దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి. అనంతరం దేశ రాజధానిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. పాకిస్థాన్, చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన సుబ్రమణి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్(ఎన్ఎస్​సీఎస్​)లో సైనిక సలహాదారుగా సేవలు అందించారు. గతేడాది జులై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఆయన పదవీ విరమణ చేశారు.

'సాయుధ బలగాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేస్తాం'
సీడీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సుబ్రమణి మీడియాతో మాట్లాడారు. సైనిక దళాల బలోపేతం, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణకు సంస్థాగతంగా సంస్కరణలు తేవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సాయుధ దళాలు అంకితభావం, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాయని, ఈ మేరకు దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, రాజా సుబ్రమణి సీడీఎస్ పదవితో పాటు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్' సెక్రటరీగా కూడా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

"భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు గౌరవంగా ఉంది. సాయుధ దళాలపై దేశం ఉంచిన నమ్మకానికి మేం కృతజ్ఞులం. భారతదేశ భద్రతను బలోపేతం చేసే 'సమగ్ర దేశ విధానంలో' భాగంగా మేం, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, రక్షణ మంత్రిత్వ శాఖ, వ్యూహాత్మక సంస్థలు, సంబంధిత వర్గాలన్నీ ఐక్యంగా నిలుస్తాం. ఈ ప్రయాణంలో ఆదర్శప్రాయమైన నాయకత్వానికి, సహకారానికి గాను, నా విశిష్ట పూర్వాధికారులైన దివంగత జనరల్ బిపిన్ రావత్, జనరల్ అనిల్ చౌహాన్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సైనికులు, నావికులు, వాయుసేన యోధుల ధైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని మేం ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వారి శిక్షణ, సంక్షేమం మా ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుంది. వారి శౌర్యం, త్యాగం, దేశభక్తి మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మన మాజీ సైనికులు, వీరనారీల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం. సాయుధ దళాలు అంకితభావం, ధైర్యం, గౌరవం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేస్తూనే ఉంటాయని నేను భారత పౌరులకు హామీ ఇస్తున్నాను."
- ఎన్​ఎస్​ రాజా సుబ్రమణి, భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

'ఆత్మనిర్భరత మన జాతీయ భద్రతకు మూల స్తంభం'
మరోవైపు, ఆత్మనిర్భరత గురించి కూడా సీడీఎస్​ మాట్లాడారు. "ఆత్మనిర్భరత మన జాతీయ భద్రతకు మూల స్తంభం. ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్ అనే దార్శనికతను అమలు చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. సాయుధ దళాల పరివర్తన, జాయింట్‌నెస్, సినర్జీ, ఇంటిగ్రేషన్‌ను పెంపొందించే దృష్టి కేంద్రీకరిస్తాం. అలాగే, మన సాయుధ దళాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ప్రవేశం, ఏకీకరణను వేగవంతం చేస్తాం. ఆలోచన, కార్యచరణలో నూతనత్వం మన సామర్థ్యానికి, అభివృద్ధికి చోదకశక్తిగా ఉంటాయి. సైన్యం, పరిశ్రమ, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా వ్యవస్థల మధ్య అధిక సహకారం ఆధునీకరణకు కీలక చోదకశక్తిగా ఉంటుంది. మన జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో మన సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, కార్యాచరణ నిర్ణయాత్మకతను ప్రదర్శించాయి" అని సుబ్రమణి తెలిపారు.

దిల్లీలో దయనీయ పరిస్థితిలో చిల్డ్రన్స్ పార్కులు- సౌకర్యాల లేమితో సందర్శకుల పాట్లు

హెల్మెట్ పెట్టుకోకపోయి ఉంటే అభిషేక్ చనిపోయేవాడు: మేనల్లుడిపై జరిగిన దాడిపై మమత ఫైర్