ETV Bharat / bharat

'3 నెలల తర్వాత'- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ మంత్రి కీలక ప్రకటన- మరో 2-3 నెలల పాటు క్రూడాయిల్ ధరల్లో క్షీణత ఇలానే కొనసాగితే పరిశీలిస్తామన్న హర్దీప్ సింగ్ పురీ

Minister Hardeep Singh Puri
Minister Hardeep Singh Puri (Source : IANS, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 2, 2026 at 7:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fuel Prices India : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయనే ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) 2 నెలల కిందట అధిక ధరలకు కొనుగోలు చేసిన క్రూడ్‌నే శుద్ధి చేస్తున్నాయన్నారు. దీంతో వెంటనే ఇంధన ధరలు తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరో 2- 3 నెలల పాటు ఇదే స్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్ష జరిగే అవకాశం ఉంటుందని, అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.

ఆయిల్ కంపెనీలకు వేల కోట్ల నష్టాలు
గురువారం మీడియాతో మాట్లాడిన హర్దీప్ పురీ, పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని గుర్తు చేశారు. జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరలకు విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మొత్తం ఏకంగా రూ. 74,781 కోట్ల నష్టాల్ని భరించాల్సి వచ్చాయని వెల్లడించారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నష్టాన్ని భరించాయని ఆయన తెలిపారు.

క్రూడ్ ధరలు తగ్గినా వెంటనే ఇక్కడ ఎందుకు తగ్గించరు?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గుతున్నప్పటికీ, దాని ప్రభావం వెంటనే దేశీయ ఇంధన ధరలపై కనిపించదని మంత్రి పురీ వివరించారు. సాధారణంగా చమురు కంపెనీలు కనీసం 2 నెలల ముందుగానే ముడి చమురును కొనుగోలు చేస్తాయని, ప్రస్తుతం శుద్ధి (ప్రాసెసింగ్) చేస్తున్న క్రూడ్ ఏప్రిల్ లేదా మే నెలల్లో అప్పటి అధిక ధరలకు కొనుగోలు చేసిందేనని చెప్పారు. అందుకే తాజా ధరల తగ్గుదల ప్రభావం వినియోగదారులకు చేరేందుకు కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.

అప్పుడు అడగటమే సమంజసం- పురీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశంపై ప్రశ్నించగా పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న క్రూడ్ 2 నెలల కిందట కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరో 2-3 నెలల పాటు తక్కువగానే కొనసాగితే అప్పుడు ధరల తగ్గింపుపై ప్రశ్న అడగటం సమంజసంగా ఉంటుంది. అయితే ఇది కేవలం ఊహాజనిత పరిస్థితి మాత్రమే' అని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం ప్రస్తుతం ధరల తగ్గింపుపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే సమీక్ష జరిగే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు.

పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ధర 110 డాలర్లకుపైగా చేరిందని పురీ తెలిపారు. అయితే అదే సమయంలో భారత్‌లో ఇంధన ధరల్ని నియంత్రించగలిగామని ఆయన చెప్పారు. అభివృద్ది చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు సుమారు 20 శాతం పెరగ్గా, భారత పొరుగు దేశాల్లో ధరలు 35 శాతం వరకు పెరిగాయని అన్నారు. భారత్‌లో మాత్రం పెట్రోల్ ధరల పెరుగుదల 5.58 శాతానికే పరిమితమైందని వివరించారు. ఫిబ్రవరి 28 నుంచి జూన్ చివరి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 1.07 లక్షల పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత రాకుండా సరఫరా కొనసాగించామని తెలిపారు.

నయారా సంగతి వేరు
ప్రైవేట్ రంగ అతిపెద్ద రిటైలర్ అయిన నయారా ఎనర్జీ జులై 1న పెట్రోల్ ధరను లీటరుపై రూ. 5, డీజిల్‌ ధర రూ. 3 చొప్పున తగ్గించింది. దీనిపైనా స్పందించిన కేంద్ర మంత్రి- సంక్షోభ సమయంలో నయారా పెట్రోల్ ధరను రూ. 5 పెంచిందని, ఇప్పుడు అదే పెంపును వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆ సమయంలో ధరల్ని పెంచలేదని, అందువల్ల నయారా నిర్ణయాన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ. 115.73, రూ. 103.82 గా ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన 'కోబ్రా'- హిమాచల్​లో తొలిసారి దర్శనం- ఫారెస్ట్ గార్డ్ కెమెరాకు చిక్కిన పాము

పట్టపగలే భారీ చోరీ- బ్లింకిట్ డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు