వ్యవసాయ క్షేత్రం నుంచి యుద్ధ క్షేత్రం దాకా : దుమ్మురేపిన వడిసె- నేటికీ రైతుల ఇళ్లలో చారిత్రక ఆయుధం
ఆది మానవుల అద్భుత ఆవిష్కరణ వడిసె- మహాభారతంలోనూ చక్రాశ్మన్ ప్రస్తావన- ఛత్రపతి శివాజీ ఆర్మీకి కీలక ఆయుధం ఇదే- మొఘల్ సైన్యాన్ని ఐదున్నరేళ్లు వడిసెలతో వణికించిన మరాఠాలు

Published : February 25, 2026 at 5:13 PM IST
Historical Weapon Sling : ఆ ప్రాచీన, చారిత్రక ఆయుధం ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. చేతిలో ఉన్న రాయిని అస్త్రంగా మార్చుకునేందుకు ఆది మానవుడికి దోహదం చేసింది ఆ ఆయుధమే. మహాభారతంలోనూ దీన్ని వినియోగించే తీరు గురించి ప్రస్తావన ఉంది. భారతదేశంలోని రాజుల మధ్య జరిగిన అనేక యుద్ధాల్లోనూ ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. ఛత్రపతి శివాజీ సేనలు, మరాఠా యోధులు, ఆదిల్‌షాహీ దళాలు కూడా ఈ ఆయుధాన్ని వ్యూహాత్మకంగా వినియోగించి యుద్ధ క్షేత్రంలో పైచేయిని సాధించాయి. ఇంతకీ ఏమిటీ ఆయుధం ? దీన్ని ఇప్పటికీ రైతులు ఎందుకు ఉపయోగిస్తున్నారు ? దీని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి ? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
తొలుత గులేల్- ఆ తర్వాత వడిసె
ఆది మానవులు అడవుల్లో జీవించేవారు. వారు ఆహారం కోసం జంతువులు, పక్షులను వేటాడేవారు. తొలుత రాళ్లు, కట్టెలతో వాటిపై దాడి చేసేవారు. కాలక్రమంలో వారు తొలుత గులేల్(Slingshot)ను తయారు చేసుకున్నారు. రెండు తోలు పట్టీల మధ్య రాయిని పెట్టి, ఆ రెండు తోలు పట్టీలకు కట్టి ఉన్న మరో తోలు పట్టీని నిలువునా వెనక్కి లాగి వదిలేవారు. దీంతో రెండు తోలు పట్టీల మధ్యనున్న రాయి వేగంగా ముందుకు దూసుకెళ్లి లక్ష్యాన్ని తాకేది. ఈ గులేల్‌ను ఆదిమానవులు మరింతగా అప్‌గ్రేడ్ చేసుకొని తయారు చేసిన ఆయుధమే వడిసె(Sling). భావితరాలకు చూపించేందుకు ఛత్రపతి శివాజీ కాలం నాటి అరుదైన ఆయుధాలను సేకరించి భద్రపర్చే పనిలో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన శివ కాలే నిమగ్నమై ఉన్నారు. వడిసె వినియోగంతో ముడిపడిన ఆసక్తికర విశేషాలను ఆయన ‘ఈటీవీ భారత్’కు వివరించారు.
నేటికీ ప్రతి రైతు ఇంట్లో వడిసె
"నేటికీ మన దేశంలోని రైతులు వడిసెను ఉపయోగిస్తున్నారు. కోతులు, అడవి పందులు, పక్షులు, ఇతర జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునే అస్త్రంగా ఇది పనికొస్తోంది. రైతులు పొలంలోని ఎత్తైన మంచెపై కూర్చొని వడిసెతో రాళ్లను విసురుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి రైతు ఇంట్లో మనకు వడిసె కనిపిస్తుంది. ఇది మనిషి పురాతన మేధస్సు, యుద్ధ నైపుణ్యాలకు నిదర్శనం. మన దేశంలో జరిగిన చాలా యుద్ధాల్లో వడిసెను ప్రమాదకర ఆయుధంగా ఉపయోగించారు. ప్రత్యేకించి మరాఠా సైనికులు దీన్ని ఎక్కువగా వాడారు. ఛత్రపతి శివాజీ కాలం నాటి ఆయుధాలతో నేను గతంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వడిసె చరిత్ర గురించి విద్యార్థులకు వివరించగా విని, వారంతా ఆశ్చర్యపోయారు’" అని శివ కాలే తెలిపారు.

మొఘల్స్ VS మరాఠాలు : ఐదున్నరేళ్లు వడిసెలతో యుద్ధం
"ఛత్రపతి శివాజీ జీవితంతో ముడిపడిన అన్ని కీలక విషయాలు శివభారతంలో ఉన్నాయి. ఈ చారిత్రక గ్రంధంలోనూ వడిసె ప్రస్తావన ఉంది. వడిసె అనేది సాధారణ తాడు కాదని, అది గొప్ప కచ్చితత్వం కలిగిన ఆయుధమని అందులో అభివర్ణించారు. శివాజీ కాలంలో వడిసెను షెఫాని అని పిలిచేవారు. మహారాష్ట్రలోని మావల్ ప్రాంతానికి చెందిన కున్భీ, మరాఠా వర్గాల ప్రజలు ఛత్రపతి శివాజీకి బలమైన సైనిక మద్దతును అందించారు. 17వ శతాబ్దం నాటి శివాజీ గొరిల్లా ఆర్మీలో ఈ పోరాట యోధులదే కీలక పాత్ర. ఛత్రపతి శివాజీ అమరుడైన తర్వాత, మహారాష్ట్రను జయించడానికి ఔరంగజేబు పెద్దసంఖ్యలో సైన్యాన్ని పంపుతాడు. ఆ సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న అతి చిన్న కోట రాంషేజ్‌ను ఆక్రమించుకోవడానికి మొఘల్ సైన్యం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఇందుకోసం ఏకంగా ఐదున్నర ఏళ్ల పాటు మరాఠాలతో మొఘల్ సైన్యం యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అతికొద్ది సంఖ్యలో ఉన్న మావల్ ప్రాంత పోరాట యోధులు తమ వడిసెలతో ఈ కోటలో నుంచి భీకర పోరాటం చేశారు. వడిసెలతో వీరు చేసిన ఎటాక్స్‌లో వందలాది మంది మొఘల్ సైనికుల తలలు పగిలాయి" అని శివ కాలే వివరించారు.
మహాభారతంలో చక్రాశ్మన్
"మహాభారతంలో చక్రాశ్మన్ అనే పదం ఉంది. కలపతో చేసిన ఆ ఆయుధంతో దూరదూరాల దాకా రాళ్లను విసిరారు అనే ప్రస్తావన చేశారు. దీన్నిబట్టి వడిసె చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పరిరక్షిస్తున్నది రైతులు మాత్రమే. మన చరిత్రకు నిదర్శనంగా నిలిచే, ఇలాంటి సంప్రదాయక ఆయుధాలను పరిరక్షించాలి. భావితరాలకు చూపించేందుకైన వీటిని పదిలంగా దాచాలి" అని శివ కాలే పేర్కొన్నారు.
భావ్‌నగర్ రైతు కొత్త ప్రయోగం- బ్రోకలీ, పర్పుల్ క్యాబేజీ సాగుతో లాభాల పంట!
సేంద్రియ పద్ధతిలో థాయ్, జపనీస్ 'జామ పండ్ల' సాగు- రైతుకు ఏటా రూ.50లక్షల ఆదాయం!

