ETV Bharat / bharat

'భారత విదేశాంగ విధానం ఊగిసలాడుతోంది'- చైనా కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల యోచనపై ఖర్గే ఫైర్

గల్వాన్‌లో అమరులైన సైనికులను మోదీ అవమానించారు- చైనాకు భారత ప్రధాని క్లీన్‌చిట్ ఇచ్చారు- ఇప్పుడు చైనా కంపెనీలకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు- ధ్వజమెత్తిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

Congress President Mallikarjun Kharge
Congress President Mallikarjun Kharge (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 4:50 PM IST

|

Updated : January 9, 2026 at 5:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Foreign Policy Mallikarjun Kharge : మోదీ సర్కారు విదేశాంగ విధానం ఊగిసలాడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. విదేశాంగ విధానంలో స్థిరత్వం లేకపోవడం వల్ల దేశ ప్రజలు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు. భారత ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం చైనా కంపెనీలు బిడ్స్ దాఖలు చేయకుండా ఐదేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన పరిమితులను తొలగించాలనే కేంద్రం యోచనను ఖర్గే తప్పుపట్టారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

మోదీ చెప్పిన దానికి భిన్నంగా పరిస్థితి
'దేశాన్ని తలవంచనివ్వను' అని ప్రధాని మోదీ చెప్పగా, ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోందని ఖర్గే ఫైర్ అయ్యారు. రెండు తాజా ఉదాహరణలను చూస్తే, చైనా కంపెనీలకు భారత ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపుపై ఐదేళ్లుగా ఉన్న బ్యాన్‌ను ఎత్తేసే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చైనాకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా గల్వాన్‌లో భారత్ కోసం ప్రాణాలిచ్చిన వీర సైనికులను అవమానించేలా మోదీ వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు చైనా కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించేందుకు మోదీ రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. ఈ విధమైన చర్యల ద్వారా చైనాపై తన ఆగ్రహం వట్టిదేనని ప్రధాని నిరూపించుకున్నారని ఖర్గే తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ మౌనం సరికాదు!
"రష్యా నుంచి భారత్ చమురును కొంటున్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వహించడం సరికాదు. సరెండర్ అయ్యారు అనేందుకు అదొక సంకేతం లాంటిది. ట్రంప్ కళ్లలోకి కళ్లు పెట్టి మోదీ చూడలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడిని 'సర్' అని భారత ప్రధాని సంబోధించడం కూడా సరెండర్ కావడం లాంటిదే. మా దృష్టిలో విదేశాంగ విధానం అంటే అన్నింటి కంటే దేశ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. భారతదేశ అలీన విధానం, వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగ విధానాలకు నష్టాన్ని కలిగించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోంది. గడియారంలోని పెండ్యులమ్‌లా ఓసారి ఇటువైపునకు, మరోసారి అటువైపునకు భారత విదేశాంగ విధానం ఊగిసలాడుతోంది" అని ఖర్గే పేర్కొన్నారు.

గల్వాన్ నుంచి టియాన్‌జిన్ దాకా
2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో పలువురు భారత సైనికులు అమరులయ్యారు. దీంతో భారత ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం బిడ్లు దాఖలు చేయకుండా చైనా కంపెనీలపై బ్యాన్‌ను అమల్లోకి తెచ్చారు. అమెరికాలో 2025 సంవత్సరం ఆరంభంలో ట్రంప్ సర్కారు ఏర్పడింది. అది వరుసపెట్టి భారత్‌పై దిగుమతి సుంకాలను బాదింది. దీంతో అమెరికాకు భారతదేశ దిగుమతులు బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 2024 అక్టోబరు 23న రష్యాలోని కజన్ నగరం వేదికగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భేటీ అయ్యారు. సరిహద్దు వివాదానికి తెరదించాలని, సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరువురు నిర్ణయించారు. గత సంవత్సరం(2025 ఆగస్టు 31 - సెప్టెంబరు 1) చైనాలోని టియాన్‌జిన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు కూడా ప్రధాని మోదీ హాజరయ్యారు.

భారత్ వైఖరిలో మార్పునకు దారితీసిన పరిణామాలు
గత ఐదేళ్లలో ఈ విధంగా చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం భారత విదేశాంగ విధానంపై పడిందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. ఒకప్పుడు అమెరికాకు అత్యంత సన్నిహితంగా భారత్ మెలిగేది. కానీ ట్రంప్ సర్కారు వైఖరి కారణంగా సీన్ మారిపోయింది. ఆనాడు అమెరికాకు చేరువయ్యే ప్రయత్నంలో చైనా విషయంలో భారత్ కఠిన వైఖరిని తీసుకుంది. ఇప్పుడు భారత్‌ స్నేహానికి విలువ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ట్రంప్ సర్కారు వ్యవహరిస్తుండటంతో మోదీ సర్కారు సైతం తన వైఖరిని మార్చుకుంది. చైనాతో వైరం కంటే స్నేహమే ప్రయోజనకరమనే భావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం పోటీపడే అవకాశాన్ని మళ్లీ చైనా కంపెనీలకు కల్పించాలనే అంశాన్ని మోదీ సర్కారు పరిశీలిస్తోంది.

సీఎం మమత ప్రవర్తనపై బీజేపీ ఫైర్- ఈడీ అధికారుల నుంచి సాక్ష్యాలు లాక్కున్నారని ధ్వజం!

బంగాల్​లో 'I-PAC' రైడ్స్​ రగడ- మమతపై సీబీఐ దర్యాప్తు కోరిన ఈడీ- పత్రాలు దుర్వినియోగంపై హైకోర్టుకు టీఎంఎసీ

Last Updated : January 9, 2026 at 5:12 PM IST