ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం- 'ఐదు రూపాయల డాక్టర్' కావాలనే లక్ష్యం!
ఉపాధ్యాయుల సాయంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆదిమారిమరుతు- తండ్రి మరణం కారణంగా ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం- స్నేహితులతో కలిసి క్లీనిక్ ప్రాపరంభం- ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

Published : June 16, 2026 at 6:50 PM IST
Young Doctor Giving Free Treatment : సాధారణంగా పేద కుటుంబంలోని సంపాదన అంతా రోజూ వారి ఇంటి ఖర్చులకే సరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులు కుటుంబానికి భారంగా మారతాయి. చిన్ననాటి నుంచే ఇలాంటి కష్టాలను దగ్గరగా చూసిన ఓ యువకుడు, పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడిగా ఎదిగారు. అలా గత ఐదేళ్లుగా చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తూ ఎందరో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
తమిళనాడులోని దిండిగల్ జిల్లా గుజిలియంపరై తాలూకాలోని పన్నైకులం గ్రామానికి చెందిన రామమూర్తి, వల్లియమ్మల్ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నవాడైన ఆదిమారిమరుతు చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆయన లక్ష్యానికి పెద్ద అడ్డంకిగా ఉండేది. తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 2015లో కె.రామనాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆదిమారిమరుతు 1,200 మార్కులకు గాను 1,165 మార్కులు సాధించారు. అలా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఉపాధ్యాయుల సాయంతో ఎంబీబీఎస్
ఆదిమారిమరుతుకు వైద్య విద్య చదవాలన్న ఆశ ఉన్నప్పటికీ, కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు. అదే సమయంలో ఆయన ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ఆర్థికంగా సహాయం చేశారు. వారి ప్రోత్సాహంతో తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆదిమారిమరుతు 2021లో వైద్య విద్యను విజయవంతంగా పూర్తిచేశారు. అయితే విద్యాభ్యాసం సాగుతున్న సమయంలోనే ఆయన కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కళాశాలలో చేరిన కొద్ది కాలానికే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ బాధ్యతలు అన్నయ్య శంకరపాండియన్‌పై పడ్డాయి. తండ్రి చికిత్స కోసం కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి కష్టాలను చూసిన ఆయన, పేదలకు ఏదైనా సాయం చేయాలని నిశ్చయించుకున్నారు.
సేవా సంకల్పానికి నాంది
ఈ క్రమంలోనే వైద్య విద్య పూర్తయ్యాక విక్రమసింగపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరిన ఆదిమారిమరుతుకు సుందర్, చంద్రు అనే ఇద్దరు స్నేహితులు పరిచయమయ్యారు. తన మనసులో ఉన్న సేవా సంకల్పాన్ని వారితో పంచుకోగా, క్లినిక్ ప్రారంభించేందుకు వారు సహకరించారు. దీంతో ఆయన 2021 జూన్ 21న అంబసముద్రంలో చిన్న క్లినిక్‌ను ప్రారంభించారు. అందులో ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఐదేళ్లుగా ఉచిత సేవలు
ఆ రోజు మొదలైన సేవా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలా ఆదిమారిమరుతు తన క్లినిక్‌లో విద్యార్థులకు కన్సల్టేషన్ ఫీజు, ఇంజెక్షన్ ఛార్జీలు లేకుండా వైద్యం అందిస్తున్నారు. కేవలం మందులకు మాత్రమే నామమాత్రపు రుసుము తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రింబవళ్లు అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. డబ్బు లేకపోయినా చికిత్సను ఆపకుండా, తర్వాత చెల్లించాలని చెప్పడం ఆయన ప్రత్యేకతగా చెప్తున్నారు.
"నా ఉపాధ్యాయుల వల్లే నేను చదువుకోగలిగాను. ఆ తర్వాత స్నేహితుల సహాయంతో ఈ క్లినిక్‌ను ప్రారంభించాను. విద్యార్థి దశలో మా కుటుంబం వైద్య ఖర్చుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడింది. అందుకే మధ్యతరగతి, పేద కుటుంబాల వైద్య భారం తగ్గించాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వ వైద్య ఉద్యోగం వస్తే భవిష్యత్తులో 'ఐదు రూపాయల డాక్టర్'గా మారడమే నా లక్ష్యం. ఈ క్లినిక్ ద్వారా పెద్దగా ఆదాయం రాకపోయినా, సేవ చేస్తున్నానన్న సంతృప్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది."
- అధిమరిమరుతు, డాక్టర్
చికిత్స ఖర్చు కేవలం రూ.150 మాత్రమే
అలాగే స్థానిక ప్రజలు తనకు ఎంతో మద్దతుగా ఉంటారని ఆదిమారిమరుతు అన్నారు. వారు ఆయన్ని కుటుంబ మిత్రునిగా భావిస్తారని చెప్పారు. సొంత ఊరిలో తెలిసిన వారి నుంచి పొందే మద్దతు కంటే, ఇలా తెలియని ఊరిలో అపరిచితుల నుంచి లభించే మద్దతులో తనకు ఎక్కువ ఆనందానిస్తోందని తెలిపారు. స్థానిక మహిళ దీపలక్ష్మి మాట్లాడుతూ, "మందులకు మాత్రమే ఆయన నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. నా పిల్లల చికిత్స కోసం నేను ఎప్పుడూ 50 రూపాయల కంటే ఎక్కువ చెల్లించలేదు. ఇటీవల నా కొడుకు కామెర్ల (జాండిస్) బారిన పడ్డాడు. అప్పుడు ఇక్కడే చికిత్స చేయించాను. నా చికిత్స కోసం కూడా ఎప్పుడూ 150 రూపాయల కంటే ఎక్కువ చెల్లించలేదు. ఈ క్లినిక్ మా ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది" అని తెలిపారు.
మరో స్థానికురాలు అనంతి మాట్లాడుతూ, "ఆయన ఇక్కడ పిల్లలకు అద్భుతమైన వైద్య సేవలను అందిస్తారు. మేం సంప్రదించినప్పుడల్లా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా సందేహాలను నివృత్తి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నా కుమారుడికి ఇక్కడ డెంగ్యూ జ్వరానికి చికిత్స అందించారు. మా దగ్గర అప్పటికప్పుడు డబ్బు లేనప్పుడు కూడా, తర్వాత చెల్లించమని ఆయన చెప్పేవారు" అని ప్రశంసించారు.
85 ఏళ్ల ఏజ్‌లో వైద్యుడి నిస్వార్థ సేవ- 40ఏళ్లుగా రోగులకు ఫ్రీ వైద్యం
27ఏళ్లుగా పిల్లలకు ఫ్రీగా వైద్యం- పెన్షన్ డబ్బులతో క్లినిక్- ఒడిశా పల్లెటూరిలో తెలుగు మహిళ సేవ

