ఆ ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు- అందరూ పోలీసు ఉద్యోగులే!
ఒకప్పుడు నిరక్షరాస్యులుగా ఉన్న కుటుంబం- ఇప్పుుడు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్న ఆదర్శ మహిళలు- నలుగురు కుమార్తెలతో పాటు కోడలికి కూడా పోలీస్ ఉద్యోగం- ఆనందంలో కుటుంబ పెద్దలు

Published : June 3, 2026 at 8:29 PM IST
Five Daughters Selected As Police : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. అందులో పోలీసు ఉద్యోగం అంటే ఎవరైనా హ్యాప్పి అవాల్సిందే. అయితే, బిహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అమ్మాయిలు పోలీసు ఉద్యోగాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కుటుంబంలో ఒక్కరే ఉద్యోగం సాధించడం కష్టతరంగా మారిన ఈరోజుల్లో కుటుంబంలోని మొత్తం మంది ఉద్యోగులే అవడం మరో విశేషం. అంతేకాదు, ఒకప్పుడు నిరక్ష్యరాసులుగా ఉన్న ఆ కుటుంబంలో ప్రస్తుతం 30 మంది ఉద్యోగస్థులు ఉండటం గమనార్హం. మరి ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కెద్దాం పదండి.
గయాలో 'బంగాల్ మహతో' వంశానికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే, ఈ కుటుంబానికి పెద్ద చరిత్రే ఉంది. బంగాల్లోని మహతో ఆ కుటుంబానికి ముత్తాత. ఆయన గౌరవార్థం, ఆ గ్రామానికి 'బంగాల్ బీఘా' అని పేరు పెట్టారు. అయితే, ఒకప్పుడు ఈ కుటుంబంలో చదువుకున్న వారు ఎవరూ లేరు. విద్యా సౌకర్యాలు కూడా లేవు. ఫలితంగా నిరక్షరాస్యత ఆ కుటుంబ మూలాల్లోనే లోతుగా పాతుకుపోయింది. బంగాల్ మహతో వంశం విస్తరిస్తూ, కుమారులు, మనవళ్లు జన్మిస్తున్నప్పటికీ నిరక్షరాస్యత మాత్రం అలాగే కొనసాగింది.

అయితే, ఈ సమస్యకు ప్రధాన కారణం, ఆ గ్రామంలో, సమీప ప్రాంతాల్లో ఎక్కడా ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేకపోవడమే. విద్య కోసం అందుబాటులో ఉన్న వనరులన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేవి. ఆ కాలంలోని రవాణా, మౌలిక సదుపాయాల పరిమితుల దృష్ట్యా, ఆ దూర ప్రాంతాలకు చేరుకోవడం గ్రామస్థులకు కష్టతరంగా ఉండేది.

అందరూ ప్రభుత్వ ఉద్యోగులే!
అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. సుమారు 20 నుంచి 25 సంవత్సరాల క్రితం, ఇదే గ్రామంలో నివసిస్తున్న ఆ కుటుంబ సభ్యుడైన 'రామ్ బలి యాదవ్' అనే వ్యక్తి తన బంధువులకు విద్యావంతులను చేయాలని దృఢ సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో తానే స్వయంగా ఆ గ్రామంలో ఒక పాఠశాలను స్థాపించారు. అప్పటినుంచి ఆ కుటుంబ సభ్యులు విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. ఫలితంగా 1993లో వాళ్లు ఉద్యోగాలు సాధించారు. అంతేకాదు, ఉన్నత విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లడమూ ప్రారంభించారు. తద్వారా ఉద్యోగ అవకాశాల పరంపర నిరంతరాయంగా మొదలైంది.
అలా ఈ కుటుంబ సభ్యులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సాధించడం ప్రారంభించారు. నేడు ఈ కుటుంబంలోని ఉద్యోగస్థుల సంఖ్య కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే కాదు. 20 మందికి పైగా సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాలున్నారు. అంతేకాకుండా 10 మందికి పైగా సభ్యులు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో కలిపి, మొత్తం 30 నుంచి 35 మంది వ్యక్తులు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. అలా ఈ కుటుంబం ఇకపై నిరక్షరాస్య కుటుంబంగా కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణుల వంశంగా గుర్తింపు పొందుతోంది.
ఐదుగురికి పోలీసు విభాగంలో ఉద్యోగం
తాజాగా ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు కుమార్తెలు పోలీసు విభాగంలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విజయంతో, ఈ కుటుంబంలోని ఉద్యోగ అవకాశాలు కేవలం కుమారులకు మాత్రమే పరిమితం కాదని, కుమార్తెలకు కూడా ఇప్పుడు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిలో నలుగురు కజిన్స్ (బంధువుల కుమార్తెలు) కాగా, ఒకరు ఆ కుటుంబంలోని కోడలు. ప్రీతి, రీతి సొంత అక్కాచెల్లెళ్లు. మరొకరు, సోనమ్ కుమారి, రుధా కుమారి. ఇక, సింకు కుమారి(కోడలు). ఈ సందర్భంగా ఉద్యోగం సాధించడంలో వారు ఎదుర్కున్న అనుభవాల గురించి వివరించారు.
"నా జీవితంలో ఏదైనా సాధించి, ఒక మంచి స్థానానికి చేరుకోవాలన్నదే నా కల. ఈ రోజు ఆ కలలు నిజమయ్యింది. మా కుటుంబం ఇప్పుడు మా పట్ల ఎంతో గర్వంగా ఉంది. మేమంతా కలిసి చదువుకునే వాళ్లం. అంతేకాదు, ఒకరికొకరు అండగా నిలిచాం. మేం మా ఇంటి బాధ్యతలను, చదువును రెండింటినీ సమానంగా నిర్వహించుకుంటూ వచ్చాం. చివరకు విజయాన్ని అందుకున్నాం."
- ప్రీతి కుమారి
వివిధ శాఖల్లో ఉద్యోగాలు
ఈ కుటుంబంలో సభ్యుడైన సికందర్ యాదవ్ మాట్లాడుతూ, "ఈ రోజు బిహార్ రాష్ట్రం మొత్తానికి మా గ్రామం పేరు తెలిసింది. మా ఇంటి ఆడబిడ్డలు, కోడళ్లు మా కుటుంబ కీర్తిని తీసుకువచ్చినందుకు, మాకు ఎంతో ఆనందంగా ఉంది" అని అన్నారు. అలాగే ఈ విజయం కోసం వారంతా ఎంతో కష్టపడ్డారని చెప్పారు. వారి కారణంగానే ఈ చిన్న గ్రామం పేరు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. తమ కుటుంబంలో పలువురు ఇంజినీర్లుగా, రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కొందరు బిహార్ పోలీస్ శాఖలో పనిచేస్తుండగా, మరికొందరు సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా (JCOs), అలాగే గ్రూప్ 'డీ' సేవల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.
"నేను 2024 నుంచే దీని కోసం సన్నద్ధమవుతున్నాను. నా పుట్టిళ్లు, అత్తవారిళ్లు, ఇరువైపుల నుంచి నాకు పూర్తి సహకారం లభించింది. నేను పెళ్లికి ముందు చదువుకునేదాన్ని. నా పెళ్లి తర్వాత కూడా చదువును కొనసాగించాను. నా విద్యనంతటినీ నేను ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేసి విజయం సాధించాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పట్నాలో పోస్టింగ్ లభించింది."
- సింకు కుమారి, బెంగాల్ మహతో ఇంటి కోడలు
అయితే నేటికీ ఈ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రభుత్వ పాఠశాలకు చేరుకోవాలంటే ఎవరైనా సరే అనేక కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 'బంగాల్ బీఘా' అనే ఈ గ్రామం పర్వతాల ఒడిలో నెలకొని ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అటవీ ప్రాంతమే. అయినప్పటికీ, ఇక్కడ వెలిగిన విద్యా జ్యోతి ఇప్పుడు నలుదిక్కులా విస్తరించే దిశగా పయనిస్తోంది. తద్వారా, ఈ కుటుంబ సభ్యుల మధ్య ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం చాలా గొప్ప విషయంగా పరిగణించవచ్చు.
వైకల్యంపై పోరాడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కవలలు- సరిగ్గా చదవడం, రాయడం రాకున్నా!

